Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆది నుంచీ అభివృద్ధి పంథాను అవలంబిస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ అంటూ వృద్ధాప్య ఫించన్ల ఫైలుపై తొలి సంతకం చేసిన ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా సంక్షేమ పథకాలను ప్రకటిస్తూనే ఉన్నారు. వాటిని అమలు చేయడంలోనూ సరికొత్త పంథాను నెలకొల్పారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన ఒరవడిని సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతీ సంక్షేమ పథకానికి సంబంధించి క్యాలెండర్‌ని ప్రకటించారు. ఏ పథకానికి ఎన్ని నిధులు ఏ తేదీన విడుదల అవుతాయనే వివరాలు ముందుగా తెలియజేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయా పథకాల కోసం ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా.. సచివాలయాలను ఏర్పాటు చేసి వలంటీర్ల ద్వారా నేరుగా ప్రజలకు చేరవేస్తున్నారు.
ఇకపై ఆ పథకాలు మరింత పక్కాగా అమలయ్యేలా మరింత దృష్టి సారించనున్నారు. కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నరగా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనలు అంతగా జరగలేదు. కరోనా సంబంధిత చర్యలలో నిమగ్నం కావడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఏపీలో కరోనా పాజిటివ్ రేటు బాగా తగ్గింది. కరోనా కాలంలో ఇరవై అయిదు శాతం ఉండేది. ప్రస్తుతం రెండున్నర కన్నా తక్కువే నమోదవుతోంది. దీంతో సీఎం జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పథకాల అమలు తీరును, ఇబ్బందులను తెలుసుకోవాల్సిందిగా మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ దిశా నిర్దేశం చేశారు.అధికారులకు అంతకు ముందే ఆదేశాలు జారీ చేశారు.
Also Read : తెలంగాణలో చంద్రబాబు వ్యాఖ్యలు దేనికి సంకేతం?
సచివాలయ వ్యవస్థను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్ వాటి పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే మంత్రులు సచివాలయాలను సందర్శిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. అంతేకాకుండా.. ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డే రంగంలోకి దిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు నిరంతరం సమీక్షలు, సమావేశాల ద్వారా పథకాల ప్రగతిని తెలుసుకుంటూ తగిన చర్యలు చేపడుతున్న ఆయన ఇకపై నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. డిసెంబర్ నుంచి తాను కూడా సచివాలయాలను సందర్శిస్తూ ప్రతి పర్యటనలో సచివాలయాలను చూస్తానని తాజాగా ఆయన వెల్లడించారు.
గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చేస్తున్న సమయంలో దృష్టి పెట్టాల్సిన అంశాలపై మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిపి బృందాలుగా ఏర్పడి ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేలా ఆ గ్రామంలో పర్యటించాలని ఇప్పటికే ప్రజాప్రతినిధులకు చెప్పారు. ప్రతినెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం, సెప్టెంబరు 24, 25 తేదీల్లో సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమం, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, ముఖ్యమైన ఫోన్ నంబర్లతో కూడిన పాంప్లెట్లను వారికి అందించేలా ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించుకున్న రోజుల్లోగా అర్హులైన వారికి పథకాలు మంజూరు జరగాల్సిందే అని జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారు.
ఇప్పుడు జగన్ నేరుగా ప్రజల్లోకి వెళ్తుండడం రాజకీయంగా కూడా ఆసక్తిగా మారింది. నిరంతర సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలతో బిజీగా ఉండడం, కరోనా కారణంగానూ జగన్ ప్రజలను నేరుగా కలుసుకున్న సందర్భాలు తక్కువే. అయినప్పటికీ ఆయన అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందుకుంటూ ప్రజలు ఆయనను అపూర్వంగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ రంగంలోకి దిగి సచివాలయాలను సందర్శించనుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మిగిలిన అర్థ భాగం పాలనలో జగన్మోహన్ రెడ్డి మరింత దూకుడుగా వ్యవహరించనున్నారనే విషయం స్పష్టమవుతోంది.
Also Read : జగన్ సర్కార్ ఎక్కడా తగ్గలే…..