iDreamPost
android-app
ios-app

గ్రామీణ ఏపీ రూపు మార్చబోతున్న రైతు భరోసా కేంద్రాలు

  • Published Nov 29, 2020 | 4:30 AM Updated Updated Nov 29, 2020 | 4:30 AM
గ్రామీణ ఏపీ రూపు మార్చబోతున్న రైతు భరోసా కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ లో గ్రామం కేంద్రంగా అభివృద్ధి ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇన్నాళ్లుగా ప్రతీ గ్రామ పంచాయితీ పరిధిలో ఒక్క కార్యాలయం ఉంటే అదే పెద్ద గొప్ప. పంచాయితీ భవనాలు కూడా లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో సాగిన పంచాయితీ ఆఫీసులు కూడా చాలా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ప్రతీ గ్రామంలో గ్రామ సచివాలయ నిర్మాణం జరుగుతోంది. దానికి తోడుగా రైతు భరోసా కేంద్రాలు వస్తున్నాయి. గ్రామీణ వైద్యశాల కూడా సిద్ధమవుతోంది. ఇలా అన్ని కీలక రంగాలకు సంబంధించిన ఒక్కో కార్యాలయం గ్రామాల్లో నిర్మాణంలో ఉన్నాయి. అవన్నీ పూర్తయితే అభివృద్ధి మొత్తం గ్రామం ఆధారంగా జరగడానికి సర్వ విధాలా ఆస్కారం వస్తుంది.

ప్రస్తుతమున్న వ్యవస్థలో వ్యవసాయ శాఖకి, రైతుకి పెద్దగా సంబంధం లేదు. మండలానికి ఒక్క వ్యవసాయ విస్తరణాధికారి ఉంటే నెలకు ఒక్కో సారి ఆయా గ్రామాలకు వెళ్లడమే విశేషం. అలా వెళ్లినా కొద్ది మంది రైతులతో మాత్రమే వారికి సంబంధం ఉండేది. దాంతో ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం ఎదుగూ బొదుగూలేని దశో ఉంది. దానిని సరిదిద్దే దశలో ప్రతీ రెండు వేల మందికి ఒక్క సచివాలయం, ఆయా సచివాలయాల్లో వ్యవసాయ అసిస్టెంట్ నియామకం జగన్ హయంలో జరిగింది. వారి కోసం రైతు భరోసా కేంద్రాలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వ్యవసాయానికి సంబంధించిన సకల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఆర్బీకేలలో వ్యవసాయ, సెరీ కల్చర్, హార్టీ కల్చర్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సకల సమస్యలను తక్షణం పరిష్కరించే అవకాశం వస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టే పథకాలు నేరుగా రైతులకు చేరుతాయి.

రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల నిర్మాణంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది. రూ. 2190 కోట్ల ను దాని కోసం వెచ్చిస్తోంది. మొత్తం 10,408 ఆర్బీకేలను నిర్మిస్తోంది. ఒక్కో కేంద్రానికి రూ. 21లక్షలు వ్యయం చేస్తోంది. ఇప్పటికే 4349 కేంద్రాలలో పునాది పనులు పూర్తయ్యాయి. ప్రాధమిక నిర్మాణం సిద్ధం కావడంతో ఇక పనులు వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే మార్చి నాటికి వాటిని సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతుకి విత్తనం నుంచి ఉత్పత్తి అమ్మకం వరకూ అన్నింటికీ ఆర్బీకేలు కేంద్రాలుగా మారబోతున్నాయి. తద్వారా గ్రామీణ వ్యవసాయ రంగం పూర్వ వైభవం సంతరించుకునే దిశలో సాగేందుకు ప్రణాళికలు కార్యరూపం దాల్చబోతున్నాయి.

ఇప్పటికే సచివాలయంలో పది మంది వరకూ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. వివిధ సేవల కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం రాకుండా వాలంటీర్ ద్వారా ఇంటి నుంచే పొందడానికి అవకాశం వస్తోంది. దాంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాలకేంద్రాలు కూడా ఆర్బీకేలలో ప్రారంభించారు. తద్వారా మొత్తం రైతాంగానికి మేలు చేసే బృహత్తరకార్యక్రమం జోరుగా ముందుకెళుతున్నట్టు చెప్పవచ్చు.