iDreamPost
android-app
ios-app

YS Jagan, Covid Vaccination – జ‌గ‌న్ ఆదేశాలు : వైద్య శాఖాధికారుల ఉరుకులు, ప‌రుగులు

YS Jagan, Covid Vaccination – జ‌గ‌న్ ఆదేశాలు : వైద్య శాఖాధికారుల ఉరుకులు, ప‌రుగులు

సాధార‌ణంగా ప్ర‌తీ కుటుంబం విద్య‌, వైద్యానికే అత్య‌ధికంగా ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది. ఈ విష‌యాన్ని గుర్తించిన ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌జ‌ల భారాన్ని త‌గ్గించేలా ఆ రెండింటిపైనా ప్ర‌ధానంగా దృష్టి కేంద్రీక‌రించింది. ప్ర‌భుత్వ రంగంలోని ఆయా విభాగాల‌ను ప‌టిష్టం చేసి ప్ర‌జ‌లు ఇటువైపు వ‌చ్చేలా చేయ‌డంలో స‌క్సెస్ సాధించింది. దాని ఫ‌లిత‌మే.. ఏపీలో ఎన్న‌డూ లేన‌ట్లుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు. అలాగే.. వైద్య రంగంలో కూడా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చారు.

ప్ర‌ధానంగా క‌రోనా కాలంలో తీసుకున్న చ‌ర్య‌లు దేశ వ్యాప్తంగానే గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు ఒమిక్రాన్ నేప‌థ్యం వ్యాప్తి ప్ర‌చార నేప‌థ్యంలోనూ జ‌గ‌న్ దూర దృష్టితో ఆలోచిస్తున్నారు. తాజాగా కీల‌క ఆదేశాలు జారీ చేశారు.

మ‌రోసారి వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష జ‌రిపిన జ‌గ‌న్.. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో జనరల్‌ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అంతేకాదు.. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో సిబ్బంది ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆలోగా కొత్త రిక్రూట్‌మెంట్లను కూడా పూర్తిచేయాలని చెప్పారు. వైద్యం పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా కోవిడ్‌ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు రంగాలలోని ఆస్పత్రులను కూడా దీనికి సిద్ధంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత ఉధృతం చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ చేయాలన్నారు. ఫీవర్‌ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్‌ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో 6 ఒమిక్రాన్‌ కేసులున్నాయని అధికారులు తెలిపారు. వీరిలో ఎవరు కూడా ఆస్పత్రిపాలు కాలేదని తెలిపారు. అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం భయాందోళనలు అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతరత్రా ప్రాంతాలనుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. కోవిడ్ కేసుల డేటాను పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా ఇంటింటికీ ఫీవర్‌ సర్వే తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశాల నేప‌థ్యంలో ఉన్న‌తాధికారులు రంగంలోకి దిగారు. జిల్లాల వారీగా అధికారుల దృష్టికి ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను తీసుకెళ్లి త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేలా సిద్దం చేశారు. ఈమేర‌కు ఆయా ఆస్ప‌త్రుల్లో పూర్తి స్థాయి సిబ్బంది ఉండేలా.. ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు. నివేదిక‌ను సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డారు. అలాగే, ఇత‌ర దేశాలు, రాష్ట్రాల నుంచి సాగే రాక‌పోక‌ల‌పై నిఘా పెంచారు. వ‌లంటీర్ల‌ను కూడా ఇందులో భాగ‌స్వామ్యం చేసి ముఖ్యంగా ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే వాళ్లు టెస్టులు చేసుకున్నారా, లేదా గ‌మ‌నించాల‌ని పేర్కొంటున్నారు.