iDreamPost
android-app
ios-app

వ్యాక్సినేష‌న్ లోనూ జ‌గ‌న్ మార్క్

వ్యాక్సినేష‌న్ లోనూ జ‌గ‌న్ మార్క్

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క స‌మ‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అంద‌రి కంటే భిన్నంగా ఆలోచిస్తున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని ఇప్పుడు దేశ‌మంతా న‌మ్ముతోంది. వ్యాక్సినేష‌న్ కూడా వేగంగా కొన‌సాగుతోంది. మొద‌ట్లో అంత‌గా ఆస‌క్తి చూప‌ని ప్ర‌జ‌లు క‌రోనా రెండో ద‌శ సృష్టిస్తున్న క‌ల‌క‌లంతో వ్యాక్సిన్ కోసం ఆస్ప‌త్రులు, వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌కు ప‌రుగులు తీస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఒకేసారి వంద‌లాది మంది గుమిగూడుతున్నారు. దీనివ‌ల్ల క‌రోనాను నియంత్రించే వ్యాక్సిన్ దొర‌క‌డం మాట దేవుడెరుగు.. అక్క‌డే క‌రోనా సోకే ప్ర‌మాదం ముంచెత్తుతోంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. వ్యాక్సినేష‌న్ కేంద్రాల వ‌ద్ద ర‌ద్దీ లేకండా సాఫీగా వ‌చ్చి.. ప్ర‌శాంతంగా వ్యాక్సిన్ వేసుకుని వెళ్లేలా ఇంటికే వెళ్లి టోకెన్ల పంపిణీ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న అనేది ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తోంది. రేష‌న్, పింఛ‌న్లు, చివ‌ర‌కు ఇళ్ల స్థ‌లాలు కూడా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. స‌చివాల‌య‌, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా పాల‌న‌లో స‌రికొత్త అధ్యాయానికి జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టారు. ఇప్పుడు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో కూడా నూత‌న విధానం ప్ర‌వేశ పెట్టారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వేలాది మంది జ‌నం ఆరోగ్య కేంద్రాల వ‌ద్ద‌కు వ‌స్తుండ‌డంతో, క‌రోనా వ్యాప్తికి ఇది దోహ‌దం చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం గుర్తించింది. వ్యాక్సినేష‌న్ కోసం జ‌నం తండోప‌తండాలుగా వ‌స్తున్న నేప‌థ్యంలో కొత్త స‌మ‌స్య‌కు దారి తీస్తోంద‌నే ఫిర్యాదులు రావ‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్‌కు కొత్త విధానం అమ‌లు చేసేందుకు అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు క‌రోనా యోధులు, 60 ఏళ్లు పైబ‌డిన వారు, 45 ఏళ్లు దాటిన వారిగా విభ‌జించి రెండో డోస్ వ్యాక్సిన్ వేసేందుకు ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక వేస్తున్నారు. ఈ విధానం లో మూడు ర‌కాల టోకెన్ల‌ను ఆశా కార్య‌క‌ర్త‌లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వ‌ద్ద‌కే వెళ్లి అంద‌జేస్తారు.

ఎవ‌రెవ‌రికి ఎప్పుడెప్పుడు టీకా వేస్తార‌నే పూర్తి స‌మాచారం ఆ టోకెన్‌లో ఉంటుంది. దాని ప్ర‌కారం నిర్దేశించిన స‌మ‌యానికి వెళితే టీకా వేస్తారు. ఈ విధానంలో ర‌ద్దీని నియంత్రించ వ‌చ్చ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఆలోచ‌న‌. ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ కోసం రెండు రోజుల పాటు ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ను నిలిపేసింది. కొత్త విధానం అందుబాటులోకి వ‌స్తే వ్యాక్సిన్ కోసం ఆయా కేంద్రాల చుట్టూ తిరిగే అవ‌స్థ‌లు ప్ర‌జ‌ల‌కు త‌ప్ప‌నున్నాయి. ఇంటి వ‌ద్దే టోకెన్ పొంది, అందులో పేర్కొన్న సెంట‌ర్ వ‌ద్ద‌కు, నిర్ణీత స‌మ‌యానికి వెళ్లి వ్యాక్సిన్ పొందొచ్చు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్ర‌తీ అంశాన్నీ జ‌గ‌న్ నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ట్లుగా ఆయ‌న తీసుకుంటున్న కొత్త నిర్ణ‌యాల ద్వారా తెలుస్తోంది.