iDreamPost
android-app
ios-app

పేద‌ల ఇళ్ల‌పై ఏపీ స‌ర్కారు మ‌రో కీల‌క నిర్ణ‌యం

పేద‌ల ఇళ్ల‌పై ఏపీ స‌ర్కారు మ‌రో కీల‌క నిర్ణ‌యం

రాష్ట్రంలోని పేద‌లు అంద‌రికీ సొంత ఇల్లు ఉండాల‌ని తొలి నుంచీ ఏపీ స‌ర్కారు భావిస్తోంది. దానిలో భాగంగానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన కొన్నాళ్ల‌కే ముప్పై ల‌క్ష‌లమందికి ఇళ్ల స్థ‌లాల‌ను అంద‌జేయాల‌ని సంక‌ల్పించారు. విప‌క్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగ‌మించి స్థ‌లాల‌ను అంద‌జేశారు. అంతేకాకుండా ఒకేసారి ప‌దిహేను ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణాల‌ను ప్రారంభించారు.

‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం లో భాగంగా తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు కూడా పూర్త‌య్యాయి. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా లబ్ధిదారుల వెసులుబాటు కోసం పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున రుణాలు ఇప్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లబ్ధిదారులపై అధిక ధ‌ర‌ల భారం తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని మార్కెట్‌ కంటే తక్కువ ధరలకు సర్కార్‌ సమకూరుస్తోంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కంపెనీల సిమెంట్‌ బస్తా ధర ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి రూ. 310 నుంచి రూ. 450 వరకూ ఉంది.

ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు ప్రభుత్వం మార్కెట్‌ ధరల కంటే చాలా తక్కువకు సిమెంట్‌ సరఫరా చేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం లల్లో పోర్ట్‌ల్యాండ్‌ పోజోలానా సిమెంట్‌ (పీపీసీ) బస్తా రూ. 235 కు, ఆర్డినరీ పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌ (ఓపీసీ) బస్తా రూ. 245కు సరఫరా చేస్తున్నారు. మిగిలిన పది జిల్లాల్లో పీపీసీ బస్తా రూ. 225కు, ఓపీసీ రూ. 235 చొప్పున అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో సిమెంట్‌ తయారీ ఫ్యాక్టరీలు లేకపోవడంతో రవాణా ఖర్చులు అధికంగా ఉండటం వల్ల స్వల్ప వ్యత్యాసం ఉంటోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కిలో ఐరన్‌ను రూ. 62 నుంచి 64లతో అందిస్తున్నారు.

ఒక్కో ఇంటి నిర్మాణానికి 90 బస్తాల సిమెంట్, 480 కిలోల ఐరన్‌తో పాటు 14 రకాల నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తోంది. అదే విధంగా ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. డోర్లు, కిటికీ ఫ్రేమ్‌లు, ఇతర వస్తువులను తమ అభిరుచులకు అనుగుణంగా స్థానికంగా కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ వస్తువులను కూడా ఎవరైనా కావాలని అడిగితే అధికారులు సరఫరా చేస్తున్నారు. సిమెంట్, ఐరన్‌లో సబ్సిడీ ఇస్తుండటంతో ఒక్కో లబ్ధిదారుడిపై రూ. 14 వేల నుంచి రూ. 20 వేలు వరకూ ఆర్థిక భారం తగ్గుతోంది. ఈ డబ్బు ఇంటిపై ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవడానికి వీలు కలుగుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు.

Also Read : ఏపీలో మరో కొత్త పథకం