Idream media
Idream media
వ్యాక్సినేషన్ విధానంపై కేంద్రం అనుసరిస్తున్న తీరును వివరిస్తూ, ముఖ్యమంత్రులం అందరమూ ఒకే మాటపై నిలబడాలని పేర్కొంటూ దేశంలోని అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖలు రాసిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రమే పూర్తిగా చేపట్టాలని అందరం కోరదామని జగన్ ఆ లేఖలో మిగిలిన ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అన్ని రాష్ట్రాలకూ ఉచితంగా కేంద్రమే వ్యాక్సిన్ అందిస్తుందని, రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం రూపాయి ఖర్చు చేయనవసరం లేదని ప్రకటించారు. ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో జగన్ అభిమతానికి అనుగుణంగానే ప్రధాని తాజా నిర్ణయం ఉండడంతో జగన్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా..
రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యతలో తలెత్తుతున్న ఇబ్బందులను కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలని, ఆ విషయంలో అందరం ఒకే మాటపై ఉందామంటూ ఇటీవల ముఖ్యమంత్రులకు జగన్ లేఖలు రాశారు. లేఖలు రాయడంపై నాడు చర్చ జరిగితే, ఆ లేఖల్లోని అంశాలపై కేంద్రం తాజాగా స్పష్టత ఇవ్వడం ఇప్పుడు మరో చర్చనీయాంశంగా మారింది. తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులు తేవడం ద్వారా రాష్ట్రంలో టాక్ ఆప్ ది సీఎంగా మారడమే కాదు. దేశంలో పలు అంశాలపై జరుగుతున్న లోపాలను కూడా ఎత్తిచూపుతూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నారు.
ప్రధానికి జగన్ కృతజ్ఞతలు
వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇకపై పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధాని మోదీ తెలపడంపై సీఎం జగన్ స్పందించారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో వ్యాక్సిన్లపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని సీఎం పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాటంలో మన చేతిలో ఉన్న ఒకే ఒక్క అస్త్రం వ్యాక్సిన్ అని అన్నారు. ఇంతకాలం వ్యాక్సిన్లపై ఉన్న సందిగ్ధతను తొలగించారు.. టీకా కార్యక్రమాన్ని జాతీయ ఎజెండాగా భావించి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. లోపాలను ఎత్తి చూపడమే కాదు.. లోపాలను వెంటనే సరిదిద్దుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపి జగన్ చాతుర్యత ప్రదర్శించారు.