Idream media
Idream media
విశాఖపట్టణాన్ని ఏపీ రాజధానిగా ప్రకటించినప్పటి నుంచీ ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజధానిగా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చితే కావాల్సిన సౌకర్యాలపై కార్యాచారణ రూపొందిస్తోంది. ఉద్యోగ, ఉపాధి కోసం కొద్ది కాలంలోనే దాదాపు ముప్పై శాతం జనాభా అదనంగా విశాఖకు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. పెరగనున్న జనాభా, విస్తరించనున్న నగరానికి అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. రవాణ ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తుగా దృష్టి పెట్టింది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసిన ప్రభుత్వం దీన్ని మిగిలిన జిల్లాలతో కనెక్ట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా విశాఖను సైతం భోగాపురం ఎయిర్ పోర్టుకు కనెక్ట్ చేసేలా రహదారి పనులను త్వరలో చేపట్టనుంది. అదే సమయంలో విశాఖలో మురికివాడలను కొత్త మోడల్ లో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది.
విజయనగర జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమయ్యాక విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయాన్ని అక్కడకు తరలిస్తామని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీని ద్వారా ఉత్తరాంధ్ర లోని మిగిలిన రెండు జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికే రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది.
Also Read:బాబూ..మీకు అర్థమవుతోందా.. ఏపీ అప్పులపై కేంద్రం సానుకూల స్పందన
విశాఖ పోర్టు ట్రస్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ఆరు వరుసల రహదారి నిర్మాణం సిద్ధం కానుంది. సీ పోర్టు నుంచి భీమిలి వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలోనూ, భీమిలి నుంచి భోగాపురం వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) పర్యవేక్షణలో రహదారి నిర్మాణం చేపట్టనుంది. రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వ భూముల్నే ఎక్కువగా వినియోగించుకుంటామని.. అవసరమైతే తప్ప ప్రైవేట్ భూములు సేకరించకూడదని భావిస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి చెబుతున్నారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో గరిష్ట వేగం తగ్గేలా నిర్మాణం చేపడుతున్నామన్నారు.
విశాఖకు, జిల్లాలకు కనెక్టివిటీ పెంచడంతో పాటు నగరం పరిధిలోనూ రవాణ ఇబ్బందులు తలెత్తకుండా డబ్బై మీటర్ల మేర రహదారులను వెడల్పు చేసేందుకు సర్వే జరుగుతోంది. అంతేకాకుండా నగరం దాటిన తర్వాత రహదారి వెడల్పు చేసేందుకు ప్రయత్నిస్తోంది. రహదారి నిర్మాణంలో భాగంగా వాకింగ్, సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయనున్నారు. న్యాయస్థానంలో కేసులు కొలిక్కి రాగానే ఎయిర్‌పోర్టు, రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విజయసాయిరెడ్డి చెప్పడం ద్వారా.. రాజధానిగా విశాఖ రూపురేఖలు త్వరలో మారే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
Also Read: టీవీ9 దేవి నాగవల్లి… దాసరికి ఏమవుతుంది…?