iDreamPost
android-app
ios-app

చ‌రిత్ర‌లో నిలిచిపోయే నిర్ణ‌యాల‌తో జ‌గ‌న్ స‌ర్కారు

  • Published Jan 02, 2020 | 1:58 AM Updated Updated Jan 02, 2020 | 1:58 AM
చ‌రిత్ర‌లో నిలిచిపోయే నిర్ణ‌యాల‌తో జ‌గ‌న్ స‌ర్కారు

వైఎస్సార్ హ‌యంలో కూడా అది ఒక డిమాండ్ . చంద్ర‌బాబు పాల‌న‌లో కనీసం స్పంద‌న కూడా క‌నిపించ‌లేదు. కానీ జ‌గ‌న్ అధికారంలోకి రాగానే అమ‌లులోకి వ‌చ్చేసింది. ఆరు నెల‌లు తిర‌గ‌క‌ముందే అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసింది. అది ప‌రంప‌ర కొన‌సాగిస్తూ తాజాగా 60 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన ఆర్టీసీని కొత్త మ‌లుపు తిప్పారు. నైజాం న‌వాబు పాల‌న‌లో ప్రారంభ‌మయ్యి, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విస్త‌రించిన ఆర్టీసి ఈసారి కొత్త ఏడాదిలో కొత్త ప్ర‌స్థానం మొద‌లుపెట్టింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని మొత్తం 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంతో ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారిపోయారు.

జ‌న‌వ‌రి 1 నుంచిఅమ‌లులోకి వ‌చ్చిన ఈ నిర్ణ‌యంతో సుదీర్ఘ‌కాలం నాటి క‌ల నెర‌వేరినందుకు ఆర్టీసీ కార్మికులు ఆనంద‌భ‌రితుల‌వుతున్నారు. ప‌క్క రాష్ట్రం తెలంగాణాలో ఆర్టీసీ సిబ్బంది స‌మ్మె చేసి ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌మ‌ని డిమాండ్ చేసినందుకు కేసీఆర్ స‌ర్కార్ ఎంత‌గా ముప్పు తిప్ప‌లు పెట్టిందో అంద‌రూ చూశారు. అదే స‌మ‌యంలో ఏపీలో విలీనం సాధ్యం కాద‌ని కూడా సీఎం హోదాలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అనేక‌మంది నిపుణులు కూడా ఆర్టీసీ విలీనం ప‌ట్ల ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. కానీ తొలి క్యాబినెట్ భేటీలోనే తీసుకున్న నిర్ణ‌యానికి అనుగుణంగా కొత్త ద‌శాబ్ది తొలినాడే అమ‌లులోకి తీసుకురావ‌డం ద్వారా జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త చ‌రిత్ర సృష్టించింది.

Read Also: TSRTC లో ఆన్ రోడ్ తనిఖీలకు చెల్లు..

ఇప్ప‌టికే పోలీసుల వీక్లీ ఆఫ్ నిర్ణ‌యం దేశంలోనే తొలిసారిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. ఎన్నో ఏళ్ళ క‌ల నెర‌వేరినందుకు పోలీసులు ఇప్పుడు మాన‌సికంగా సంతృప్తిక‌ర‌మైన జీవితం గ‌డిపేందుకు అవ‌కాశం ద‌క్కింద‌ని చెబుతున్నారు. అదే ప‌రంప‌ర‌లో ఆర్టీసీ కార్మికులు కూడా సుదీర్ఘ‌కాలంగా పోరాడుతున్న అంశం ఆచ‌ర‌ణ‌లోకి రావ‌డంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కార్పోరేష‌న్ సిబ్బందిగా అనేక క‌ష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఇక‌పై వాటికి తెర‌ప‌డిన‌ట్టేన‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఆర్టీసీ సిబ్బంది అంతా ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మార‌డంతో వారికి ప‌లు ర‌కాల స‌దుపాయాలు అందుతాయ‌ని ర‌వాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏటా ప్ర‌భుత్వంపై రూ.3,600 కోట్ల భారం ప‌డుతున్న‌ప్ప‌టికీ లెక్క‌చేయ‌కుండా జ‌గ‌న్ తీసుకున్న సాహ‌సోపేత నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల‌కు మోక్షం క‌లిగింద‌ని తెలిపారు.

Read Also: ఏపీ భ‌విష్య‌త్ మార్చ‌బోతున్న నూత‌న ద‌శాబ్ది

ప్ర‌భుత్వ సిబ్బందిలో ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో క‌ష్ట‌ప‌డే వారి ప్ర‌యోజ‌నాలు నెర‌వేర్చ‌డంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశాల‌వుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నింటినీ ప్రైవేటు ప‌రం చేసేందుకు మోడీ మొద‌ల‌కుని ప‌లు ప్ర‌భుత్వాలు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న త‌రుణంలో జ‌గ‌న్ త‌ద్విరుద్ధంగా సాగ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. భారం ప‌డుతున్న ఖాత‌రు చేయ‌కుండా ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసేందుకు ప్ర‌జార‌వాణా విభాగం ఏర్పాటు చేయ‌డం ద్వారా ఏపీలో ప్ర‌భుత్వం సంచ‌ల‌నంగా మారుతోంది. ఇలాంటి నిర్ణ‌యాల ద్వారా జ‌గ‌న్ స‌ర్కారు రాబోయే రోజుల్లో ఏపీ పాల‌నా వ్య‌వ‌స్థ‌ను కొత్త పుంత‌లు తొక్కే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.