Idream media
Idream media
నిజాలు నిలకడమీద తెలుస్తాయంటారు. ఈ నానుడు తెలుగుదేశం పార్టీ నేతలకు, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అతికినట్లు సరిపోతుంది. అభివృద్ధి చేశా, సంపద సృషించా.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు భారీగా అమలు చేశాం.. అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి గొప్పలు చెప్పుకుంటుంటారు. అవన్నీ నేతిబీరకాయ చందం లాంటివేననేలా చంద్రబాబు ద్వారా స్పష్టమవుతున్నాయి. నవరత్నాలు–అందరికీ ఇళ్లు పేరిట వైసీపీ ప్రభుత్వం 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, వాటిలో ఇళ్లు కట్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అర్హులందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఇక రెండు దశల్లో ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ నిన్న లాంఛనంగా ప్రారంభించారు.
ఇళ్ల నిర్మాణంపైనా విమర్శలు..
ఏ పథకం ప్రారంభించినా.. ఏ అభివృద్ధి పనికి శంకుస్థాపన చేసినా.. వెంటనే దానిపై విమర్శలు చేసే చంద్రబాబు.. ఇళ్ల నిర్మాణంపై కూడా అదే తీరును కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వం గాలికబుర్లు చెబుతోంది గానీ ఇళ్లు నిర్మించడం లేదంటూ విమర్శించారు. బడ్జెట్‌లో కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇళ్ల నిర్మాణానికి కేటాయించారని, అవి సరిపోవని చెబుతున్నారు. తన హాయంలో కట్టిన మూడు లక్షల ఇళ్లు సిద్ధంగా ఉన్నా.. వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడు బెడుతున్నారని విమర్శించారు చంద్రబాబు.
ఐదేళ్లలో కట్టిన ఇళ్లు మూడు లక్షలే..
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు– అందరికీ ఇళ్లు కార్యక్రమంపై విమర్శలు చేసిన సమయంలో.. చంద్రబాబు అసలు నిజాలు చెప్పేశారు. తన హాయంలో ఎన్ని ఇళ్లు కట్టించారనేది ఆయన తన నోటి నుంచి బయటపెట్టారు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం మూడు లక్షల ఇళ్లు కట్టించింది. అవి కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. తాను కట్టించిన ఆ మూడు లక్షల ఇళ్లనైనా.. లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకు చంద్రబాబు వద్ద సమాధానం ఉంటుందా..? తాను కట్టిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం పాడు బెడుతోందంటూ విమర్శించే చంద్రబాబు.. వాటిని తన హాయంలోనే ఇస్తే.. అటు లబ్ధిదారులు సంతోషించేవారు.. ఇటు తనకు కూడా ఇళ్లు ఇచ్చాననే సంతృప్తి ఉండేది. కానీ ఆ పని చేయని బాబు.. ఇప్పుడు నోటికి పని చెబుతున్నారు.
పది రెట్లు ఎక్కువ..
విమర్శలు చేసే సమయంలో చంద్రబాబు నిజాలు చెప్పేశారు. బాబు హాయంలో ఐదేళ్లలో మూడు లక్షల ఇళ్లు కడితే.. వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో 30 లక్షల ఇళ్లు కట్టాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే అందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. లబ్ధిదారులకు 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. పిచ్చుకగూళ్లు లాంటి అపార్ట్‌మెంట్లు కాకుండా.. సొంత స్థలంలో సొంత ఇళ్లు ఉందనే భరోసా ఇచ్చేలా.. ఇళ్లు నిర్మాణం చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కన్నా పది రెట్లు ఎక్కువ ఇళ్లు జగన్ ప్రభుత్వం నిర్మిస్తోంది. నవరత్నాలు – అందరికీ ఇళ్లు పథకం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి సొంతగూడు ఏర్పడుతోంది.