iDreamPost
android-app
ios-app

మ‌రో రెండు రోజులే : ప‌ట్టాల పండుగ‌కు చ‌క చ‌కా ఏర్పాట్లు

మ‌రో రెండు రోజులే : ప‌ట్టాల పండుగ‌కు చ‌క చ‌కా ఏర్పాట్లు

ప్ర‌తిప‌క్షాల ఎత్తులు చిత్త‌వ్వ‌బోతున్నాయి. కోర్టు కేసులున్నా ప్ర‌జల క‌ల నెర‌వేర్చేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ కొత్త ఎత్తుల‌తో ముందుకు వెళ్తోంది. అడ్డుకోగ‌ల‌రా.. అంటూ ప్ర‌తిప‌క్షాల‌కు చాలెంజ్ విసురుతోంది. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే త‌ప‌న ఉండాలి కానీ.. ఏ శ‌క్తులు అడ్డుకోలేవ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిరూపిస్తున్నారు. కోర్టు స్టేలు ఉన్నాసరే డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కోర్టు స్టేలు లేని ప్రాంతాల్లో డి-ఫామ్ పట్టాతో పేద‌ల‌కు మ‌రో రెండు రోజుల్లోనే ఇళ్ల స్థలాలను అందించ‌నుంది. డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతోపాటు అదేరోజు ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఇళ్ల స్థలాల పంపిణీకి ఇప్పటివరకు 30లక్షల 68వేల 281 లబ్దిదారులను గుర్తించిన ప్రభుత్వం తొలి దశలో 15లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.

మ‌హోన్న‌త ఆశ‌యం…

మ‌హోన్న‌త ఆశ‌యంతో ముందుకెళ్తున్న ప్ర‌భుత్వానికి చంద్ర‌బాబు అడ్డుత‌గులుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌న పార్టీ నేత‌ల‌తో ఇళ్ల స్థ‌లాల‌పై కోర్టులో కేసులు వేయించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కూ వేచి చూసిన జ‌గ‌న్ స‌ర్కార్ ఇళ్ల స్థ‌లాల పంపిణీకి మార్గాలు అన్వేషించింది. కేసులు అన్ని చోట్లా వేయ‌లేరు క‌దా.. కేసులు లేని చోట్ల పంపిణీ ఎందుకు ఆప‌డం అన్న జ‌గ‌న్ ప్ర‌శ్న‌తో యంత్రాంగం క‌దిలించింది. ఇళ్ల స్థ‌లాల పంపిణీకి ప్లాట్లవారీగా నంబర్‌ రాళ్లు ఏర్పాటు చేయడంతోపాటు రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి లాటరీ పూర్తి కాని చోట్ల త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలిచ్చింది. ఏయే లేఔట్లపై కోర్టు స్టేలు ఉన్నాయో.. ఇందుకు కారణాలేమిటో తెలుసుకుని వాస్తవాలు వివరించడం ద్వారా ‘స్టే’ వెకేట్‌ చేయించడంపై కలెక్టర్లు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లాల కలెక్టర్లు శుక్ర, శనివారాల్లో సమీక్షించారు. జిల్లాల వారీగా కోర్టు వివాదాలు లేకుండా పంపిణీకి సిద్ధం చేస్తున్న లేఔట్లు, లబ్ధిదారుల డేటా పంపాలని రెవెన్యూ శాఖ కలెక్టర్లను ఆదేశించింది.

15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 30,68,281 మంది అర్హులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేసి సచివాలయాల నోటీసు బోర్డుల్లో జాబితాను పొందుపరిచారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ ఇంటి స్థలం రాలేదనే మాట వినిపించరాదని సీఎం వైఎస్‌ జగన్‌ పలుమార్లు స్పష్టం చేశారు. ఏవైనా కారణాలతో ఎక్కడైనా అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 90 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 66,518 ఎకరాల భూమిని సేకరించి లేఔట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చివరిలో దరఖాస్తు చేసుకుని అర్హులుగా ఎంపికైన 80 వేల మంది కోసం వచ్చే నెల 10లోగా స్థల సేకరణతోపాటు ప్లాట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. స్థలాల పంపిణీతోపాటు వచ్చే నెల 25న 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్ని జిల్లాల్లోనూ పంపిణీకి స‌న్నద్ధం

కోర్టు వివాదాలు ఉన్న స్థలాలను పక్కన పెట్టి.. ప్రత్యామ్నాయ స్థలాలు చూసి వీలైనంత ఎక్కువమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 1,42,976 మంది అర్హులను ఎంపిక చేయగా 4,316 మందికి ఎంపిక చేసిన లేఔట్ల విషయంలో కోర్టు స్టేలు ఉన్నాయి. దీంతో 4,316 మందికి ప్రత్యామ్నాయ స్థలాలు చూసి మొత్తం 1,42,976 మందికి లబ్ధి చేకూర్చే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 2,88,384 మందికి స్థలాలు ఇచ్చేందుకు ఎలాంటి వివాదం లేదు. కోర్టు కేసుల వల్ల పెండింగ్‌లో ఉన్నవారిలో మరో నాలుగైదువేల మందికి ప్రత్యామ్నాయ స్థలాలు చూసి ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. విజయనగరం జిల్లాలో 71,237 మందిని ఎంపిక చేయగా కోర్టు స్టేల వల్ల 1,711 మందికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. వీరిలో కొందరికి ప్రత్యామ్నాయ స్థలాలు చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు స్టేల వల్ల ఈ నెల 25న పంపిణీ చేయని వారికి స్టేలు వెకేట్‌ చేయించి లేదా ప్రత్యామ్నాయ స్థలాలు చూసి తర్వాత పంపిణీ చేయనున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ మ‌రో రెండు రోజుల్లో పేద‌ల నిరీక్ష‌ణ ఫ‌లించ‌నుంది.