iDreamPost
android-app
ios-app

ఏం జ‌ర‌గ‌బోతోంది : పార్ల‌మెంట్ లో ఏపీ హోరు : జ‌గ‌న్ కు ఢిల్లీ పెద్ద‌ల ఫోను?

ఏం జ‌ర‌గ‌బోతోంది : పార్ల‌మెంట్ లో ఏపీ హోరు : జ‌గ‌న్ కు ఢిల్లీ పెద్ద‌ల ఫోను?

పార్ల‌మెంట్ లో ఏపీ పేరు హోరెత్తుతోంది. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై వైసీపీలు త‌మ గ‌ళం వినిపిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై రాజీలేని పోరాటం సాగిస్తున్నారు. ఓ సంద‌ర్భంలో ఏపీ స‌మ‌స్య‌లే ప్ర‌ధాన ఎజెండాగా మారుతున్నాయంటే పార్లమెంట్ లో ఆంధ్రా గ‌ళం ప‌వ‌ర్ ను అర్థం చేసుకోవ‌చ్చు.

పార్ల‌మెంట్ లోప‌లే కాదు.. బ‌య‌ట కూడా కేంద్ర మంత్రుల‌ను ఎంపీల బృందం క‌లుస్తూ ఏపీ ఆర్థికాభివృద్ధికి కావాల్సిన స‌హ‌కారాన్ని కోరుతున్నారు. రాష్ట్ర స‌ర్కార్ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రిస్తూ బ‌కాయిలు విడుద‌ల‌, త‌గిన స‌హ‌కారం అందించాల్సిందిగా విన్న‌విస్తూనే, మ‌రోవైపు ఉద్య‌మిస్తున్నారు. వైసీపీ ఎంపీల పోరు హోరు నేప‌థ్యంలో.. చ‌ర్చ‌ల కోసం రావాల్సిందిగా కేంద్ర పెద్ద‌లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి ఫోన్ చేశార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌త నెల‌లోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెండు రోజుల పాటు ఢిల్లీ లో ప‌ర్య‌టించారు. కేంద్రంలో కీలకనేతగా ఉన్న‌ హోం మంత్రి అమిత్‌ షాతో సహా అయిదుగురిని కలుసుకున్నారు. రైల్వే మంత్రి పీయుష్‌గోయెల్‌, నీటి పారుదల మంత్రి గజేంద్ర షెకావత్‌, పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో పాటు నీటి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ను కూడా కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రంలో జరగాల్సిన పనులపై చర్చించారు. పోల‌వ‌రం, ఉపాధి పనుల బకాయిలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌తో పాటు ప్ర‌త్యేక హోదా అంశాన్ని కూడా లేవ‌నెత్తారు. రాష్ట్రంలో మహానగరాలు లేవు గనక సమగ్రాభివృద్ధికి కేంద్రం సహకారం అనివార్యమని, ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రత్యేక హోదా ఒక్క‌టే మాత్రమే మార్గమని నొక్కి ఒక్కానించి కేంద్ర పెద్ద‌లు ఆలోచించేలా చేశారు.

అయితే, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్, పోల‌వ‌రం నిధుల అంశాల్లో ఏపీకి ఆమోద‌యోగ్యం కాని నిర్ణ‌యాలు తీసుకున్నారు. పోల‌వ‌రం నిధుల విడుద‌ల‌పై స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్ప‌కుండా కేంద్రం దాట వేస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీలు పార్ల‌మెంట్ లో గ‌ట్టిగా నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఢిల్లీకి రావాల‌ని జ‌గ‌న్ కు ఆహ్వానం అందిన‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్ల‌మెంట్ స‌మావేశాలు, భేటీల‌తో ప్ర‌ధాని బిజీగా ఉన్న స‌మ‌యంలో వారే జ‌గ‌న్ కు రావాల‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం తర్వాత నెలాఖ‌రులోపు ఎప్పుడైనా జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్లొచ్చ‌ని తెలుస్తోంది. వైసీపీ.. కేంద్రం మీద మరింత ఒత్తిడిని పెంచాలన్న యోచనలో ఉన్న వేళ.. తనకు ప్రత్యక్షం కానీ పరోక్షంగా కానీ అండగా నిలిచే రాజకీయ పార్టీలను బుజ్జగించే పనిని కేంద్రం షురూ చేసినట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా నెల తిరక్క ముందే ఢిల్లీ నుంచి జగన్‌కు పిలుపు రావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.