iDreamPost
iDreamPost
ఏపీ ముఖ్యమంత్రి మరోసారి హస్తినకు వెళుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల విరామం తర్వాత జగన్ ఢిల్లీ పయనం అవుతున్నారు. గతంలో ఫిబ్రవరి చివరి వారంలో జగన్ రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు. తొలుత ప్రధానితోనూ, ఆ తర్వాత రెండో విడత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ కీలక భేటీలు నిర్వహించారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. ఏపీకి రావాల్సిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించి ఆయన వినతిపత్రాలు కూడా సమర్పించారు. అదే సమయంలో రాజకీయంగా కూడా వారి సమావేశాలు అప్పట్లో కీలకంగా మారాయి. జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత నేరుగా రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా తాడేపల్లి వచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో వారి భేటీ పెద్ద చర్చకు దారితీసింది. చివరకు రిలయెన్స్ ప్రతినిధి పరిమళ్ నెత్వానీకి ఏపీ నుంచి రాజ్యసభ బెర్త్ కన్ఫర్మ్ కావడానికి దోహదం చేసింది.
తాజాగా లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు, తిరిగి సాధారణ పరిస్థితి నెలకొడానికి అంతా సిద్ధమవుతున్న సమయంలో జగన్ అనూహ్యంగా ఢిల్లీ వెళుతుండడం ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకూ బీజేపీ పాలిత రాష్ట్రాలు, వారి మిత్రపక్షాల ముఖ్యమంత్రులు గానీ ఢిల్లీ వెళ్లిన దాఖలాలు లేవు. అలాంటిది జగన్ తొలిసారిగా లాక్ డౌన్ తర్వాత కేంద్రంలో నెంబర్ టూ గా ఉన్న అమిత్ షాతో భేటీకి అపాయింట్ మెంట్ సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.
ఏపీకి సంబంధించిన పలు విషయాలు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. గతంలో క్లారిటీ వస్తుందని భావించినప్పటికీ కొన్ని అంశాలు ముందుకుసాగలేదు. అదేసమయంలో తాజాగా సీఎస్ పదవీకాలం పొడిగింపు వంటివి కూడా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్, అమిత్ షా భేటీ లో కీలక చర్చ సాగే అవకాశం ఉంది. అందుకు తోడుగా రాజకీయంగా చర్చ సాగవచ్చని చెబుతున్నారు. ఇటీవల వరుసగా కోర్టుల నుంచి వెలువడుతున్న కోర్టు తీర్పులు కూడా ప్రస్తావనకు రావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. దాంతో మంగళవారం ఉదయం 10గం.లకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళుతున్న జగన్ , మధ్యాహ్నం తర్వాత అమిత్ షా తో పాటుగా ఇంకా కొందరు సీనియర్ నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉండడంతో అందరి దృష్టి ఈ సమావేశంపై పడుతోంది.