Idream media
Idream media
విశాఖలోని ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కార్మికుల పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. వారికి ప్రభుత్వం కూడా అండగా నిలిచింది.
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడినప్పుడు ప్లాంట్ పరిరక్షణకు తాను సైతం సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. అంతేకాదు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రధానికి లేఖ కూడా రాశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించకుండానే అభివృద్ధి బాట నడిపించే మార్గాలను కూడా సూచించారు. కార్మికులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్లాంట్ పరిరక్షణకు కృషి చేస్తున్న జగన్ తాజాగా ఢిల్లీ పర్యటనలో కూడా తన సంకల్పాన్ని వీడలేదు.
రెండో రోజు స్టీల్ ప్లాంట్ కోసమే..
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన జగన్ గురువారం కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకావ్ జవదేకర్, గజేంద్ర సింగ్ షెకావత్ వంటి ప్రముఖులతో పాటు నీతి ఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్ తో కూడా భేటీ అయ్యారు. శుక్రవారం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటుతో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ను నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సూచించిన ప్రత్యామ్నాయాలను సీఎం మరోసారి వివరించారు. ప్లాంట్ కోసం కార్మికుల కొనసాగిస్తున్న పోరాటాన్ని కేంద్రానికి వివరించారు. ప్రైవేటీకరిస్తే జరిగే నష్టాలపై చర్చించారు.
ప్లాంట్ కు గనులు
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని, దాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. ఉద్యమంలో 32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు వచ్చిందన్నారు. 2002-15 మధ్య స్టీల్‌ప్లాంట్ మంచి పనితీరు కనబరిచిందని కేంద్రమంత్రికి సీఎం జగన్ తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో 19,700 ఎకరాల భూమి ఉందని, స్టీల్‌ప్లాంట్‌కు ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉందని వివరించారు. గడ్డు పరిస్థితుల దృష్ట్యా 2014-15 నుంచి స్టీల్‌ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని తెలిపారు. సొంతంగా గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయాలను సీఎం సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు.
వ్యూహాత్మక ప్రతిపాదన
విశాఖ స్టీల్‌ప్లాంట్ రుణాలను ఈక్విటీగా మార్చాలన్నారు. మార్కెట్ ధరకు కొనుగోలు చేయడం వల్ల రూ.3,472 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఒడిశాలో ఉన్న ఇనుప ఖనిజం గనులను విశాఖ ప్లాంట్‌కు కేటాయించాలని సీఎం కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునే విషయంలో కేంద్ర శాఖలతో కలిసి పని చేస్తామని సీఎం వ్యూహాత్మక ప్రతిపాదన పెట్టారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో 7 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను స్టీల్‌ప్లాంట్ అందించిందని, లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వద్ద ప్రస్తావించి ప్లాంట్ ప్రాధాన్యాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. సుమారు గంట పాటు కేంద్ర మంత్రి వద్ద స్టీట్ ప్లాంట్ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు.