iDreamPost
android-app
ios-app

ఉక్కు”సంక‌ల్పం…కేంద్రం కాద‌న్నా జ‌గ‌న్ ముందుకే

ఉక్కు”సంక‌ల్పం…కేంద్రం కాద‌న్నా   జ‌గ‌న్ ముందుకే

క‌డ‌పలో ఉక్కు ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం వీలు కాద‌న్నా….ఎట్టి ప‌రిస్థితుల్లో అక్క‌డ ప‌రిశ్ర‌మ నెల‌కొల్పి తీరాల‌ని సీఎం జ‌గ‌న్ “ఉక్కు” సంక‌ల్పంతో ఉన్నారని స‌మాచారం. క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై కేంద్ర మంత్రుల్లో ఒక్కొక్క‌రిది ఒక్కో వాద‌న‌గా ఉంది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో టీడీపీ ఎంపీలు అడిగిన ప్ర‌శ్న‌కు క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ లాభ‌దాయ‌కం కాద‌ని కేంద్రహోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద‌రాయ్ తేల్చి చెప్పారు.

ఉక్కు ప‌రిశ్ర‌మ‌కు అవ‌స‌ర‌మైన ఐర‌న్‌వోర‌న్‌ను స‌ర‌ఫ‌రా చేసేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకుంటామ‌ని ఈ నెల 8న‌ కేంద్ర ఉక్కుప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ మంత్రి ధ‌ర్మేంద్ర‌ప్ర‌దాన్ చెప్పారు. స్వ‌యానా సంబంధిత‌శాఖ మంత్రి చెప్పింది నిజ‌మా లేక హోంశాఖ స‌హాయ మంత్రి ఇచ్చిన స‌మాధానం నిజ‌మా అనేది అర్థంకాక రాష్ట్ర ప్ర‌జ‌లు డోలాయ‌మానంలో ప‌డ్డారు.

కేంద్ర‌మంత్రుల అభిప్రాయాలు, మోడీ స‌ర్కార్ ఉద్దేశాలు ఏవైనా సీఎం జ‌గ‌న్ మాత్రం క‌డ‌ప‌లో త‌న తండ్రి శంకుస్థాప‌న చేసిన ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నిర్మించి తీరాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. డిసెంబ‌ర్‌లో శంకుస్థాప‌న చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఉక్కు ప‌రిశ్ర‌మ నేప‌థ్యంః

క‌డ‌ప జిల్లా పులివెందుల నుంచి ఎన్నికైన డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. క‌ర‌వు ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ నుంచి వ‌చ్చిన ఆయ‌న త‌న ప్రాంతంలో వ‌ల‌స‌లు అరిక‌ట్టేందుకు, సొంత జిల్లా క‌డ‌ప‌లో ఉక్కుప‌రిశ్ర‌మ స్థాపించేందుకు సంక‌ల్పించారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు మండ‌లం అంబ‌వ‌రం వ‌ద్ద బ్ర‌హ్మ‌ణీ స్టీల్స్‌కు 10,670 ఎక‌రాలు కేటాయిస్తూ వైఎస్సార్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకొంది. రూ.20 వేల పెట్టుబ‌డితో నాలుగు ట‌న్నుల ఉత్ప‌త్తి సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. 2007, జూన్ 10న ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయి.

వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం …

వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం ఉక్కు ప‌రిశ్ర‌మ నిర్మాణానికి చిక్కులొచ్చాయి. బ్ర‌హ్మ‌ణీ స్టీల్స్ అధినేత గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిపై సీబీఐ కేసుల ప్రభావం ఈ ప‌రిశ్ర‌మ‌పై ప‌డింది. 2011లో ఈ ప‌రిశ్ర‌మ‌ను కాంగ్రెస్ స‌ర్కార్ నిలిపి వేసింది. అప్ప‌టి నుంచి ఉక్కు ప‌రిశ్ర‌మ కేవ‌లం నినాదాల‌కు, రాజ‌కీయ అంశంగానే మిగిలిపోయింది.

ఊపిరి పోసిన విభ‌జ‌న చ‌ట్టం

వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనేక రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ ఉద్య‌మం ఒక్క‌సారిగా ఊపందుకొంది. 2014లోరాష్ర్ట విభ‌జ‌న‌కు దారి తీసింది. 2014 విభ‌జ‌న చ‌ట్టంలో క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌ని పేర్కొన్నారు. దీంతో విభ‌జ‌న చ‌ట్టం హామీని అమ‌లు చేయాల‌నే డిమాండ్ గ‌త ఐదేళ్లుగా వినిపిస్తోంది. కేంద్రంలో మోడీ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో ఉక్కు ప‌రిశ్ర‌మ నిర్మిస్తామ‌ని చెప్పింది. అప్ప‌ట్లో టీడీపీ-బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉండ‌టం, ఆ రెండు పార్టీలు కేంద్రంతో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకోవ‌డంతో క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు అవుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ లాభ‌దాయ‌కం కాదంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు.

చంద్ర‌బాబు డ్రామాలు

మోడీతో క‌ల‌సి ఉన్నంత వ‌ర‌కూ ఏనాడూ క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ గురించి గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేయ‌ని నాటి సీఎం చంద్ర‌బాబుకు ఎన్నిక‌లు ద‌గ్గ‌రికొచ్చిన‌ప్పుడు విభ‌జ‌న హామీలు గుర్తుకొచ్చాయి. మోడీ స‌ర్కార్‌తో విభేదించిన త‌ర్వాత క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాపించాల‌నే డిమాండ్‌పై త‌మ రాజ్య‌స‌భ స‌భ్యుడు, క‌డ‌ప టీడీపీ నేత సీఎం ర‌మేష్‌తో క‌డ‌ప‌లో నిర‌శ‌న‌కు కూర్చోపెట్టారు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణుల‌ను క‌డ‌ప‌కు త‌ర‌లించి హంగామా సృష్టించారు. జ‌గ‌న్‌ను నానా తిట్లు తిట్టించారు. క‌డ‌ప‌లో త్వ‌ర‌లోతామే రాయ‌ల‌సీమ స్టీల్స్ అథారిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో ఉక్కు ప‌రిశ్ర‌మ నెల‌కొల్పుతామ‌ని ప్ర‌క‌టించి ర‌మేష్‌తో దీక్ష విర‌మించి డ్రామాను ర‌క్తి క‌ట్టించారు.

చంద్ర‌బాబు శంకుస్థాప‌న‌

నాటి టీడీపీ స‌ర్కార్ రాయ‌ల‌సీమ స్టీల్స్ అథారిటీ కార్పొరేష‌న్ ఏర్పాటు చేసింది. మైల‌వ‌రం మండ‌లం ఎం.కంబాల‌దిన్నె ద‌గ్గ‌ర 3,892 ఎక‌రాల‌ను కేటాయించింది. రూ.33 వేల కోట్ల‌తో నిర్మాణం చేప‌ట్టి 18 నెల‌ల్లో పూర్తి చేసి ఉక్కు ఉత్ప‌త్తికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. ఇవ్వ‌న్నీ ఎన్నిక‌ల‌కు ముందు జ‌ర‌గడాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. ఎందుకంటే టీడీపీ స‌ర్కార్ ప‌ద‌వీ కాలం కూడా అంత స‌మ‌యం లేదు. ఈ ప‌రిశ్ర‌మను పూర్తి చేసి పూర్త‌యితే 25 వేల మందికి ప్ర‌త్య‌క్షంగా, ల‌క్ష మందికి ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పిస్తామ‌ని టీడీపీ స‌ర్కార్ గంభీరంగా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో 2018, డిసెంబ‌ర్ 27న చంద్ర‌బాబు శంకుస్థాప‌న చేశారు.

జ‌గన్ స‌ర్కార్ రాక‌తో చిగురించిన ఆశ‌లు

కడ‌ప జిల్లాకు చెందిన వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో రాయ‌ల‌సీమ వాసుల్లో క‌డ‌ప ఉక్కుపై ఆశ‌లు చిగురించాయి. ఎందుకంటే క‌డ‌ప జిల్లాలో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాట‌నేది జ‌గ‌న్ తండ్రి దివంగ‌త వైఎస్సార్ ఆశ‌యం. తండ్రి ఆశ‌యాన్ని త‌న‌యుడు నెర‌వేర్చేందుకు జ‌గ‌న్ ఎన్ని క‌ష్ట‌న‌ష్టాల‌నైనా ఎదుర్కొంటార‌ని ఈ ప్రాంత ప్ర‌జ‌ల న‌మ్మ‌కం, విశ్వాసం. అందుకు త‌గ్గ‌ట్టుగానే జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత జ‌మ్మ‌ల‌మ‌డుగు బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ డిసెంబ‌ర్‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

కేంద్రం చెబుతున్న‌ట్టు క‌డ‌పలో ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు లాభ‌దాయ‌కం కాద‌నే వాద‌న‌లో ప‌స లేద‌ని ప‌లువురు అంటున్నారు. ఎందుకంటే జ‌మ్మ‌ల‌మ‌డుగుకు 160 కిలోమీట‌ర్ల దూరంలో అనంత‌పురం జిల్లా ఓబులాపురంలో మైనింగ్స్ ఉన్నాయి. అక్క‌డ నాణ్య‌మైన ఐర‌న్‌వోర్‌ను ఇక్క‌డికి త‌ర‌లించి ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాపించ‌డం పెద్ద ప‌నికాదంటున్నారు. అయితే పాల‌కుల్లో చిత్త‌శుద్ధి కొర‌వ‌డ‌డం వ‌ల్లే ప‌రిశ్ర‌మ ఏర్పాటు కాలేద‌నే అభిప్రాయం ఈ ప్రాంత‌వాసుల్లో బ‌లంగా ఉంది. ఇక్క‌డ ఉత్ప‌తి అయ్యే ఉక్కును రైలు మార్గం ద్వారా కావ‌ల‌సిన ప్రాంతానికి త‌ర‌లించే అవ‌కాశాలున్నాయి. అలాగే నెల్లూరు కృష్ణ‌ప‌ట్నం ఓడ‌రేవు నుంచి విదేశాల‌కైనా ఎగుమ‌తి చేసే అవ‌కాశం ఉంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే మ‌న‌సుంటే మార్గం ఉంటుంది. మ‌న‌సున్న జ‌గ‌న్ కేంద్రం ముందుకు రాక‌పోయినా ప‌బ్లిక్‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యం (పీపీ మోడ్‌)తో ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. క్రిస్మ‌స్‌ను పురస్క‌రించుకుని డిసెంబ‌ర్ 25, 26, 27 తేదీల్లో జ‌గ‌న్ క‌డ‌ప జిల్లాలో ఉండ‌నున్నారు. ఆ రోజుల్లో ఏదో ఒక‌రోజు జ‌గ‌న్ శంకుస్థాప‌న చేయ‌డం ఖాయమ‌ని తెలుస్తోంది.