Idream media
Idream media
“ఇప్పుడున్న మంత్రులే ఐదేళ్లూ కొనసాగుతారని అనుకోవద్దు. సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తాను. మంత్రి పదవులు రాని వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అన్నారు.” అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదట్లోనే చెప్పేశారు. అది జగన్ గట్స్ కు నిదర్శనంగా మారింది. మీ పదవులు శాశ్వతం కావు అని మంత్రులకు అప్పుడే స్పష్టం చేసేశారు. జగన్ చెప్పిన రెండున్నరేళ్ల కాలం ఈ డిసెంబర్ తో పూర్తి కాబోతోంది. అందుకే.. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు? ఎవరుంటారు ? ఎవరు మారతారు?.. వీటితో పాటు ఈసారి జగన్ ఎటువంటి విభిన్నత చూపుతారనేది కూడా చర్చ జరుగుతోంది.
సామాజిక న్యాయం.. ప్రాంతీయ సమతౌల్యం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. ఉపాధి, ఉద్యోగ నియామకాల్లో రికార్డు సృష్టించడంతో పాటు.. రాజకీయ పదవుల విషయంలోనూ వినూత్న రీతిలో ముందుకు వెళ్తున్నారు. 2019 జూన్ లో 25 మంది మంత్రులతో జగన్ తొలి కేబినెట్ ఏర్పాటైంది. మంత్రి మండలి కూర్పులో సామాజిక న్యాయానికి అగ్రప్రాధాన్యం కల్పిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. దాదాపు 60 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించడం ద్వారా ఆయన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రాంతీయ సమతౌల్యం పాటించారు. దీంతో ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ లో కూడా నవ్యత పాటిస్తారనేది స్పష్టం అవుతోంది.
Also Read : అయ్యన్నా.. మరీ ఇంత దిగజారుడా?!
ఆ అదృష్టవంతులెవరో..
మంత్రులతో పాటు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఏర్పాటు చేసి జగన్ కొత్త చరిత్రను రాశారు. అంతేకాదు.. స్థానిక సంస్థల్లో కూడా ఇద్దరు డిప్యూటీ మేయర్లను, ఇద్దరు డిప్యూటీ చైర్మన్లను నియమించారు. కులాల వారీగా కమిషన్ లు ఏర్పాటు చేస్తూ చైర్మన్ లను నియమించారు. వందలాది నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఇలా ముఖ్యమంత్రిగానే కాకుండా రాజకీయంగా కూడా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కొత్త కేబినెట్ పైనే పడింది. ఈ సందర్భంగా జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జగన్ ముందుగానే చెప్పినట్లుగానే 80 శాతం మంది మంత్రుల్ని మార్చేందుకు రంగం సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మిగిలిన 20 శాతం మంత్రులు అంటే ఆ ఐదుగురు అదృష్టవంతులు ఎవరనే చర్చ మొదలైంది.
మరో ఆరు నెలలు వాయిదా అవకాశాలు?
మంత్రివర్గంలో 80 శాతం, 90 శాతం కాకుండా పని తీరును బట్టి మార్పులు చేర్పులు ఉంటాయని మరి కొందరు చెబుతున్నారు. అలాగే ఈ మార్పులు ఇప్పుడు కాదని మరో ఆరు నెలలు ఇదే మంత్రివర్గాన్ని కొనసాగిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇందుకు గల కారణాలపై కూడా వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రి వర్గం ఏర్పాటయిన తర్వాత ముప్పావు సమయం కరోనాతోనే గడచిపోయింది.
తొలుత రెండున్నరేళ్లు అని అనుకున్నా మరో ఆరు నెలల సమయాన్ని ప్రస్తుత మంత్రులకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.కొత్త మంత్రివర్గాన్ని మూడేళ్ల తర్వాత అంటే మరో ఆరునెలల అనంతరం విస్తరించాలన్నది జగన్ ఆలోచనగా పలువురు చెబుతున్నారు. అయితే, కొత్త మంత్రి వర్గం ఎప్పుడు ఏర్పాటు చేసినా జగన్ తన మార్కు చూపిస్తారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Also Read: మాజీ పోలీస్ పటేల్ కు రాష్ట్ర స్థాయి పదవి