Idream media
Idream media
ఏపీకీ ప్రత్యేక హోదా సాధించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న సీఎం జగన్.. ఆ హోదా ఇప్పటి వరకూ దక్కకపోవడానికి గల కారణాలపై గళమెత్తారు. గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితమే ఈ దుస్థితి అంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాటి నుంచే హోదా కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ లో పర్యటించిన ఆయన రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రంలో జరగాల్సిన పనులపై చర్చించారు. పోలవరం, ఉపాధి పనుల బకాయిలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలతో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా కేంద్ర పెద్దల వద్ద లేవనెత్తారు. ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రత్యేక హోదా ఒక్కటే మాత్రమే మార్గమని వెల్లడించారు.
హడావిడి ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకు పోకుండా జగన్ హోదా సాధించేందుకు నిశ్శబ్దంగా పావులు కదుపుతున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీ, అనుకూల మీడియా మాత్రం జగన్ హోదాపై చేతులెత్తేశారని, కేంద్రం వద్ద ఈ ప్రస్తావన తేవడం లేదంటూ తెగ ప్రచారాలు చేపడుతున్నాయి. దీంతో చాలా రోజుల తర్వాత ప్రతిపక్షాల విమర్శలకు సూటిగా సమాధానం చెప్పారు జగన్. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్యాకేజీ, ఓటుకు కోట్లు కేసు కోసం గత పాలకులు హోదాను తాకట్టు పెట్టారని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలోని ఇద్దరు పెద్దలు కేంద్రమంత్రి పదవులు కూడా చేపట్టారని.. గత ప్రభుత్వం మాటలతో భ్రమ కల్పించిన విషయం అందరికీ తెలుసునని పేర్కొంటూ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశతో ఉన్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
అయితే, దీన్ని కూడా ఎల్లో మీడియా వక్రీకరించే ప్రయత్నాలు చేసింది. ప్రత్యేక హోదాపై సీఎం జగన్ తన నిస్సహాయతను మరోసారి చాటుకున్నారంటూ ప్రచారం చేసింది. చేతులెత్తేశారని పేర్కొంటోంది. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది కనుక, ఒత్తిడి చేసి సాధించే అవకాశం లేదని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందే జగన్ పేర్కొన్నారు. ఇప్పుడేదో కొత్త పాయింట్ దొరికేసింది అన్నట్లుగా టీడీపీ అండ్ కో ఊదరగొడుతుండడం పాత సీసాలో కొత్త సారా అన్న చందంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.