Idream media
Idream media
“దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాo. ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందించగలిగాం. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరిచ్చిన ఈ అధికారంతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నాను.”
రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇది. తక్కువ సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న 94.5 శాతం వాగ్దానాలు నెరవేర్చడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో చరిత్రే అని చెప్పొచ్చు.
ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసి, వారి అవసరాలను పరిశీలించి వైసీపీ మేనిఫెస్టోలో 129లో అంశాలను పొందుపరిచారు.
ప్రజలు కనివినీ ఎరుగని రీతిలో జగన్ కు బంపర మెజార్టీ అందించారు. 151 స్థానాలను అందించి అపూర్వంగా ఆదరించారు. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే పాలనను వడివడిగా పరుగులు పెట్టించారు. ఇచ్చిన ప్రతీ మాట నెరవేర్చేలా ప్రణాళికలు రచించారు. చెప్పిన దాని కంటే చాలా వేగంగా ఆయన తన హామీలను నెరవేర్చారు. 129లో 107 వాగ్దానాలను నెరవేర్చారు. హామీల అమలే కాదు.. నగదు బదిలీ పథకం ద్వారా ప్రజలకు ఎంతో లబ్ధి చేశారు. ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందించి చరిత్ర సృష్టించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు ప్రజలు అనుభవానికి పట్టం కట్టారు. చంద్రబాబునాయుడుకు అధికారం అప్పగించారు. ఆయన ఆశించిన స్థాయిలో పాలన అందించలేకపోయారు. ఐదేళ్లలో రెండడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా ఏపీ పరిస్థితి మారింది. రాష్ట్రాభివృద్ధి అయోమయంలో పడింది.
2019లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆది నుంచీ పాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. 40 ఏళ్ల అనుభవం చేయలేనిది, 40 ఏళ్ల యువ నాయకుడు చేశారన్న పేరు పొందుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన ట్వీట్ లో కూడా రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు మంచి చేసేందుకు ఆయనకున్న తపన తెలియజేస్తోంది. చారిత్రక పాలన అందిస్తున్నప్పటికీ ఎక్కడా తొనగకుండా, గర్వం ప్రదర్శించకుండా చిత్తశుద్ధితో తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారన్న ఖ్యాతి పొందుతున్నారు. ఆ విషయంలో జగన్ ను మెచ్చుకోవాల్సిందేనని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు.