Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ 2019 నుంచి డిమాండ్ చేస్తూ వస్తోంది. అభివృద్ధి ఒక చోట మాత్రమే కేంద్రీకృతం కాకూడదని, అలాగే పరిపాలన వికేంద్రీకరణ కూడా జరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అవసరం ఉందని చెప్తూ విశాఖలో పరిపాలన రాజధాని అలాగే కర్నూలు రాజధానికి ప్రణాళికను సిద్ధం చేసి అడుగులు వేస్తోంది. కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని తరలింపు అనేది కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది.
అయితే ఇప్పుడు అమరావతి ఉద్యమం పేరుతో దాదాపుగా రెండేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. ఇన్ని రోజులుగా అమరావతి నిరసన దీక్ష పేరుతో రాజధాని గ్రామాల్లో చేసిన నిరసనను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశం లో భాగంగా మహా పాదయాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తామని దాదాపుగా రెండు వారాల క్రితం హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని పాదయాత్రకు బయలుదేరారు. అయితే ఈ పాదయాత్ర విషయంలో తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే భావన కొంత వరకు ఉంది.
గుంటూరు జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులు పాదయాత్రలో దాదాపుగా పాల్గొనే ప్రయత్నం చేయటం గానీ, పాదయాత్రలో పాల్గొన్న వారికి సహకారం అందించే ప్రయత్నం గానీ పెద్దగా చేసినట్టుగా ఎక్కడా వార్తలు రాలేదు. టిడిపి కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో చేసిన హడావుడి మినహా పెద్దగా తెలుగుదేశం పార్టీలో చలనం కనపడలేదని చెప్పాలి. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గాని ఇతర నాయకులు గానీ పెద్దగా అమరావతి పాదయాత్రలో పాల్గొన్న దాఖలాలు లేవు.
కొంత మంది నాయకులు వచ్చిన సరే అతిథి పాత్ర పోషించి వెళ్లిపోయారని ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లా విషయంలో కూడా దాదాపు అదే జరుగుతుందనే భావన కూడా ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అలాగే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాత్రమే రైతులకు కాస్త సహకరించారు. ప్రకాశం జిల్లాలో ఉన్న చాలామంది నాయకులు పాదయాత్ర లో కనపడే ప్రయత్నం కూడా చేయలేదు. పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చిన సమయంలో
పాదయాత్రలో పాల్గొన్న నాయకులు… ఆ తర్వాత పాదయాత్రకు దూరంగానే ఉన్నారు.
కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి పెద్దగా పాదయాత్ర లో పాల్గొనే ప్రయత్నం చేయకపోవడం ఆ పార్టీ కార్యకర్తలను కూడా విస్మయానికి గురిచేసింది. అయితే దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా చాలా మంది నాయకులకు పాదయాత్ర ఇష్టం లేదనే భావన వ్యక్తమవుతోంది. పాదయాత్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది అనే భావన చాలా మందిలో ఉందని ప్రజలకు ఇప్పటికే అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నీ తానై వ్యవహరిస్తోందనే అభిప్రాయం కూడా ఉందని, కాబట్టి ఇప్పుడు టిడిపి నాయకులు పాల్గొంటే అనవసర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, అభిప్రాయానికి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చేశారు అని అంటున్నారు.
అందుకే పాదయాత్ర కు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే లు ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, ఇటీవల లాఠీఛార్జ్ జరిగిందని టిడిపి రాష్ట్ర నాయకత్వం ఆరోపణలు చేసినా సరే, ప్రకాశం జిల్లా నాయకుల నుంచి సమర్థవంతంగా ఆరోపణలు ఎక్కడా రాలేదు. అలాగే రైతులకు మద్దతుగా వారి వారి నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేయకపోవడం ఆశ్చర్యపరిచింది. టిడిపిలో ఉన్న కొంత మంది కార్యకర్తలు అమరావతి విషయంలో సోషల్ మీడియా లో పోస్ట్లు పెట్టడమే గాని టిడిపి నాయకత్వం ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఆసక్తి కనబరచలేదు అనేది క్లియర్గా అర్థమవుతోంది. దీంతో టిడిపి నాయకులు అమరావతి పాదయాత్రకు రాజకీయాలతో సంబంధం లేదని కొత్త మాట మొదలు పెట్టారని భావన కూడా వ్యక్తమవుతోంది.
Also Read : Amaravati Movement – అమరావతి ఉద్యమం ఎందుకు విఫలమైంది..?