iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య తగాదా వచ్చింది. ట్యాక్సుల చెల్లింపు నుంచి టికెట్ల ధరల వరకూ అనేక అంశాలు అందుకు కారణమయ్యాయి. దానిని కొందరు వివాదంగా మార్చారు. పచ్చమీడియా నిప్పురాజేసేయత్నం చేసింది. చివరకు న్యాయస్థానాల వరకూ విషయం వెళ్లింది. పరిష్కారం కోసం ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. కోర్టుకి చెప్పినట్టుగా కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈలోగా టాలీవుడ్ ప్రముఖులు సీఎంని కలిశారు . తమవైపు నుంచి కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని మీడియాకి వెల్లడించారు. సానుకూలంగా జీఓ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కట్ చేస్తే ఇది ప్రతిపక్షాలకు మింగుడుపడడం లేదు. ముఖ్యంగా చంద్రబాబుకి అది జీర్ణం అవుతున్నట్టు లేదు. సమస్య తీరిపోవడం ఆయనకి గిట్టడం లేదన్నట్టుగా ఉంది. టాలీవుడ్ ప్రముఖులు వచ్చి సీఎం జగన్ తో చర్చలు చేయడం సహించలేకపోతున్నట్టు కనిపిస్తోంది. తాజా వ్యవహారాలపై చంద్రబాబు స్పందన దానికి అద్దంపడుతోంది. ఆయన మాటల్లో ఓర్వలేని తనం వెల్లడవుతోంది.
నిజానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించింది. టికెట్ల ధరలు పెంచడం కక్షసాధింపు చర్య అని కూడా వ్యాఖ్యానించింది. తీరా ఇప్పుడా నిర్ణయం సవరిస్తే దానిని కూడా తప్పు అంటోంది. జగన్ ప్రభుత్వం ఏది చేసినా వ్యతిరేకించాలనే ఆలోచన తప్ప, తాము చెప్పినట్టుగా చేయడం కూడా తమకిష్టం ఉండదని టీడీపీ నేతలు చెబుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం టికెట్ రేట్లు విషయంలో టాలీవుడ్ ఆశించినట్టుగా చేసేందుకు సిద్ధంగా లేదు. అయినా పరిశ్రమ వర్గాలు సర్దుకుపోవాలని నిర్ణయించాయి. వివాదం సమసిపోవాలని ఆశించాయి. అదే బాబుకి గిట్టడం లేదేమో అనిపిస్తోంది. వివాదం కొనసాగించాలని ఆయన కోరికలా కనిపిస్తోంది.
సమస్య సృష్టించి, మళ్ళీ పరిష్కరించి జగన్ ప్రయోజనం పొందుతున్నారన్నది బాబు తాజాగా వెలిబుచ్చిన ఆక్రోశం. సమస్య పరిష్కారం కావడం కన్నా జగన్ సర్కారుకి మంచిపేరు దక్కడమే తనకు రుచించదని బాబు చెప్పుకుంటున్నట్టు ఈ మాటలు తేటతెల్లంచేస్తున్నాయి. ఇలాంటి తీరు కారణంగానే టీడీపీ పరిస్థితి అలా తయారయ్యిందన్నది కాదనలేని వాస్తవం. అది తెలుసుకోకుండా జగన్ మీద ఈర్ష్య చాటుకుంటున్నట్టు భావించాల్సి వస్తుంది.