Idream media
Idream media
టి. రాజాసింగ్ లోథ్.. గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే. ఆ తర్వాత ఉప ఎన్నికలతో ఆ పార్టీ సంఖ్య పెరిగినా.. హైదరాబాద్ నుంచి మాత్రం ఒకే ఒక్కడు. గోషామహల్ లో ఆయనకు స్థానికులు సలాం కొడతారు. ఎందుకంటే.. ఆపద అంటే చాలు.. తప్పుఒప్పులు ఆలోచించకుండా వారికి అండగా నిలబడతారు. ఈ ప్రయత్నంలో ఆయనకు, పోలీసులకు మధ్య ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి పోలీసులకు, ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మధ్య యుద్ధం మొదలైంది.
ప్రభుత్వం సూచనతో పోలీసులు గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంటే, ధూల్‌పేట్‌లో జాగ్రత్తగా ఉండాలంటూ ఎమ్మెల్యే.. పోలీసులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం గంజాయిని రూపు మాపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ధూల్‌పేట్ నుంచే గంజాయి అన్ని ప్రాంతాలకు సరఫరా జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఎక్సైజ్ పోలీసులు, మంగళ్‌హాట్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి నిందితులపై రెండు మూడు నెలల్లోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు.
ఇటీవల మంగళ్‌హాట్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రవి 11మంది గంజాయి అమ్మకందారులపై పీడీ యాక్ట్ పెట్టి, జైలుకు పంపించారు. గత సంవత్సరం మొత్తం 50 మంది పీడీ యాక్ట్‌లో జైలుకు వెళ్లారంటే ఇక్కడి పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రాంతంలో అర్థరాత్రి వరకు రోడ్ల పై బాతా ఖానీ కొడుతూ పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్ సిబ్బంది కనిపించినా తమనేమీ చేయలేరులే అనే విధంగా వ్యవహరించే వారిపట్ల పోలీసులు అధికారులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కేసులు ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఐదుగురు ఓ ఇంటి వద్ద అరుగులపై కూర్చొని మంతనాలు కొడుతూ అనుమానాస్పదంగా కనిపించారు. అందులో రవీందర్ సింగ్‌పై ఇప్పటికే రెండు సట్టా కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతన్ని చూడగానే ఇంట్లోకి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు.
దీంతో పాటు ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకునే మరో వ్యక్తిపై కూడా కేసులు ఉన్నాయి. ఇటీవల అతడికీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తన అనుచరులతో కలిసి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఇన్‌స్పెక్టర్ రవితో వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది.
Also Read : యోగీకి బీజేపీ అగ్రనేతలకు అదే వ్యత్యాసం..!