Idream media
Idream media
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ విజృంభించింది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి అక్కడ కొవిడ్ యాక్టివ్ కేసులు ఏకంగా 530 శాతం మేర పెరిగినట్లు గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఏప్రిల్ 6 నాటికి కేరళలో 30,228 యాక్టివ్ కేసులే ఉండగా, అదే నెల 21 నాటికి అవి 1.35 లక్షలు దాటాయి. ఇక ఇదే కాలానికి యాక్టివ్ కేసులు.. తమిళనాడులో 25 వేల నుంచి 84 వేలకు చేరాయి. పుదుచ్చేరిలో 1700 నుంచి 5 వేలకు, అసోంలో 2 వేల నుంచి 9 వేలకు, పశ్చిమ బెంగాల్‌లో 12 వేల నుంచి 58 వేలకు ఏకధాటిగా పెరిగాయి. ఇప్పటి కేసుల సంఖ్య అటుంచితే, ఎన్నికలు జరిగిన సమయంలో నమోదైన కేసులను గమనిస్తే ఆయా రాష్ట్రాలలో వైరస్ ఎంత వేగంగా విజృంభిందో అర్థం చేసుకోవచ్చు. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు ఎన్నికలు పెట్టి కరోనాని పెంచి పోషించారంటూ ఎన్నికల కమిషన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది.
ఆ అపవాదును చెరుపుకునేందుకు ఎన్నికల కమిషన్ చాలా ప్రయత్నాలను చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే అనడంతోనే ఎన్నికలకు సిద్ధమైనట్లు తెలిపింది. అంతేకాదు, సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. అది కూడా తిరస్కరణకు గురికావడం ఈసీకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఈసీ ఇకపై ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాల నిర్ణయం తీసుకోవడంతో పాటు, స్థానికంగా ఉన్న పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయడంతో ఎన్నికల కమిషన్ పై మరోసారి చర్చ కొనసాగుతోంది. వాస్తవానికి ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఓటర్లు. అంటే ఎన్నికల ప్రక్రియ చాలా సింపుల్. అయినా కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాతే ఆ ఎన్నికలు నిర్వహిస్తామని తాజాగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరోసారి ఎవరూ తమవైపు వేలెత్తి చూపకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మే 31తో ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు, జూన్-3 తో తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు పదవీకాలం ముగుస్తుంది. ఈలోపుగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కరోనా నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు రాకపోయి ఉంటే, ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా సిద్ధమై ఉండేదేమో. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు సూచించినా ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. ఎవరి ప్రాణాలూ పణంగా పెట్టే ఉద్దేశం తమకు ఎప్పుడూ ఉండదని, నిబంధనలకు లోబడి కార్యాచరణ చేపట్టడాన్ని తమ కర్తవ్యంగా భావిస్తామనే సంకేతాలను ఇస్తోంది. కరోనా కేసులు తగ్గాకే ఎన్నికలు జరుపుతామని, నింద తమపై వేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయడం ద్వారా గతంలో తమపై పడ్డ మచ్చను చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.