iDreamPost
iDreamPost
నిత్యం ఏదో రాజకీయ కుట్రలతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని ప్రయత్నించే తెలుగుదేశం పార్టీ ఈ మధ్య నిజనిర్ధారణ కమిటీలు అంటూ డ్రామాలు మొదలుపెట్టింది. సంక్రాంతికి గుడివాడలోని మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించారని టీడీపి ఆరోపించి, దానిపై ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది. వర్ల రామయ్య నేతృత్వంలో వేసిన ఆ కమిటీ అందరూ ఊహించినట్టుగానే టీడీపీ ఏమేమి ఆరోపణలు చేసిందో వాటినే రిపోర్టుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సమర్పించింది.
జనవరి 31న కృష్ణా జిల్లా పెడనలో చేనేత కార్మికుడు కాశం పద్మనాభం కుటుంబం చేసుకున్న ఆత్మహత్యపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ శుక్రవారం ఒక నివేదిక అందజేసింది. షరా మామూలుగా ఆ నివేదికలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆర్థిక ఇబ్బందులు, చేనేత వృత్తికి ప్రభుత్వ సహకారం లేకపోవడంతోనే పద్మనాభం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే పద్మనాభం కుటుంబం ఆత్మహత్యకి పాల్పడినట్లు ఐదుగురు సభ్యుల కమిటీ నిర్ధారించేసింది! ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, అంగర రామ్మోహన్‌రావు, గంజి చిరంజీవి, ఎంఎస్ రాజు, వావిలాల సరళాదేవి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని కమిటీ నివేదికలో ముక్తాయించింది కూడా!
నివేదికలకు విశ్వసనీయత ఉంటుందా?
అనునిత్యం అయినదానికి కానిదానికి ప్రభుత్వంపై విరుచుకుపడే తెలుగుదేశం పార్టీ నాయకులు తమకు తామే నిజనిర్ధారణ కమిటీగా అవతారం ఎత్తేసి, రూపొందించే నివేదికలపై ఎవరికైనా విశ్వసనీయత ఉంటుందా?అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
2019 నుంచి ఇప్పటి వరకు తమ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, చిత్తశుద్ధితో అమలు చేస్తుంటే ఏనాడు మెచ్చుకోని టీడీపీ నాయకులు నిష్పాక్షికంగా నిజాలను ఎలా నిర్ధారిస్తారని అడుగుతున్నారు. తమ రాజకీయ లబ్ధికోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టే టీడీపీ నేతలు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వంపై నిందలు వేయడమే తప్ప సూచనలు ఎప్పుడు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ముందుగా క్యాసినోను మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారని రచ్చ చేసిన టీడీపీ నాయకులు ఆ తర్వాత కన్వెన్షన్ సెంటర్‌కు సమీపంలో అని, కొన్నాళ్లకు గుడివాడలో అని మాట మార్చారు. అలా మాట మార్చిన నాయకులే నిజనిర్ధారణ కమిటీగా వెళ్లారని వైఎస్సార్ సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
పెడనలో చేనేత కార్మికుడు ఆత్మహత్యకు కూడా ప్రభుత్వమే కారణమని కమిటీ నిర్ధారించేసింది! తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ నేతన్న నేస్తం పేరిట చేనేత కార్మికుల కుటుంబాలకు ఏటా రూ.24 వేల చొప్పున సాయం అందిస్తోందని అధికార పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. వారికి రుణాలు ఇప్పించడంలో గాని, ఆప్కో ద్వారా వస్త్రాలు కొనిపించడంలో గాని ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని చెబుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా ఒక నేత కార్మికుడి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. అయితే అటువంటి చావుల నుంచి కూడా నిజనిర్ధారణ అంటూ రాజకీయ ప్రయోజనాలు పొందాలని టీడీపీ ప్రయత్నించడం అత్యంత హేయమని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
Also Read : టీడీపీ మరో జాతీయ పోరాటం..!