Idream media
Idream media
టీఆర్ఎస్.. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. పేరులోనే ఉంది ఆ పార్టీ ఏంటో, ఎక్కడిదో. కానీ, అప్పుడప్పుడూ ఏపీలోని అంశాల పట్ల కూడా టీఆర్ఎస్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందిస్తుంటూ ఉంటారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి కేటీఆర్ ప్రకటన ఏపీలో ఎంతలా ఆదరణ పొందిందే అందరికీ తెలిసిందే. ఆయనను విశాఖకు రావాలని కూడా స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఏపీలో కేటీఆర్ కు క్షీరాభిషేకాలు కూడా చేశారు. ఆ సంగతి అలా ఉంచితే, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పుట్టిన టీఆర్ఎస్ శాఖ ఏపీలో కూడా ఉందన్న విషయం ఇటీవల వెలుగులోకి రావడం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురిని ఆశ్చార్యానికి గురి చేస్తోంది. అది కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ కంప్లయింట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం.
విషయం ఏంటంటే…
తెలంగాణకు చెందిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బోడిగె శోభ ఓ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం టార్గెట్ గా తీవ్ర పదజాలంతో దూషించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. ఓ సీఎంను పట్టుకుని ఇన్నేసి మాటలు అనటంపై విమర్శలు వచ్చాయి. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ మాత్రం తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇస్తే గౌరవంగా స్వీకరిస్తామని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై, వారి కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అంతేకానీ మిగతా ఎవరూ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. అయితే, ఏపీలో మాత్రం బొడిగె శోభ పై ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
తెలంగాణలో వ్యాఖ్యలు.. ఏపీలో ఫిర్యాదు
తెలంగాణ బీజేపీ మహిళా నేత శోభపై బెజవాడ పోలీస్ కమిషనరేట్ లో కంప్లయింట్ ఇచ్చింది ఎవరో తెలుసా.. ఏపీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొణిజేటి ఆదినారాయణ. ఏప్రిల్ 6వ తేదీ మంగళవారం రాత్రి ఈ కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై ఇంకా కేసు నమోదు కాకపోయినా.. కంప్లయింట్ ఇవ్వటమే పెద్ద చర్చ అయ్యింది. ఈ ఫిర్యాదు ద్వారా ఏపీలో టీఆర్ఎస్ పార్టీ ఉందని, దానికో అధ్యక్షుడు ఉన్నాడని అనే విషయం వెలుగులోకి రావటం విశేషంగా మారింది. తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ నేతలే కంప్లయింట్ ఇవ్వలేదు.. అధికార పార్టీనే సైలెంట్ గా ఉంది.. ఎవరూ పట్టించుకోవటం లేదు.. మా సార్ ను అన్నేసి మాటలు అంటారా అని ఎవరూ నోరు మెదపలేదు.. అలాంటిది ఏపీలో టీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా సీరియస్ గా తీసుకోవటం.. పోలీస్ కంప్లయింట్ ఇవ్వటం విశేషం.
ఫిర్యాదు సంగతి ఎలాగున్నా..
తెలంగాణ కు రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఏపీ తెరాస నేత కొణిజేటి ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఏపీలోని విజయవాడ సీపీ శ్రీనివాసులుకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ నిరుద్యోగం ఉందని చెప్పారు. తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ.. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఏపీ తెరాస నాయకుడు కొణిజేటి ఆదినారాయణ అన్నారు. “ప్రజా ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్పై వ్యాఖ్యలు చేయటం సరికాదు” అన్నారు. శోభపై ఎటువంటి చర్యలు ఉంటాయోనన్న విషయం పక్కన పెడితే ఈ కంప్లయింట్ ద్వారా ఏపీలోనూ టీఆర్ఎస్ ఉందన్న విషయం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరి పార్టీ అయితే ఉంది.. భవిష్యత్ లో పోటీ కూడా ఉంటుందా..? వేచి చూద్దాం..!