భారత రాజ్యాంగంలో అత్యంత వివాదస్పద ఆర్టికల్ గా చెప్పబడే ఆర్టికల్ 356 గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విపక్షపార్టీ శ్రేణులు తీవ్రంగా చర్చిస్తున్నాయి. టీడీపీ కార్యాలయంపై పోలీసుల మద్దతుతోనే దాడి జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ రాష్ట్రంలో ఆర్టికల్ 356ని విధించాలని డిమాండ్ చేస్తోంది.
రాష్ట్రపతిని కలిసేందుకు విపక్ష నేత చంద్రబాబు సోమవారం డిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆర్టికల్ 356 ప్రయోగించి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రపతిని అభ్యర్థించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో కూడా భేటీ కానున్నారు. ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయిన టీడీపీ బృందం.. తమ పార్టీ ఆఫీస్ పై దాడి జరిగిందని ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ విఫలమైనందున ఆర్టికల్ 356 ప్రయోగించాలని గవర్నర్ ను టీడీపీ కోరింది.
ఆర్టికల్ 356కు వ్యతిరేకమని, రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం జోక్యానికి వ్యతిరేకమని టీడీపీ పలుసార్లు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఏపీలో సీబీఐ అడుగుపెట్టకూడదంటూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం తీర్మానం కూడా చేసింది. కానీ ప్రస్తుతం 356 ఆర్టికల్ ను రాష్ట్రంలో ప్రయోగించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. టీడీపీ చూపుతున్న పార్టీ ఆఫీసుపై దాడి కారణంతోనే ఆర్టికల్ 356ని ప్రయోగించే ఛాన్స్ లేదు. మరి ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి, ఇతర కేంద్రమంత్రులతో భేటీ అవుతానంటున్న చంద్రబాబు, బయటి ప్రపంచానికి తెలియని కారణాలు ఏమైనా చూపబోతున్నారా.. ?
అధికార వైసీపీ కూడా ఢిల్లీ వెళ్లి టీడీపీ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనుంది. ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉన్నవారిపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్న టీడీపీ పార్టీని రద్దు చేయాలని ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ ‘పార్టీ నేతలు చెబుతున్నారు.
రాష్ట్రాల్లో రాజ్యాంగ పరమైన యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే చాలా అరుదుగా ఆర్టికల్ 356 ప్రయోగిస్తారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా 1973 జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా 2014 ఫిబ్రవరి 28 నుంచి 2014 జూన్ 8 వరకు ప్రెసిడెంట్ రూల్ విధించారు. అంతకు ముందు ఆంధ్రరాష్ట్రంలో 1954 నవంబర్ నుంచి 1955 మార్చి 29 వరకు రాష్ట్రపతి పాలన విధించారు.