iDreamPost
android-app
ios-app

అఖిలపక్ష భేటీకి కేంద్రం సిద్ధమేనా..?

అఖిలపక్ష భేటీకి కేంద్రం సిద్ధమేనా..?

కరోనా రెండో దశ విజృంభణతో కేంద్రంపై ముప్పేట దాడి జరుగుతోంది. వైరస్‌ కట్టడిలో, వ్యాక్సినేషన్‌లో విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విపక్ష నేతలకు ప్రధాని మోదీకి లేఖల మీద లేఖలు రాస్తున్నారు. అఖిలపక్ష భేటీ నిర్వహించి దేశ ప్రజలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

‘పారిశ్రామికవేత్తలకు, వాణిజ్య అధిపతులకు మేలు చేకూర్చి, సామాన్యుణ్ణి ఇబ్బందుల పాల్జేయడం నాటి డీమానిటైజేషన్‌ లక్ష్యమైతే ఇపుడు కూడా పరిశ్రమాధిపతులు, కార్పొరేట్లు, కంపెనీలు దండుకోడానికి వ్యాక్సిన్‌ కొత్త విధానం ప్రకటించారు… సామాన్యులకు టీకా అందే పరిస్థితి లేదు’ అని కాంగ్రెస్‌ నేతల రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే మమతా బెనర్జీ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులు, వ్యాక్సిన్ల సరఫరాలో చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. కొవిడ్‌పై పోరులో ఉపయోగిస్తున్న వైద్యపరికరాలు, ఔషధాలపై అన్ని రకాల పన్నులు, కస్టమ్స్‌ సుంకాలను రద్దు చేయాలని మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. కొవిడ్‌ సంబంధిత మందులు, ఆక్సిజన్‌ కాన్సనే్ట్రటర్లు, సిలిండర్లు, కంటెయినర్లు విరాళంగా ఇస్తామని అనేక సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నారని.. వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు.

‘ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో 6 కోట్ల డోసుల వ్యాక్సిన్లను విదేశాలకు మోదీ పంపారు. ఆ సమయంలో భారత్‌లో కేవలం మూడు నాలుగు కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఆయనకు సెల్ఫ్‌-ప్రమోషన్‌ మీద ఉన్న ధ్యాస ఈ దేశ పౌరుల మీద లేదు. ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి… ఈ దేశ ప్రజానీకానికా లేక విదేశాలకా? మన కంపెనీలు తయారుచేస్తున్న వ్యాక్సిన్ల కోసం విదేశీ సంస్థలు ఎన్నడో ఆర్డర్లు ఇచ్చాయి. మన ప్రభుత్వమేమో జనవరిలో తన మొదటి ఆర్డర్‌ ఇచ్చింది. ఇది మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యం.. దూరదృష్టి లేదనడానికి నిదర్శనం’’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా కూడా గతంలో మోదీపై విమర్శలు గుప్పించారు.

కరోనా విలయాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలని, ఇందు కోసం అన్ని వర్గాలను కలుపుకుపోవాలని కేంద్ర సర్కారుకు కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే సూచించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆరు సూచనలు ఇస్తూ తాజాగా లేఖ రాశారు. కొవిడ్‌ బారిన పడిన తమ ఆప్తుల ప్రాణాలను రక్షించుకునేందుకు సామాన్యులు తమ ఆస్తులను సైతం తెగనమ్ముకోవాల్సి వస్తోందని ఆందోళన లేఖలో వ్యక్తం చేశారు. కొవిడ్‌ రెండో వేవ్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రధానికి కాంగ్రెస్‌ నుంచి అందిన నాలుగో లేఖ ఇది. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇప్పటికే మోదీకి అభ్యర్థనలు చేశారు.

కొవిడ్‌ విలయాన్ని ఎదుర్కోవడంలో ఏకాభిప్రాయ సాధన కోసం తక్షణమే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని మోదీకి ఖర్గే సూచించారు. వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తిని పెంచాలని కోరారు. అలాగే పన్ను రాయితీలు ఇవ్వాలని.. ముఖ్యమైన వైద్యసామగ్రి-వ్యాక్సిన్‌ ముడిపదార్థాలు, పీపీఈ కిట్లు, అంబులెన్స్‌లు, ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లపై ఈ సదుపాయం కల్పించాలని ఖర్గే సూచించారు. విదేశాల నుంచి అందుతున్న సాయాన్ని వీలైనంత త్వరగా అందేలా చూడాలని, ఉపాధి కోల్పోయిన కూలీలకు ఉపాధి హామీ పథకం కింద కూలీతో పాటు పనిదినాలను పెంచాలని ఖర్గే అభ్యర్థించారు. ఖర్గేతో పాటు పలువురు విపక్ష నేతలు కూడా అఖిలపక్ష భేటీకి డిమాండ్‌ చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ వంటి సూచనలను కూడా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీకి మొగ్గుచూపుతుందా.. అనేది చూడాలి.