iDreamPost
android-app
ios-app

ఏపీ, తెలంగాణా జలవివాదాల్లో కొరివితో తలగోక్కుంటున్న తెలంగాణా

  • Published Jul 10, 2021 | 2:48 AM Updated Updated Jul 10, 2021 | 2:48 AM
ఏపీ, తెలంగాణా జలవివాదాల్లో కొరివితో తలగోక్కుంటున్న తెలంగాణా

కేసు ఓడిన వాడు కోర్టులో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికెళ్లి ఏడుస్తాడనేది ఓ నానుడి. సరిగ్గా ఇప్పుడు ఏపీ తెలంగాణా మధ్య జలజగడం ఆ దిశలోనే ఉంది. తనది ఓ కన్ను పోయినా ఫర్వాలేదు..ఎదుటి వాడు రెండు కళ్ళూ పోవాలనుకునే ధోరణి సత్ఫలితాన్నివ్వదు. పైగా చేటు తెస్తుంది. తెలంగాణా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ మీద వివాదం సృష్టించింది.

కృష్ణా నదిలో వరద, మిగులు జలాల వినియోగంలో సామరస్యంగా వ్యవహరించాల్సింది పోయి సమస్యను తీవ్రం చేసింది. పలితంగా చివరకు కేసీఆర్ సర్కారు చేసిన ఎత్తులు బూమరాంగ్ కావడంతో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా వివాదంలో ఇరుక్కుంది. ఇన్నాళ్లుగా అనుమతులు లేకుండానే తెలంగాణా నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల పట్ల ఏపీ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరించింది.కానీ తెలంగాణా వైపు కోరి కయ్యానికి దిగడంతో అనివార్యంగా ఇప్పుడు అనుమతులు లేని తెలంగాణా ప్రాజెక్టులపై ఫిర్యాదులకు దారితీసింది.

యుద్ధం జరిగితే ఏ ఒక్కరికో నష్టం కాదు.. ఏదో మేరకు భాగస్వాములందరూ నష్టపోతారన్నది వాస్తవం. ఇప్పుడు నీటి కోసం ఇరు రాష్ట్రాలు తగాదాకి దిగాల్సిన పరిస్థితి వస్తుండడంతో ఇరువురూ నష్టపోయే పరిస్థితి దాపురిస్తోంది. నిబంధనల ప్రకారం శ్రీశైలం నుంచి విద్యుత్ అవసరాలకు నీటి వనరులను ఇష్టారాజ్యంగా వినియోగించే వైఖరికి చెక్ పెట్టేందుకు కేఆర్ఎంబీ ముందుకెళ్లే సూచనలున్నాయి. అలాంటి నిర్ణయం వెలువడితే తమ రాజకీయాలకు ఆటంకం అనే కారణంగా ఏకంగా కేఆర్ఎంబీ సమావేశాన్ని కూడా వాయిదా వేయించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. తద్వారా సమస్య చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఏర్పడిన కొద్దిపాటి అవకాశం కూడా మరింత ఆలశ్యమవుతోంది.

అదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం వ్యవహారాన్ని ఎన్జీటీ వరకూ తీసుకెళ్లింది. ఎన్జీటీ కూడా పర్యావరణ నిబంధనలు అవసరమని గతంలోనే చెప్పింది. దానికి అనుగుణంగా అనుమతులు కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి కూడా కేంద్రానికి లేఖలు రాశారు. ఈలోగా ఇప్పుడు వ్యవహారం తెలంగాణా మెడకు చుట్టుకుంటోంది.

పాలమూరు-రంగారెడ్డి మాత్రమే కాదు, దిండి సహా కృష్ణా నది మీద నిర్మిస్తున్న ఎత్తిపోతలు, చివరకు గోదావరిపై ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకి కూడా తెలంగాణా సర్కారుకి అనుమతులు లేవు. అయినా నిర్మాణం సాగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం ఇన్నాళ్లుగా దానిని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదు. ముఖ్యంగా బేసిన్లు లేవు.. భేషజాలు లేవు, నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంపైనే దృష్టి పెడదామని గతంలో ఇరువురు ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఏపీ వ్యవహరించింది. కానీ తీరా రాయలసీమ ఎత్తిపోతలకు కు అడ్డుపడడంతో పాలమూరు -ఎత్తిపోతల సంగతిని తాజాగా కేంద్రం ముందు ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది.

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసిన ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఈ అంశాన్ని ముందుకు తీసుకురావడంతో అనివార్యంగా పాలమూరు-రంగారెడ్డి వ్యవహారం వివాదాస్పదం అవుతుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం, సీడబ్య్లూసీ, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సంయుక్తంగా సమస్యను పరిష్కరించేందుకు ట్రిబ్యూనల్ ఏర్పాటు కోసం హామీ ఇచ్చాయి. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టులో కేసుని కూడా కేసేఆర్ సర్కారు విరమించుకుంది. అయినా ఆ తర్వాత తగాదా తీవ్రం చేసేందుకు కారకులు కావడంతో ఇప్పుడు తెలంగాణా కూడా సమస్యలు కొనితెచ్చుకున్నట్టయ్యింది. బచావత్ ట్రిబ్యూనల్ పై సమీక్షను ఏపీ ప్రభుత్వం నిరాకరించేందుకు సిద్ధపడడంతో పీఠముడి మరింత బిగిసుకుంటున్నట్టు కనిపిస్తోంది.