Idream media
Idream media
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమవుతుంది. ఈ నెల 30 వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. 31న నామినేషన్‌ల పరిశీలన, ఏప్రిల్ 3న ఉపసంహరణకు తుదిగడువుగా నిర్దేశించారు. ఏప్రిల్ 17న ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తప్పా టీఆర్‌ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఆయా పార్టీ అభ్యర్థులుగా రకరకాల పేర్లు ప్రచారంలో ఉండగా బీజేపీ నుంచి అనూహ్యంగా తీన్మార్ మల్లన్న పేరు తెరపైకివస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చి మల్లన్న బాగా ప్రాచుర్యం పొందారు.
అనూహ్య ఆదరణ
నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గం నుంచి తీన్మార్ మల్లన్న బరిలో నిలిచారు. బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఉద్యమ వ్యూహకర్తగా పేరొందిన ప్రొఫెసర్ కోదండరాం వంటి వారు కూడా ఉన్నారు. దీంతో వారి మధ్యే పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ మొదటి నుంచి కూడా తీన్మార్ మల్లన్న అధికార పార్టీకి ధీటుగా నిలబడ్డారు. పట్టభద్రులు మల్లన్నకు భారీగానే ఓట్లు వేశారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం 5,05,565 ఓట్లు ఉన్నాయి. 3,86,320 ఓట్లు పోలయ్యాయి. వాటిలో మల్లన్నకు 1, 49, 005 ఓట్లు వచ్చాయి. ప్రొఫెసర్ కోదండరామ్‌ను సైతం వెనక్కి నెట్టి మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. మల్లన్న గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కూడా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మల్లన్నకు పెద్దగా ఓట్లు పడలేదు. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తాడన్నంత పని చేశారు.
మల్లన్నపై బీజేపీ గురి?
విస్తృత పాదయాత్ర, తన వెబ్ చానల్ ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, బోగస్ ఓట్ల నమోదును ప్రశ్నించడం ద్వారా తీన్మార్ మల్లన్న యువకులు, యువ ఉద్యోగులకు బాగా దగ్గరయ్యారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నవారిని తనవైపు తిప్పుకోవడంలో సఫలం చెందారు. ఇదిలాఉండగా, టీఆర్‌ఎస్ యాదవ సామాజికవర్గానికి టికెట్ ఇస్తే, బీజేపీ ఎస్టీలవైపు చూడవచ్చన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి గట్టిపోటీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన తీన్మార్ మల్లన్నను అభ్యర్థిగా బరిలో దింపాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లు, ఇందులో భాగంగా మల్లన్న సోమవారం ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమైనట్లు ఇటు టీఆర్‌ఎస్, అటు బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది. అయితే మల్లన్న రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ వెళ్లారని ఆయన అనుచరులు అంటున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. పోలింగ్‌కు ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థుల ఖరారు, ప్రచార వ్యూహంపై పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి మల్లన్న పేరు వినిపిస్తోంది. ఇది ఎంత వరకూ నిజమనేది కొద్ది రోజుల్లో తేలనుంది.