iDreamPost
android-app
ios-app

ఇదేనా.. టీడీపీ స్ట్రాటజీ..!

ఇదేనా.. టీడీపీ స్ట్రాటజీ..!

తెలుగుదేశం పార్టీ స్ట్రాట‌జీ స‌మావేశం సోమ‌వారం జ‌రిగింది. స‌మావేశంలో చేసిన తీర్మానాలు, అధినేత చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల ద్వారా ఆ పార్టీ స్ట్రాట‌జీ తెలిసిపోతోంది. రాష్ట్రంలో ఏదో ఒక ఆందోళ‌న కొన‌సాగాల‌నేది టీడీపీ ప్ర‌ధాన ధ్యేయంగా క‌నిపిస్తోంది. అలాగే.. ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య స‌హృద్భావ వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌కుండా చేయాల‌నే దురుద్దేశాలూ క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఏపీ ఉద్యోగులు ఎంతో క‌ష్ట‌ప‌డి, స‌మైక్యంగా ఉద్య‌మించి త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చుకున్నారు. ఛలో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి వంద‌లాదిగా త‌ర‌లివెళ్లి త‌మ ఉద్య‌మ సంక‌ల్పాన్ని చాటి చెప్పారు. అలాంటి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఎవ‌రో బెదిరిస్తే బెదిరిపోయే అవ‌కాశం ఉందా?

ఈ ప్ర‌శ్న ఉద్భ‌వించ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చంద్ర‌బాబు కామెంట్స్ విచిత్రంగా ఉన్నాయి. ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో కోత విధించిందట‌. పోనీ ఆ సంగ‌తి వ‌దిలేసేయ్.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు సజ్జల ఉద్యోగుల్ని బెదిరించారని ఆయన ఆరోపించ‌డం కొస‌మెరుపు.

ఆయ‌న బెదిరింపుల వ‌ల్లే స‌మ్మె విర‌మించిన‌ట్లుగా చంద్ర‌బాబు చెప్పుకొస్తున్నారు. నిజంగా అలా బెదిరించే ర‌క‌మే అయితే.. అన్ని రోజుల పాటు ఉద్యోగుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతాయా. ఉద్యోగ సంఘాల నాయ‌కులు ప్ర‌భుత్వంపై ఆ స్థాయిలో డిమాండ్లు చేసే అవ‌కాశం ఉంటుందా? ఇదంతా చూస్తే.. ఉద్యోగుల‌కు మేలు జ‌ర‌గ‌కుండా, ప్ర‌భుత్వానికి పేరు రాకుండా ఉండాలంటే.. ఉద్యోగులు ఆందోళ‌న‌లు కొన‌సాగించాల‌నేదే బాబు స్ట్రాట‌జీగా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వం కూడా ఉద్యోగుల ఆందోళ‌న‌ను అర్థం చేసుకోవ‌డంతో స‌మ్మె ఆలోచ‌న‌ను విర‌మించి య‌ధావిధి కార్య‌క‌లాపాల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇటువంటి త‌రుణంలో స్ట్రాట‌జీ స‌మావేశంలో అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఎంతవ‌ర‌కు క‌రెక్టో ఆయ‌న‌కే తెలియాలి.

పేద‌ల ఇళ్ల స్థ‌లాల పంపిణీపై కూడా స్ట్రాట‌జీ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. సెంటు పట్టా పేరుతో భూములను అధిక రేట్లకు కొని రూ.7 వేల కోట్లు లూటీ చేశారంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇలాంటివి చేయ‌డం వ‌ల్లే రాష్ట్రంలో ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి సొంతింటి క‌ల కోసం ఎదురుచూస్తున్న ల‌క్ష‌లాది మందికి మేలు చేయ‌డం కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ సాహసోపేతంగా 30 ల‌క్ష‌ల మందికి స్థ‌లాలు పంపిణీ చేశారు. దాదాపు ప‌దిహేను ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ఇలాంటి స‌మ‌యంలో ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేస్తూ ఈ ప‌థ‌కంపై మ‌రోసారి ప్ర‌భావం చూపేలా బాబు వ్యాఖ్య‌లు ఉన్న‌ట్లుగా పేద‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇదంతా గ‌మ‌నిస్తే జ‌గ‌న్ పాల‌న సాఫీగా సాగ‌కుండా ఏదో విధంగా అడ్డంకులు సృష్టించ‌డ‌మే బాబు స్ట్రాట‌జీగా క‌నిపిస్తోంది.