iDreamPost
iDreamPost
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కమిటీలు వేశారు. చంద్రబాబు పాలనా కాలంలో సాగించిన వ్యవహరాలపై మంత్రివర్గ ఉపసంఘం సహా అనేక మార్లు తవ్వకాలు జరిగాయి. కానీ స్పష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. సిట్ ఏర్పాటుతో పెద్ద చర్చ సాగుతోంది. ముఖ్యంగా సిట్ గా ఇన్ఛార్జ్ గా నియమించిన అధికారి గత చరిత్రే దానికి కారణం. సిన్సియారిటీ, కమింట్ మెంట్, ఎంతకైనా తెగించే లక్షణాలు కలిగిన ఐపీఎస్ అధికారిగా డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డికి గుర్తింపు ఉంది. సరిగ్గా ఇప్పుడు ఆయన్నే ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సారధిగా సీఎం జగన్ ఎంపిక చేయడంతో గత ప్రభుత్వంలో అవకతవకలకు పాల్పడిన నేతల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నట్టు ప్రచారం మొదలయ్యింది. ఇప్పటి వరకూ ఒక ఎత్తు..ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఇన్నాళ్లు సాగించిన దర్యాప్తులు ఎలా ఉన్నప్పటికీ ఒక్కసారి రఘురామిరెడ్డి రంగంలో దిగితే సీన్ మొత్తం మారిపోవాల్సిందేనని పోలీస్ అధికారులు సైతం అంగీకరిస్తారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పట్టా పట్టుకుని, ఆతర్వాత ఐపీఎస్ గా ఎంపికయిన ఈ 2008 బ్యాచ్ అధికారి గ్రేహండ్స్ తో తన ప్రస్థానం ప్రారంభించారు. 2008లోనే హైదరాబాద్ లో గ్రేహౌండ్స్ కమాండర్ గానూ, ఆ తర్వాత వరుసగా భద్రాచలం, కొత్తగూడెం, నర్సీపట్నం వంటి మన్యం ప్రాంతాల్లో పోలీస్ అధికారిగానూ పనిచేసి తానేంటో నిరూపించుకున్నారు. 2013లో తొలిసారగి ఎస్పీ హోదాలో కర్నూలు వచ్చిన తర్వాత ఆయన కథ మారిపోయింది. 2014 ఎన్నికలకు ముందు ఆయన్ని కర్నూలు నుంచి ప్రకాశం జిల్లాకు హఠాత్తుగా బదిలీ చేసిన వైనంపై విధుల్లోకి చేరకుండా ఆయన ఏకంగా క్యాట్ కి ఫిర్యాదు చేశారు. ట్రిబ్యూనల్ కూడా రఘురామిరెడ్డి వాదనను బలపరచడంతో ఆయన మళ్లీ ఎస్పీగా కర్నూలు వచ్చి ఎన్నికల విధులు నిర్వహించారు.
2014 ఎన్నికల్లో కూడా కర్నూలులో టీడీపీ పై వైసీపీ పై చేయి సాధించింది. ఏకంగా ఎస్పీ వైఖరి కారణంగానే తాను ఓటమి పాలయినట్టు అప్పట్లో టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఆ సమయంలోనే ఆమ్వే ఇండియా వ్యవహారాలు బట్టబయలు చేయడంలో రఘరామ్ రెడ్డిది కీలకపాత్ర. చివరకు ఆమ్వే సీఈవోని గుర్గావ్ వెళ్లి మరీ అరెస్ట్ చేసి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆతర్వాత ఎన్ మార్ట్, అక్షయగోల్డ్ వంటి పలు కేసులు చేధించి వాటి బాసులను అరెస్ట్ చేసేటంత వరకూ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగిన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని కర్నూలు నుంచి పశ్చిమ గోదావరికి ఎస్పీగా బదిలీ చేశారు. కానీ అక్కడ కూడా ఎస్పీ ముక్కుసూటితనం, నిజాయితీతో అధికార పార్టీ నేతలు ఆటలు సాగలేదు. చివరకు 7 నెలల తిరక్కుండానే ఆయన్ని చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసింది. దాంతో ఆయన కేంద్ర సర్వీసుల్లో భాగంగా తెలంగాణాకి బదిలీపై వెళ్లారు. 2015 నుంచి గత ఏడాది సెప్టెంబర్ వరకూ హైదరాబాద్ లోనే విధులు నిర్వహించారు.
సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో మళ్లీ ఏపీలో అడుగుపెట్టారు. నిఘా విభాగం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఇటీవల డీఐజీగా పదోన్నతి లభించింది. ఇప్పుడు అదే హోదాలో కీలకమైన సిట్ కి ఇన్ఛార్జ్ గా బాద్యతలు స్వీకరించారు. ఇదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏరికోరి రఘురామ్ రెడ్డిని సిట్ కి బాస్ ని చేయడం వెనుక అసలు లక్ష్యాలు ఆనాటి అక్రమాల్లో భాగస్వాములకు అర్థమయినట్టు కనిపిస్తోంది. పట్టు విడవకుండా, అక్రమార్కులను పట్టుదలతో లోపలేసేటంత వరకూ ఎన్ని ఆటంకాలు వచ్చినా దూసుకుపోయే అధికారి సిట్ కి సారధిగా ఉన్న నేపథ్యంలో పరిణామాలను కొందరు నేతల, అధికారులు ఊహించికుంటూ కలవరపడుతున్నారనే ప్రచారం మొదలయ్యింది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో కూడా ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది. కొండను తవ్వి ఎలుకను పట్టారని ఇటీవల నారా లోకేష్ వంటి నేతలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ఐపీఎస్ ఆఫీసర్ టీమ్ ఏం పడుతుందో చూడాలి.