iDreamPost
android-app
ios-app

బద్వేల్ పోటీ నుంచి టీడీపీ తప్పుకుంటుందా?

బద్వేల్ పోటీ నుంచి టీడీపీ తప్పుకుంటుందా?

రెండు తెలుగు రాష్ట్రాలు ఉప ఎన్నికల సందడిలో ఉన్నాయి. రాజకీయంగా ఈ ఎన్నికలు అధికార పార్టీల పాలనకు ఒకరకంగా రెఫరెండంగా ఉన్నాయి. ఏపీ అధికార పార్టీ ఉప ఎన్నికలు మాకు రెఫరెండం కాదని చెప్పినా సరే తెలంగాణా అధికార పార్టీకి మాత్రం ఈ ఎన్నికలు రిఫరెండం గానే మారిపోయాయి. రాజకీయంగా ఇప్పటి వరకు తెలంగాణాలో ఉన్న పరిస్థితి వేరు హుజూరాబాద్ ఎన్నికల తర్వాత మారే పరిస్థితులు వేరు. ఏడేళ్ళ పాలన ఎలా ఉంది ఏంటీ అనేది తెరాస చెప్పాడం వేరు, ఈటెల రాజేంద్ర ఓటమి చెప్పడం వేరు అనేది చాలా మంది మాట్లాడే మాట.

అది పక్కన పెడితే ఏపీ ఉప ఎన్నికలు ఊహించని మలుపులు తిరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఏపీ ప్రజల మీద అపార విశ్వాసం తో ఉన్న అధికార పార్టీ నాయకులు ఎలా అయినా గెలుస్తాం అనే ధీమాలో ఉన్నారు. సిఎం జగన్ సొంత జిల్లా కావడంతో వాళ్లకు పెద్దగా కంగారు లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ టీడీపీ పోటీ లో ఉంటుందా లేదా అనేది స్పష్టత రావడం లేదు. నిన్న అనంతపురం పర్యటనలో భాగంగా, మరణించిన ఎమ్మెల్యే కుటుంబానికి సీటు ఇచ్చారు కాబట్టి పోటీ చేసే ఆలోచన లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

దీనితో ఈ ఎన్నికలో జనసేన పోటీ లేదు. ఇక టీడీపీ విషయానికి వస్తే పార్టీ అధిష్టానం ఇప్పుడు పోటీకి సంబంధించి పునరాలోచనలో పడిపోయింది. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల పై టీడీపీలో అనేక చర్చలు జరుగుతున్నాయి. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధాకు టికెట్ ఇవ్వటంతో పునరాలోచనలో రాష్ట్ర పార్టీ నేతలు ఉన్నారు. ఈ ఏడాదిలో జరిగిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్కడ మరణించిన అభ్యర్థి కుటుంబానికి టికెట్ ఇవ్వకపోవడంతో రంగంలోకి దిగామని అప్పుడు టీడీపీ అధిష్టానం ప్రకటన చేసింది.

ఇప్పటికే బద్వేలు ఉపఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు జనసేన పార్టీ నేతలు ప్రకటన చేసారు. ఇక్కడ బిజెపి అధిష్టానం మాత్రం పోటీ చేసేందుకు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సన్నిహిత వ్యక్తిని రంగంలోకి దింపే ఆలోచనలో ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలో కడపలో బిజెపి రాష్ట్ర పార్టీ నేతల సమావేశం కూడా జరిగింది. టీడీపీ ఇప్పటికే ఓబులాపురం రాజశేఖర్ను అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో టీడీపీ నేతలు, అలాగే అభ్యర్ధి రాజశేఖర్ చంద్రబాబుతో సమావేశం నిర్వహించగా చంద్రబాబు కూడా పోటీ లేకుండా మద్దతు ఇద్దామని ప్రకటించారని తెలిసింది.

కానీ గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో రాజశేఖర్ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అటు బద్వేల్ నేతలు కూడా బరిలోకి దిగాలి అని పట్టుదలగా ఉన్నారు. దీనిపై రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ పోటీ చేయకున్నా బిజెపి పోటీలో ఉంటుందని తెలుస్తుంది.

అయితే ఈ ఎన్నికల విషయంలో టీడీపీ అభ్యర్ధి రాజశేఖర్ మాత్రం సీరియస్ గా ఉన్నారని, ఉప ఎన్నిక వస్తుందని తెలిసిన నాటి నుంచి కూడా ఆయన నిధుల సమీకరణ కూడా చేసుకున్నారని, గోపవరం మండలంలో భూములు కూడా అమ్ముకున్నారని అంటున్నారు. అందుకే పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక టీడీపీ వద్దంటే అతను రెబెల్ గా బరిలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. రెబెల్ గా బరిలోకి దిగితే మాత్రం బిజెపి అతనికి బీ ఫాం ఇవ్వడానికి రెడీ గా ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ టీడీపీ పోటీ చేసినా లేకపోయినా సరే బిజెపి మాత్రం అభ్యర్ధి విషయంలో ఒక స్పష్టతకు వచ్చిందని తెలుస్తుంది.