Idream media
Idream media
వైసీపీ వేవ్ లో కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా ఆయనకు పేరుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన కొద్ది ఎమ్మెల్యేలలో ఆయన ఒకడు కావడంతో పార్టీలో మంచి గుర్తింపు వస్తుందని గంటా ఆశించారు. పబ్లిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తారని అనుకుంటే దక్కలేదు. శాసనసభలో ఉప నాయకుడి హోదా కూడా చిక్కలేదు. ఇక పార్టీలో అత్యున్నత వేదిక పొలిట్ బ్యూరోలో మెంబర్ కూడా నియమించలేదు. దాంతో గంటా సైలెంట్ అయిపోయారు. తెలుగుదేశం ఎంత ధీనస్థితికి చేరుతున్నా ఆయన అండగా నిలబడం లేదు. పైగా ఆయన పార్టీలో ఉండేందుకు ఇష్టపడడం లేదనే వాదనలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ఆయనపై ఆశలు వదులుకుని పక్కన పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు పలు నిర్ణయాలు నిదర్శనగా నిలుస్తున్నాయి.
గంటా శ్రీనివాసరావు కు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందే అంచనా ఉంటుంది అనే పేరుంది. అందుకే గెలిచే పార్టీలో చేరతారని అంటూ ఉంటారు. ఇలా రెండు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితం సక్సెస్ ఫుల్ గా సాగిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే 2019 ఎన్నికల్లో కూడా గంటా వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తుందని ఊహించారని చెబుతారు. అయితే ఆయన ఆ పార్టీలోకి వెళ్ళకముందే అవంతి శ్రీనివాసరావు వచ్చి చేరడంతో గంటా టీడీపీలోనే ఉండిపోయారు అంటారు. ఇక గంటా విశాఖ నార్త్ నుంచి గెలిచినా, గత రెండున్నరేళ్ళుగా టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. ఆయన పార్టీ అధినేతపై అసంతృప్తిగా ఉన్నారు. తనకు చంద్రబాబు సరైన గుర్తింపు ఇవ్వలేదన్నది అనుచరులతో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో ఆయన కొంత కాలంగా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు.
Also Read : సీనియర్లకు షాకిచ్చిన బాబు.. తెర మీదకు కొత్త పేర్లు..
ఈ విషయాన్ని ముందే గుర్తించిన టీడీపీ అధినాయకుడు చంద్రబాబు కూడా గంటాను ఇక విస్మరిద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు గా కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు ఏపీలోని ఆరు కీలకమైన నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించారు. ఇందులో భీమవరం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుని పక్కన పెట్టేశారు. ఆ సీటుకి మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని ఇంచార్జి చేశారు. రామాంజనేయులు గంటాకు వియ్యంకుడు అవుతారు. ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు 2014 లో టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. అయితే ఆయన భీమవరంలో గత కొంతకాలంగా యాక్టివ్ గా లేరనే తప్పించారని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆయన గంటాకు వియ్యకుండు కావడం వల్లనే ఆయనను నమ్మలేకనే సైడ్ చేశారు అన్న మాట ఉంది.
ఇదే విధంగా గంటా మరో వియ్యంకుడు మాజీ మంత్రి నారాయణకు కూడా టీడీపీలో ఇపుడు సరైన ప్రాధాన్యత లేదు. దీన్ని బట్టి చూస్తూంటే గంటాకు చెక్ చెప్పడానికే టీడీపీ డిసైడ్ అయిందా అన్న మాట కూడా ఉంది. విశాఖ జిల్లా రాజకీయాల వరకూ చూస్తే గంటాకు మరో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి పడదు అన్నది తెలిసిందే. ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడుతో కూడా విభేదాలు ఉన్నాయని అంటారు. గంటా శ్రీకాకుళం జిల్లాలో కిమిడి కళా వెంకటరావుకు మద్దతు ఇచ్చేవారు. ఇలా కనుక చూసుకుంటే సామాజిక రాజకీయ ప్రాంతీయ సమీకరణలు ఏవీ ఇపుడు గంటాకు సానుకూలంగా లేవనే అర్ధమవుతోంది.
Also Read : రాజీనామా చేసిన నెలకే పిలిచి మళ్లీ అదే పదవి.. టీడీపీ దుస్థితికి నిదర్శనం