iDreamPost
android-app
ios-app

TDP, OTP Scheme, Chandrababu – ఓటీఎస్‌కు ఆటంకాలు రాబోతున్నాయా..? చంద్రబాబు వ్యాఖ్యల ఆంతర్యమేమిటి..?

TDP, OTP Scheme, Chandrababu  – ఓటీఎస్‌కు ఆటంకాలు రాబోతున్నాయా..? చంద్రబాబు వ్యాఖ్యల ఆంతర్యమేమిటి..?

ప్రభుత్వాలు ఆర్థిక సాయం, రుణం మంజూరు చేసి కట్టిన, కట్టించిన ఇళ్లపై.. యజమానులకు పూర్తి హక్కులు కల్పించడం వల్ల.. వారికి అదొక ఆస్తిగా ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో ఆయా ఇళ్లపై ఉన్న దాదాపు 14 వేల కోట్ల రూపాయల రూణాలు మాఫీ చేసేలా జగన్‌ సర్కార్‌ తెచ్చిన వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)కు ఆటంకాలు రాబోతున్నాయా..? ఈ పథకాన్ని రాజకీయ లక్ష్యాల కోసం ఉపయోగించుకోవాలని టీడీపీ యోచిస్తోందా..? అంటే ఈ రోజు మీడియా సమావేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో అవుననే సమాధానం వస్తోంది.

ఓటీఎస్‌ పథకంపై విమర్శలు చేసిన చంద్రబాబు.. గత ప్రభుత్వాలు మంజూరు చేసిన రుణాలు ఈ ప్రభుత్వం సెటిల్‌ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ పథకం పేదలందరికీ ఉరితాడు కాబోతోందని అభివర్ణించారు. పలువురు ఇళ్ల యజమానులు మాట్లాడిన మాటలను మీడియా సమావేశంలో వినిపించిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే.. ఉచితంగా ఇళ్లపై హక్కులు కల్పిస్తామని మరోసారి చెప్పారు. ఇంతటితో ఆగని చంద్రబాబు ఈ రోజు అంబేద్కర్‌ వర్థంతిని గుర్తు చేస్తూ.. పేదలందరికీ రాజ్యాంగం అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతోనే ఓటీఎస్‌ పథకానికి టీడీపీ ఆటంకాలు కల్పించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు, పేదలందరికీ ఇళ్ల స్థలం మంజూరు, ఆ స్థలంలో ఇళ్లు నిర్మించే పథకంతో సహా అనేక పథకాలు, విధానాలను అడ్డుకునేందుకు టీడీపీ కోర్టుల్లో పిటీషన్లు వేసింది, వేయించింది. వాటిలో చాలా వరకు పరిష్కారం అయ్యాయి. మరికొన్ని విచారణ దశలో ఉన్నాయి. ఈ తరహాలోనే ఓటీఎస్‌పై కూడా టీడీపీ కోర్టుల్లో పిటీషన్లు వేయించే ఆలోచన చేస్తోందనే సందేహాలు.. పేదలందరికీ రాజ్యాంగం అండగా ఉంటుందని బాబు చేసిన వ్యాఖ్యలతో కలుగుతున్నాయి.

ఈ పథకంపై కొంత మంది ప్రజలకు ఇంకా సరైన అవగాహన రాలేదు. పట్టణాలలోని లబ్ధిదారులు మాత్రం ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నారు. తమ ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు వస్తే.. అదొక ఆస్తిగా పిల్లలకు ఉపయోగపడుతుందని, అవసరమైన సమయంలో తాకట్టు పెట్టి రుణం కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలుసుకున్నారు. అయితే గ్రామాలలో మాత్రం.. తమ స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటే.. రిజిస్ట్రేషన్‌ అవసరం ఏముందనే సందేహాలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉండడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయనేది అధికారులు, అధికార పార్టీ నేతలు వారికి సరైన అవగాహన కల్పించలేకపోతున్నారు.

ఈ పరిస్థితిని టీడీపీ తన రాజకీయానికి ఉపయోగించుకుంటోంది. అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014 ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే చంద్రబాబు ఇప్పుడు ఓటీఎస్‌ను ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. ఓటీఎస్‌కు వెళ్లవద్దని, తాను వచ్చిన తర్వాత ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని చెబుతూ, అదే విషయాన్ని నియోజకవర్గ ఇంఛార్జిల ద్వారా గ్రామాలలో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టించి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇలా చేస్తూ.. అదే సమయంలో ఓటీఎస్‌ ముందుకు వెళ్లకుండా కోర్టుల్లో పిటీషన్లు వేయించే పనులు చంద్రబాబు చేయించే అవకాశం లేకపోలేదు.

Also Read : OTS -ఓటీఎస్‌పై టీడీపీ అవాస్తవాల ప్రచారం