iDreamPost
android-app
ios-app

ఎన్న‌డూ లేనంత‌గా టీడీపీ దిగ‌జారిపోతోందా..?

ఎన్న‌డూ లేనంత‌గా టీడీపీ దిగ‌జారిపోతోందా..?

చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని తెలుగుదేశం పార్టీ గ‌తంలో కూడా రెండు సార్లు ప్ర‌తిప‌క్షంలో ఉంది. ఆ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను హుందాగా పోషించిందా, లేదా అనేది ప‌క్క‌న బెడితే.. ఇంత‌లా దిగ‌జారుడు రాజ‌కీయాలు చేసింది మాత్రం లేద‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన విప‌రీత పరిణామాల నేపథ్యంలో నంద‌మూరి తార‌క రామారావు నుంచి చంద్రబాబు నాయుడు అధికారాన్ని లాకున్నారు. అప్ప‌టి నుంచీ 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడిగా 9 సంవ‌త్స‌రాలు రికార్డు సృష్టించారు. ఆ త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయి ప్ర‌తిప‌క్షంలో కూర్చుంది. ఆ స‌మ‌యాల్లో కూడా ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త తీసుకురావాల‌ని, మ‌ళ్లీ అధికారం చేజిక్కించుకోవాల‌ని తెలుగుదేశం పార్టీ ప్ర‌య‌త్నించింది. కానీ, జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గ‌త రెండేళ్ల కాలంగా చేస్తున్న రాజ‌కీయాలు జుగుప్స‌క‌రంగా ఉంటున్నాయ‌నే అప‌వాదు మూటగ‌ట్టుకుంటోంది.

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2014లో జ‌రిగిన న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో టీడీపీ విజయం సాధించింది. మొత్తం 175 స్థానాలుండగా… అప్పటి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కి రాష్ట్ర విభజన ఎఫెక్టుతో ఒక్క సీటూ రాలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ బరిలో దిగింది. జగన్ సారథ్యంలోని వైసీపీ ఒంట‌రిగా ఢీ కొట్టింది. కొత్త రాష్ట్రానికి అనుభ‌వ‌జ్ఞుడి అవ‌స‌రం ఉందంటూ టీడీపీ చేసిన గ్లోబ‌ల్ ప్ర‌చారాన్ని న‌మ్మిన ప్ర‌జ‌లు అనుభవం రీత్యా చంద్రబాబుకే పట్టం కట్టారు. 44.9 శాతం ఓట్లతో టీడీపీ 102 స్థానాల్లో గెలిచింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ 44.6 శాతం ఓట్లతో 67 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్క‌డ టీడీపీ గెలిచినా వైసీపీకి, ఆ పార్టీకి మ‌ధ్య ఓట్ల వ్య‌త్యాసం కేవలం 0.3 శాతం మాత్ర‌మే. కానీ, న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్‌కు అనుభ‌వం అక్క‌ర‌కు రాలేదు. హ‌డావిడి, గ్రాఫిక్స్ మాయాజాలం త‌ప్పా చేసిందేమీ లేద‌ని న‌మ్మిన ప్ర‌జ‌లు 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీని బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీతో గెలిపించారు.

తెలుగుదేశం పార్టీని మ‌రోసారి ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెట్టారు.

అధికారంలోకి రాగానే జ‌గ‌న్ రాజ‌కీయాల్లోనూ, పాల‌న‌లోనూ విప్ల‌వాత్మ‌క మార్పులు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌జా సంక్షేమం, ప్ర‌జా సంర‌క్ష‌ణ‌లో రాష్ట్రంలో జ‌గ‌న్ పేరు త‌ప్పా, మ‌రో నాయ‌కుడి పేరు విన‌పించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీని మ‌ర‌చిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో ఆ పార్టీ నాయ‌కులు దిక్కుతోచ‌ని స్థితికి చేరారు. చివ‌ర‌కు దిగ‌జారుడు రాజ‌కీయాలు ప్రారంభించారు. దానిలో భాగంగా పుట్టుకొచ్చిన‌వే దేవాల‌యాల‌పై దాడులు, కుల, మ‌త విద్వేషాలు. తాజాగా ర‌ఘురామ‌రాజు అంశంలో కూడా టీడీపీ ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు విస్మ‌యం క‌లిగించేలా క‌నిపిస్తోంది. ప్రభుత్వాన్ని అస్థిర పరచడం, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని దుర్భాషలాడటం, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందేందుకు చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ గ‌మ‌నిస్తే ఆలోచించాల్సిందే.

అరెస్టు అనంత‌రం ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముసుగు తొలగించి నేరుగా రంగంలోకి దిగారు. అరెస్టు అన్యాయం, దారుణం అంటూ కేంద్రానికి లేఖ‌లు కూడా రాశారు. తనను పోలీసులు కొట్టారని రఘురామ ఆరోపిస్తే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం దారుణమంటూ ఆ ఎపిసోడ్‌ను చంద్రబాబు మ‌రింత‌ రక్తి కట్టించారు. గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ కూడా లేఖలు రాశారు. మరోవైపు దీన్ని రాజకీయం చేసి కులం సెంటిమెంట్‌ రగిల్చేందుకు చంద్రబాబు పథక రచన చేశారు. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు(పాందువ్వ శ్రీను)ను రంగంలోకి దించారు. రఘురామ అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు గుప్పిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం క్షత్రియులకు అన్యాయం చేస్తోందంటూ దుష్ప్రచారానికి తెరతీశారు. కులం సెంటిమెంట్‌ రంగరించి విద్వేషాలు రేకెత్తించేలా పాందువ్వ శ్రీను నేతృత్వంలో రెండు రోజులుగా విఫల యత్నాలు జరిగాయి.

చివ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో క్షత్రియులకు కేంద్ర బిందువు లాంటి భీమవరంలో సమావేశమైన క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు రఘురామకు తమ మద్దతు లేదని తేల్చి చెప్పారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి ఆ పార్టీపై, ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు దూషణలకు దిగడం సరికాదని స్పష్టం చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజుకు తమ మద్దతు లేదని నరసాపురం పార్లమెంట్‌ పరిధిలోని పలు ప్రాంతాల క్షత్రియ సేవా సమితుల సభ్యులు ప్రకటించారు. తమ సంఘాన్ని టీడీపీ నేతలు స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవటాన్ని క్షత్రియ సేవాసంఘం సీనియర్‌ సభ్యులు డాక్టర్‌ ఎస్‌వీ సుబ్బరాజు, పీవీ సుబ్బరాజు తీవ్రంగా ఖండించారు. ర‌ఘురామ కాళ్ల గాయాలు తాజాగా కొట్ట‌డం వ‌ల్ల క‌లిగిన‌వి కావ‌ని వైద్యులు తేల్చారు. న్యాయ‌స్థానానికి కూడా ఆ విష‌యం తెలిపారు. దీంతో చంద్ర‌బాబు చేసిన ఆరోప‌ణ‌లు, ఆడిన నాట‌కాలు అన్నీ కుట్ర‌లో భాగ‌మే అని తేలిపోయాయి. రాష్ట్రంలో క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితులు క‌నిపించ‌డంతోనే టీడీపీ ఇటువంటి రాజ‌కీయాలు చేస్తుంద‌న్న అవ‌వాదు మూట‌గ‌ట్టుకుంటోంది.