iDreamPost
android-app
ios-app

నడిచి వెళ్ళమంటున్న అభిమానం

  • Published Jun 26, 2021 | 10:43 AM Updated Updated Jun 26, 2021 | 10:43 AM
నడిచి వెళ్ళమంటున్న అభిమానం

సినిమా తారల మీద అభిమానం బహుశా ఇండియాలో ఉన్నంతగా ఇంకెక్కడా కనిపించదేమో. ఒక్కసారి హీరో అంటే ఇష్టం మొదలయ్యాక అతని కొడుకు మనవడు ఇలా తరతరాలు కుటుంబం మొత్తాన్ని విపరీతంగా ప్రేమించే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో తీరు. కొందరు ఫోటోలు దాచుకుంటే మరికొందరు వీడియోలు సేకరిస్తారు. మరికొందరు బ్యానర్లు కడితే ఇంకొందరు స్వంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తారు. కొన్నిసార్లు స్థోమతకు మించి హెచ్చులకు పోయినవాళ్ళు లేకపోలేదు. ఇంతా చేసి తమ అభిమాన హీరోలను వీళ్లంతా జీవితంలో ఒక్కసారైనా కలిసి ఉంటారా అదీ గ్యారెంటీగా చెప్పలేం.

ఇప్పుడో కొత్త ట్రెండ్ వచ్చింది. అదేమంటే ఉన్న ఊరి నుంచి తమకు ఇష్టమైన స్టార్లు ఎక్కడ ఉంటారో అక్కడికి నడుచుకుంటూ వెళ్లడం. నిన్న గద్వాల్ యువకుడు ఒకరు ఏకంగా 200 కిలోమీటర్లు నడుచుకుంటూ రామ్ చరణ్ కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు వచ్చేశాడు ఫ్రెండ్స్ తో సహా. చరణ్ కు ఇది తెలిసి కదిలిపోయి ఇంటికి పిలిచి మరీ కౌగిలించుకుని ఫోటోలు తీయించాడు. ఇదేముంది కానీ మొన్న సోనూ సూద్ కోసం ఏకంగా 700 కిలోమీటర్లు ముంబై వెళ్ళాడో ఫ్యాన్. రష్మిక మందన్న కోసం 900 కిలోమీటర్లు నడిచాడట ఒక అభిమాని. గతంలో అల్లు అర్జున్ కోసం కూడా ఇలా డబుల్ సెంచరీ మైళ్ళు పాదయాత్ర చేసిన ఫాన్స్ ఉన్నారు.

ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇతరులు కూడా స్ఫూర్తిగా తీసుకుని తమ హీరోలను కలవాలంటే ఇలా పాదయాత్ర చేస్తే చాలు అనుకుని ఫాలో అయితే అప్పుడు వస్తుంది అసలు సమస్య. అభిమానం ముసురుకున్నప్పుడు కొందరు ఆరోగ్యం కూడా పట్టించుకోరు. ఇలా వందలాది కిలోమీటర్లు నడవడం అప్పటికి బాగానే అనిపించవచ్చు. కానీ భవిషత్తులో వచ్చే ఇబ్బందులను ఇప్పుడే ఊహించలేం. అందుకే వీలైనంత వీటిని నిరుత్సాహ పరచడం చాలా అవసరం. లేదంటే శబరిమలై శ్రీశైలంలకు నడుచుకుంటూ వెళ్లే భక్తి కాస్తా ఇలా సినిమా వాళ్ళ కోసం కూడా చేసేందుకు ప్రేరేపించవచ్చు. ఏమో జరిగినా ఆశ్చర్యం లేదు