Idream media
Idream media
సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత అధికార పార్టీ కన్నా, ప్రతిపక్షానికే తలనొప్పులు ఎక్కువయ్యాయి. ఏపీలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న సోము అధికార పార్టీ పై ప్రస్తుతం ప్రజల్లో ఉన్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకోవడమో, లేదా ఇప్పటికి గట్టి ప్రతిపక్షంగా నిలబడితే చాలన్న వ్యూహమో కానీ టీడీపీపైనే ఎక్కువగా విమర్శలు సంధిస్తున్నారు.
సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిని వెలుగులోకి తెస్తూ టీడీపీని ఇరకాటంలో పడేస్తున్నారు. అప్పుడప్పుడూ ప్రభుత్వంపైనా, జగన్ పై కూడా సోము విరుచుకుపడుతున్నా టీడీపీని కూడా టార్గెట్ చేస్తుండడంతో అయోమయంలో పడ్డ చంద్రబాబు కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో తన అనుచరులుగా ఉన్న నేతల ద్వారా సోముపై ఆ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు జగన్ పై సోము తాజా స్టేట్ మెంట్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు.
సోము వీర్రాజు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా, ఏ అంశంపై నోరు విప్పినా వైసీపీతో పాటు, టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. దీనిపై బీజేపీకి చెందిన కొందరు నేతలు ఢిల్లీలోని పార్టీ పెద్దలకు మరో విధంగా సెలవిచ్చారట. వీర్రాజు కేవలం ప్రతిపక్షాన్ని తిట్టేందుకే పరిమితం అవుతున్నారని, అధికార పార్టీని కానీ, జగన్ ను కానీ పల్లెత్తు మాట అనడం లేదంటూ సోముపై ఫిర్యాదు చేశారట. టీడీపీని టార్గెట్ చేయడం పై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీజేపీ పెద్దలకు సెలవిచ్చారట. అయితే, దీని వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తమతో పాటు సోము దృష్టిని కూడా కేవలం జగన్ పైనే మళ్లించడం ద్వారా టీడీపీ కాస్త సేఫ్ అవుతుందని చంద్రబాబు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే.. తాజాగా సోము జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెడుతున్న తీరును ఎండగట్టారు. మీ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చుగా అంటూ.. విరుచుకుపడ్డారు. దీంతో ఒక్కసారిగా సోము వాయిస్ ఇలా మారిందేంటబ్బా! అనే చర్చ తెరమీదికి వచ్చింది. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకు టీడీపీపై నిప్పులు చెరిగిన సోము.. తాజాగా మాత్రం ఆ పార్టీ నేతలను వెనుకేసుకు రావడం.. వైసీపీ నేతలను మంత్రులను తిట్టిపోయడం కూడా ఆశ్చర్యంగా మారింది. `ఏదో జరిగే ఉంటుంది. లేకపోతే.. సోము ఇలా హఠాత్తుగా ఎందుకు మారతారు?` అనే చర్చ జోరుగా సాగుతోంది.