iDreamPost
android-app
ios-app

ప్రవీణ్ కుమార్ ఆ పార్టీలో చేరుతారా?

ప్రవీణ్ కుమార్ ఆ పార్టీలో చేరుతారా?

ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌.. ఐపీఎస్ అధికారిగా ఎంత పాపుల‌ర్ అయ్యారో, స్వ‌చ్ఛంద ఉద్యోగ విర‌మ‌ణ ప్ర‌క‌టించి అంత‌కు మించి సంచ‌ల‌నంగా మారారు. ‘బ‌హుజ‌న రాజ్యం రావాల‌న్న‌దే నా ఆకాంక్ష‌. కాన్షీరాం సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తా. కొంత మంది చేతుల్లో బంధీ అయిన అధికారాన్ని విడిపించాలి. రాజ్యాధికారం ద‌క్కితేనే అణ‌గారిన వ‌ర్గాల‌కు చేయూత’ అని పేర్కొనే ప్ర‌వీణ్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ పార్టీలో చేరేది ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలూ స‌న్నాహ‌కం అవుతున్న సంద‌ర్భంలోనే.. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌వీణ్ కుమార్ ఉద్యోగానికి రాజీనామా చేయ‌డంతో ఉప ఎన్నిక‌లో పోటీ కోస‌మే అన్న చ‌ర్చ జ‌రిగింది.

తాజాగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)లో చేరతారన్న చర్చ ఊపందుకుంటోంది. స్థానిక మీడియాతోపాటు జాతీయ చానళ్లలోనూ ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. బీఎస్పీ జాతీయస్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని, అందులో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంగళవారం పలువురు స్వేరో ప్రతినిధుల పేరిట సోషల్‌మీడియాలో సందేశాలు వైరల్‌గా మారాయి. ఆగస్టు 8న నల్లగొండ జిల్లాలోని ఎన్‌జీ కాలేజ్‌ మైదానంలో ఐదు లక్షలమందితో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, ప్రవీణ్‌ బీఎస్పీలో చేరతారన్నది వీటి సారాంశం. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రవీణ్‌కుమార్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఎస్పీలో చేరాలా? లేదా స్వతంత్ర వేదిక ఏర్పాటు చేయాలా? అనే దానిపై సమాలోచనలు సాగిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌ ఏ నిర్ణయం తీసుకున్నా వెంట నిలుస్తామని స్వేరో, పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

హుజూరాబాద్ లో నియోజ‌క‌వర్గంలో ఆ సామాజిక వ‌ర్గ ఓట్లు అధికంగా ఉండ‌డంతో ప్ర‌వీణ్ కుమార్ టీఆర్ఎస్ నుంచి పోటీకి దిగుతార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఆ ప్ర‌చారాన్ని ప్ర‌వీణ్ కుమార్ వెంట‌నే కొట్టి పారేశారు. “హుజూరాబాద్ లో నేను ఎవరెవరికో మద్దతిస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ ను నమ్మకండి. నా మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాదికే. అక్కడ వెదజల్లుతున్న డబ్బులను వీటికే పెట్టాలి. ఇప్పుడే రిటైరై ఒక ఇల్లు దేవులాడుట్ల బిజీగ ఉన్న. నన్ను ఊరికే ఆడికి లాగకుండ్రి. అంచనాలు తలక్రిందులయితై” అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ‘జై భీం’ పేరుతో కొత్త పార్టీ పెడతారని, లేకపోతే రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ బీఎస్పీ బాధ్యతలు చేపట్టి, రాజకీయంగా ముందుకు వెళ్తారని సన్నిహితులు అంచనా వేశారు. అనుకున్నట్లుగానే ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరుతున్నారు.

ఉద్యోగానికి రాజీనామా అనంత‌రం తాను ముందుగా రాజకీయాల్లో రానని ప్రకటించిన ఆయన అనంతరం బడుగుల బలహీన వర్గాల అభివృద్ది కోసం ముందుకు వస్తానని ప్రకటించారు. తన విశాల దృక్పథం ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుకు వస్తానని చెప్పారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు వల్ల ప్రయోజనం చేకూరదని విమర్శించారు. ఆ డబ్బులతో గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు టీఆర్ఎస్‌లో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలతో ప్రయోజనం లేదని అన్నారు.టీఆర్ఎస్ లో చేరుతున్న సంద‌ర్భంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా ప్ర‌వీణ్ కుమార్ విమ‌ర్శ‌లు చేశారు. “కౌశిక్ బ్రదర్, మీరు ఆధిపత్యకులాల నాయకులను ‘గారు’ అని గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజనరాజ్యం రావాలంటున్నరు. I am not against any particular caste, but we must stop this reckless framing.” అని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్ప‌ట్లో రాజ‌కీయాల‌కు దూరం అంటూనే ప్ర‌వీణ్ కుమార్ అన్ని అంశాల‌నూ క్షుణ్నంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న తెలంగాణ బీఎస్పీ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తాను బీఎస్పీలో చేరుతున్నట్టు ప్రవీణ్ కుమార్ మాత్రం స్వయంగా ప్రకటించలేదు. రాజీనామా అనంత‌రం బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికారం త‌క్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని ప్ర‌వీణ్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీఎస్పీలో చేరితే ఆ దిశ‌గా రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.