iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగేలా ఉన్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రిలయెన్స్ అధినేత హఠాత్తుగా అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. ముందస్తు ప్రకటనలు ఏమీ లేకుండా ఆయన జగన్ మోహన్ రెడ్డి ని కలవడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపిలో పారిశ్రామిక అభివృద్ధి కోసం, పెట్టుబడులు పెట్టేందుకు ముకేశ్ అంబానీ వచ్చి ముఖ్యమంత్రిని కలిసినట్టు పైకి చెబుతున్నారు.
కానీ.. అసలు రాజకీయాలు వేరుగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. రిలయెన్స్ ప్రతినిధికి ఏపీ నుంచి పెద్దల సభకు అవకాశం దక్కబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంబానీ వెంట ఆయన తనయుడితో పాటుగా మరో డైరెక్టర్ కూడా జగన్ తో భేటీ అయిన వారిలో ఉన్నారు. అదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. రిలయెన్స్ డైరెక్టర్ గా ఉన్న పరిమాల్ ధీరజ్ లాల్ నత్వాని ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన జార్ఖండ్ నుంచి వరుసగా రెండు సార్లు రాజ్యసభ కి ఎన్నికయ్యారు. అప్పట్లో బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్ గా ఆయన పెద్దల సభలో ప్రవేశించారు. 2008, 2014 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.
ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగుస్తోంది. దాంతో ఆయన మరోసారి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించే అవకాశం కోసం రిలయెన్స్ యాజమాన్యం ఆశిస్తోంది. అందుకు గల అవకాశాలను పరిశీలించిన తర్వాత ఏపీ వైపు వారు చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీ నుంచి ఈసారి 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిని వైయస్అర్సిపి గెలుచుకోవడం ఖాయం. అదేసమయంలో జార్ఖండ్ లో ఇటీవల ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. కాబట్టి ఈసారి ఏపీ నుంచి వైసీపీకి క్లియర్ మెజారిటీ ఉన్న తరుణంలో జగన్ మద్దతు ఇస్తే రిలయెన్స్ అశలు సులువుగా నెరవేరుతాయి.
తాజా సమావేశంలో ఈ అంశం పైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. వాస్తవానికి కేజీ బేసిన్ గ్యాస్ వ్యవహారంలో వైఎస్ హయాంలో పలు పరిణామాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ కి రిలయెన్స్ కి మధ్య సానుకూలత ఏర్పడితే అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకి దారితీస్తుందని అంతా చెబుతుంటారు. ఏమవుతుందో చూడాలి. ఇప్పటికే పలువురు వైసిపి నేతలు ఆశిస్తున్న రాజ్యసభ సీటు చివరకు ఈ బడా గుజరాతీ కార్పొరేట్ పరం అవుతుందో లేదో అన్నది త్వరలోనే తేలబోతోంది.