iDreamPost
android-app
ios-app

ఆ సీనియ‌ర్ నేత టీడీపీకి దూరంగా ఉండ‌డానికి కార‌ణాలేంటి?

ఆ సీనియ‌ర్ నేత టీడీపీకి దూరంగా ఉండ‌డానికి కార‌ణాలేంటి?

ఒక‌వైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడి త‌న‌యుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ ఇత‌ర పార్టీల‌లోని సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుల‌కు ఫోన్ చేసి మ‌రీ ఆహ్వానాలు ప‌లుకుతుంటే.. మ‌రోవైపు సొంత పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అందుకు కార‌ణం లోకేశే అన్న వాద‌న కూడా లేక‌పోలేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్ తో బాబు, లోకేశ్ సీనియ‌ర్ల‌కు స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌న్న వార్త బ‌హిర్గ‌త‌మైంది. దాన్ని నివారించేందుకు ఎలాగోలా ఒప్పించి గోరంట్ల‌ను శాంతింప చేశారు. అయితే.. కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత రెడ్డప్పగారిపల్లి రమేశ్ కుమార్ రెడ్డి కూడా ప్ర‌స్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

రాయచోటి లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో రమేశ్ రెడ్డి కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. రమేశ్ రెడ్డి తండ్రి రెడెప్పగారి రాజగోపాల్ రెడ్డికి కడప రాజకీయాల్లో దురందురుడిగా పేరుంది. ఆయన 1967, 72లలో కాంగ్రెస్ తరుఫున లక్కిరెడ్డి పల్లె నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1978లో జనతాపార్టీ తరుఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 198385లలో టీడీపీ తరుఫు రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక అనంతరం కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డి 1989లో గెలుపొందారు. 1994లో పోటీచేసి ఓడిపోయారు. కడప జిల్లాలో వైఎస్ఆర్ కు వ్యతిరేక వర్గంగా రాజగోపాల్ రెడ్డికి గుర్తింపు ఉంది. అనంతరం వృద్ధాప్యం కారణంగా ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.

ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి రాజకీయ వారసులుగా ఆయన కుమారులు రమేశ్ కుమార్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి వచ్చారు. 1999లో రమేశ్ రెడ్డి లక్కిరెడ్డి పల్లె ఎమ్మెల్యేగా టీడీపీ తరుఫున గెలుపొందారు. ఆ తర్వాత వరుస ఎన్నికల్లో పోటీచేసినా గెలవలేకపోయారు. ఇక రమేశ్ రెడ్డి తమ్ముడు శ్రీనివాసులు రెడ్డి కడప నుంచి వైఎస్ జగన్ పై గతంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడిగా ఉన్నారు.

2009లో నియోజకవర్గాల విభజనలో లక్కిరెడ్డి పల్లె నియోజకవర్గం చీలిపోయి ఈ కుటుంబానికి భారీ దెబ్బ పడింది. పలు మండలాలు వేర్వేరు నియోజకవర్గాల్లో కలిసి పోయాయి. దీంతో రాయచోటి నియోజకవర్గం మిగిలింది. ఈ నేపథ్యంలో రాయచోటిలో టీడీపీలో ఇప్పటికే బలమైన నేతలుగా పాలకొండ్రా నాయుడు రాజగోపాల్ రెడ్డి తనయుల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. 2019లో రాయచోటి నుంచి రమేశ్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక అక్క‌డ గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని దూరంగా ఉంటున్నారా? లేదా ఇత‌ర కార‌ణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.