జనసేనతో రాపాక ప్రయాణం కొనసాగుతుందా?

  • ఇక్కడ ఉంటే నేను నంబర్ వన్ అక్కడికి వెళ్తే నా నంబర్ 152
  • జనసేన కూడా సంస్థాగత నిర్మాణం చేసుకుని, బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకుని కష్టపడి ఉంటే కొన్ని సీట్లు గెలిచి ఉండేది
  • ఈయనొక్కడు మాత్రం ఎందుకు గెలిచాడురా బాబు.. ఇవన్నీ రాపాక వరప్రసాద్ చుట్టూ జరుగుతున్న చర్చలో భాగం.

గత కొంతకాలంగా అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాలకు భిన్నంగా స్పందిస్తున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ప్రచారం జరిగింది. కొన్ని గంటల తరువాత అలాంటిదేమి లేదని,రాపాక ను సస్పెండ్ చెయ్యలేదని జనసేన ప్రకటన విడుదల చేసింది.

కొంతకాలంగా రాపాక వరప్రసాద్ కి జనసేన పార్టీ తో అంతర్లీనంగా ఉన్న విభేదాలు, శాసనసభలో ఇంగ్లిష్ మీడియం విద్యమీద ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించడంతో బహిర్గతమయ్యాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం విద్యపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక బహిరంగ సభలు పెట్టి తెలుగు భాషను సంరక్షించుకోవాలని ప్రచారం చేసారు. కానీ శాసనసభలో ఈ విషయం మీద జరిగిన చర్చలో రాపాక వరప్రసాద్ ఇంగ్లీష్ మీడియం వలన దళిత,బలహీన వర్గాలకు మంచి జరుగుతుందని చెప్పి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు.

రైతు సమస్యల మీద “సౌభాగ్య దీక్ష”పేరుతో ఈ నెల డిసెంబర్ 12న కాకినాడలో పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టగా, రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. శాసన సభ జరగుతుండటం వలన సౌభాగ్య దీక్షకు హాజరు కాలేదని జనసేన శ్రేణులు భావించినా, అదే రోజు ఉదయం సొంత నియోజకవర్గం రాజోలులో ఒక హోటల్ ప్రారంభోత్సవానికి హాజరైన రాపాక వరప్రసాద్ ఫోటోలు సోషల్ మీడియాలో చూసి ఆయనకు జనసేనతో సంబంధాలు తెగిపోతున్నట్లు అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. దీక్షకు హాజరు కాలేకపోతున్నానని పవన్ కళ్యాణ్ కి కానీ జనసేన పార్టీకి కానీ రాపాక వరప్రసాద్ ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.

ఎన్నికల ముందు వరకు రాజోలు వైసీపీ టికెట్ కోసం ఎదురుచూసిన రాపాక వరప్రసాద్ ఆ టికెట్టు బొంతు రాజేశ్వరరావుకి దక్కడంతో జనసేనలో చేరి 1000 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. అధినేత పవన్ కళ్యాణ్ రెండుచోట్ల ఓడిపోవడం, పార్టీ తరపున తానొక్కడే ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు రాజకీయ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గతంలో మీరు వైసీపీలో చేరుతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా “ఇక్కడ ఉంటే నేను నంబర్ వన్ అక్కడికి వెళ్తే నా నంబర్ 152” నేను నంబర్ 1 గానే ఉండాలనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చారు.

రాజోలులో గెలవడానికి తాను కమిటీలు ఏర్పాటు చేసుకుని ఒక పద్దతిగా పనిచేయడమే ముఖ్య కారణమని ఒక ఇంటర్వ్యూలో రాపాక వరప్రసాద్ అన్నారు. జనసేన కూడా సంస్థాగత నిర్మాణం చేసుకుని, బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకుని కష్టపడి ఉంటే కొన్ని సీట్లు గెలిచి ఉండేదని పరోక్షంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద విమర్శలు చేసారు.

తాజాగా నిన్న ఒక సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పనితీరు మీద నేరుగా విమర్శలు చేసారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకునే ముందు తనను కానీ మరే ఇతర నాయకులను కానీ సంప్రదించడం లేదని, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా నిర్ణయాలు ఉంటున్నాయని అందుకే అనేకమంది నాయకులు పార్టీని వీడారని, పార్టీ మొత్తం నాదెండ్ల మనోహర్ చెప్పినట్లే నడుస్తుందని విమర్శించారు.

ఇదే ఇంటర్వూలో జనసేన భవిష్యత్తు మీద సమాధానాన్ని దాటవేసిన రాపాక ఏ రాజకీయ నాయకుడైనా తన భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకుంటారని కానీ తాను జనసేనను వీడటం లేదని నర్మగర్భంగా చెప్పారు. దీనితో రాపాక జనసేనను వీడుతున్నట్లు అనుమానాలు బలపడ్డాయి.రాపాక వరప్రసాద్ రాజకీయ గురువు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు గత అక్టోబర్ లో తన వర్గంతో కలిసి వైసీపీలో చేరిననాడే రాపాక కూడా తన గురువు బాటలో వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది.

ఈరోజు జనసేన ఇచ్చిన క్లారిటీతో రాపాక వరప్రసాద్ పార్టీ వీడటం మీద జరుగుతన్న చర్చకు కొంత కాలం బ్రేక్ పడొచ్చు. కానీ రాపాక లేవనెత్తిన అంశాలు ముఖ్యంగా సంస్థాగతంగా పార్టీని బల పర్చుకోవటం,నాయకులతో సంప్రదింపులు చెయ్యటం తదితర అంశాల మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలి.

ప్రజాస్వామ్యంలో చట్టసభల్లో బహుళ పార్టీల ప్రాతినిధ్యం ఉంటే మంచి చర్చకు, సమస్యల పరిష్కారానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాపాకను కాపాడుకోవటానికి జనసేన ప్రయత్నం చెయ్యాలి,రాపాక కూడా పవన్ కళ్యాణ్ తో ఉన్న గ్యాప్ ను తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి.

Show comments