iDreamPost
android-app
ios-app

Rampachodavaram, Ananta Babu, MLC Seat – ఉదయ్‌ భాస్కర్‌కు ఎమ్మెల్సీ ఖాయమేనా..?

Rampachodavaram, Ananta Babu, MLC Seat – ఉదయ్‌ భాస్కర్‌కు ఎమ్మెల్సీ ఖాయమేనా..?

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీలో సందడి నెలకొంది. ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికలకు ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్‌ రాబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం పని చేసిన నేతలు.. ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ జాబితాలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన కాపు నేత అనంత ఉదయ్‌ భాస్కర్‌ (అనంతబాబు) ఒకరు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితం మొదలు పెట్టిన అనంతబాబు.. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. ఎస్టీ రిజర్డ్వ్‌ నియోజకవర్గమైన రంపచోడవరంలో పార్టీకి బలోపేతానికి కృషి చేశారు. నియోజకవర్గంలో పార్టీకి అంతా తానై నడిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు అభ్యర్థుల ఎంపిక, వారి గెలుపు, పార్టీ కార్యక్రమాలు.. అన్ని బాధ్యతలు అనంతబాబే చూస్తున్నారు. కో ఆర్డినేటర్‌ పని చేస్తూ రంపచోడవరం నియోజకవర్గాన్ని వైసీపీకి కంచుకోటగా మార్చడంలో ఉదయ్‌ భాస్కర్‌దే కీలక పాత్ర. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రుకు, అనంతబాబుకు మధ్య బంధుత్వం ఉంది.

Also Read : AP MLC Elections – మోగిన ఎమ్మెల్సీ నగారా.. ఎన్నిక లాంఛనమే.. వైసీపీలో సందడి

2014 ఎన్నికల్లో వంతల రాజేశ్వరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారు. అనంతబాబు చెప్పిన వారికే వైసీపీ అధిష్టానం టిక్కెట్‌ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో వైసీపీ ఐదు గెలవగా.. అందులో రంపచోడవరం ఒకటి. కొంత కాలానికి అనంతబాబుకి, ఎమ్మెల్యే రాజేశ్వరికి మధ్య విభేదాలు తలెత్తాయి. పార్టీ సమావేశాల్లో ఇద్దరూ బహిరంగంగా వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజేశ్వరి.. 2017లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

రాజేశ్వరి పార్టీని వీడినా.. ఆ ప్రభావం లేకుండా అనంతబాబు చూసుకున్నారు. 2019లో టీచర్‌గా పని చేస్తున్న ధనలక్ష్మీని అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆమెకు టిక్కెట్‌ ఇప్పించుకున్న అనంతబాబు.. మరోసారి రంపచోడవరంలో వైసీపీ జెండాను ఎగురవేశారు. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ తలపెట్టిన ముంపు మండలాల పర్యటన, చాపరాయిలో విష జ్వరాలతో చనిపోయిన గిరిజన కుటుంబాల పరామర్శ కార్యక్రమాలను అనంతబాబు ముందుండి నడిపించారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతబాబుకు తగిన గౌరవం కల్పించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. రెండేళ్ల కాలపరిమితి ఇటీవల ముగియడంతో.. ఆ స్థానంలో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసిన ఆకుల వీర్రాజును వైఎస్‌ జగన్‌ నియమించారు. ప్రస్తుతం ఉదయ్‌ భాస్కర్‌ పార్టీ పదవిలోనే ఉన్నారు. ఎమ్మెల్సీ పదవిపై ఆయన గంపెడాశలు పెట్టుకున్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ సీటు రేసులో ఆకుల వీర్రాజు, అనంత ఉదయ్‌ భాస్కర్‌లే ముందు వరుసలో ఉన్నారు. వీరిద్దరిలో వీర్రాజుకు డీసీసీబీ చైర్మన్‌ పదవి ఇవ్వడంతో.. అనంతబాబుకు లైన్‌ క్లియర్‌ అయినట్లేనని భావిస్తున్నారు.

Also Read : YCP MLC Candidates – పాత, కొత్త కలయిక.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..