iDreamPost
android-app
ios-app

మనిషి మారెను,భాష మారెను .. కులం మీద పవన్ యూ టర్న్

మనిషి మారెను,భాష మారెను .. కులం మీద పవన్ యూ టర్న్

రాజకీయాలకు సినిమాలకు చాలా తేడా ఉంటుంది… ఇష్టం వచ్చినట్టు డైలాగ్ లు సినిమాలకు ఓకే గాని రాజకీయాలకు సెట్ కావు… రాజకీయాల్లో ప్రజలు ఆదరిస్తారు అనుకోవడం వేరు, వాస్తవం వేరు. ఇక మాట్లాడే భాష విషయంలో చాలా పరిణితి ప్రదర్శించాలి. భావోద్వేగాలను, కులాలను ఒక పరిమితి వరకు వాడుకోవచ్చు గాని వాటి మీదనే రాజకీయ పునాదులు ఏర్పాటు చేసుకోవాలి అనుకోవడం అమాయకత్వం అవుతుంది. మాట్లాడే మాటలు అందరిని కలుపుకుని పోయే విధంగా ఉండాలి గాని మాట్లాడుతుంటే విరక్తి వచ్చే పరిస్థితి ఉండకూడదు.

ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి దాదాపు అదే విధంగా ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అప్పుడప్పుడు ట్విట్టర్ లో కుదిరినప్పుడు మంగళగిరి కార్యాలయం లో కనపడుతున్న పవన్, మూడు రోజుల నుంచి హాట్ టాపిక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, మేనల్లుడి సినిమా ఫంక్షన్ కు వచ్చి మంత్రుల మీద దూషణతో కొత్త వివాదానికి తెరతీశాడు. ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కొన్ని కామెంట్స్ చేసారు.

“తెలంగాణకు వర్గ శత్రువులు ఆంధ్ర పాలకులు. వైసీపీకి వర్గ శత్రువులు కమ్మవాళ్ళు. 151 సీట్ల బలం ఉందని ఒక వర్గాన్ని తొక్కేస్తాం అంటే ఎలా. పేదలకు న్యాయం చెయ్యని వారు,దోపిడీ చేసే వారే మా వర్గ శత్రువులు. వంగవీటి మోహన్ రంగాను చిన్నప్పుడు చూసాను. కులాల కుమ్మలాటలో రంగా గారినీ చంపడం ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాదు. రంగాను హత్య చేస్తుంటే ఆయన పక్కన ఉండే వారు అప్పుడు ఎందుకు లేరనేది ఇప్పటికి అర్థం కావడం లేదు” కార్యకర్తల ముందు ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇవి.

Also Read : ఒక్కడే గెలిస్తే బాగోదని ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌, వెల్లడించిన నాదెండ్ల మనోహర్

మరి ఎవరికి దగ్గర కావాలి అనుకున్నారో గాని, కమ్మ సామాజిక వర్గానికి అనుకూలంగా మాట్లాడారు. కమ్మ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారనే టీడీపీ కామెంట్స్ ను తాను భుజానికి వేసుకున్నారు. ఇక మరో విషయం చూస్తే… వాస్తవానికి గత ఎన్నికల ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచన మారింది అనే భావన ఉంది. గాజువాకలో గాని భీమవరంలో గాని కాపు సామాజిక వర్గమే ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడా ఓటమి చెందిన తర్వాత… తన సామాజిక వర్గం అండ పూర్తిస్థాయిలో ఉంటే కానీ రాజకీయంగా రాణించలేననే భావనకు పవన్ వచ్చినట్టే కనపడుతుంది.

అందుకే కులం కాదు కాదు అంటూనే కాపు రిజర్వేషన్ గురించి, రాయలసీమలో ఎక్కువగా ఉండే బలిజ సామాజిక వర్గం గురించి పవన్ పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. కాపులకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తుల మధ్య పోటీనే గాని కులాల మధ్య పోటీ అనేది దాదాపుగా ఎక్కడా కనపడలేదు. కాని పవన్ వ్యాఖ్యల తర్వాత మాత్రం తన కులం తనకు పూర్తిగా అండగా ఉండాలి అనే అభిప్రాయానికి వచ్చారు అనేది అర్ధమవుతుంది.

ఇందులో పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటీ అనేది క్లియర్ గా అర్ధమవుతుందనే అభిప్రాయం వినపడుతుంది. వర్గ శత్రువులు అనే మాట వాడారు పవన్. కమ్యునిస్టులతో గత స్నేహంలో విన్న మాటలో ఏమో గాని… కమ్యూనిస్టులు మరీ ముఖ్యంగా మావోయిస్ట్ లు మాత్రమె వాడే పదం అది. అలాంటి పదాన్ని వాడి, ఒక కులం ద్వారా తనపై సానుకూలత పెంచుకునే ప్రయత్నం చేసారు. కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ వేధిస్తున్నారు అనే మాటను తాను కూడా చెప్తే ప్రజలు నమ్ముతారు అనే భావనకు పవన్ వచ్చారు అన్నట్టే ఆ ప్రసంగం ఉంది.

Also Read : టీడీపీపై చంద్ర‌బాబు కంట్రోల్ త‌ప్పుతోందా?ఇన్ని అసమ్మతి స్వరాలా ?

కోస్తాంద్రలో కొన్ని చోట్ల కాపు వర్సెస్ కాపు, కమ్మ వర్సెస్ కమ్మ, అలాగే రాయలసీమలో రెడ్డి వర్సెస్ రెడ్డి గా, ఎస్సీ నియోజకవర్గాల్లో దళిత వర్సెస్ దళిత నడిచింది గాని కమ్మ వర్సెస్ రెడ్డి, కమ్మ వర్సెస్ కాపుగా చాలా తక్కువ నియోజకవర్గాలలో ఉంటుంది. పవన్ ప్రయత్నాలు మాత్రం కులాల ద్వారా రాజకీయ పునాదుల బలపర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్ధమవుతుంది.

ఇక వంగవీటి రంగా అంశాన్ని కొన్ని కొంత కాలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్న పవన్, ఇప్పుడు ఏకంగా హత్యకు సంబంధించి సంచలన విషయాలను ప్రస్తావించే ప్రయత్నం చేసారు. తద్వారా కాపులను తనకు అనుకూలంగా మార్చుకునే అడుగు గట్టిగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. రంగా అభిమానులు, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతంలో బలమైన కుల పునాదులను ఏర్పాటు చేసుకుని తను గెలవాలి అనే వ్యూహం అలాగే మరో పార్టీని దగ్గర చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే పవన్ ప్రసంగం నడిచింది.

టీడీపీకి అనుకూలంగా పరోక్షంగా మాట్లాడుతూ, తన ప్రసంగంలో తన కుల దైవంగా భావించే దివంగత వంగవీటి రంగా పేరుని ప్రస్తావిస్తూ పవన్ చాలా తెలివిగా మాట్లాడారు అనే భావన వ్యక్తమవుతుంది. అప్పుడప్పుడు రంగా విగ్రహాలకు దండలు వేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా కుల పునాదుల కోసం ఆయన పేరుని ఎత్తుకున్నారనే అభిప్రాయం బలంగా వినపడుతుంది.

Also Read : కుప్పం ఓటమిని మభ్యపెట్టేందుకేనా పవన్ దాడి?