iDreamPost
android-app
ios-app

ప‌న‌బాక సైకిల్ కు గుడ్ బై చెప్ప‌నున్నారా?

ప‌న‌బాక సైకిల్ కు గుడ్ బై చెప్ప‌నున్నారా?

తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప‌న‌బాక ల‌క్ష్మి ఆ పార్టీకి గుడ్ బై చెప్ప‌నున్నారు అనే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వాస్త‌వానికి తిరుప‌తి ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ప‌న‌బాక పార్టీ మార‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచే ఆమె పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. అయిన‌ప్ప‌టికీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఉప ఎన్నిక‌ల్లో కూడా ఆమెకు పిలిచి సీటు ఇచ్చారు. అంద‌రి కంటే ముందుగానే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఆమె ఉత్సాహంగా ప్ర‌చారం మొద‌లుపెట్ట‌లేదు. దీంతో ఆమె పార్టీ మార‌తార‌నే ఊహాగానాలు మ‌రింత పెరిగాయి. చివ‌ర‌కు పోటీ చేసిన‌ప్ప‌టికీ ఘోరంగా ఓడిపోయారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి మరింత దారుణంగా తయారైపోతోంది. ఓ వైపు అధికార పక్షం నుంచి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరోవైపు.. సొంత పార్టీ నుంచి కూడా తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రతిసారీ కొత్త సమస్య వచ్చి పడుతూనే ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన భారీ దెబ్బ నుంచి కోలుకోవడానికి చంద్రబాబుకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆ తర్వాత మునిసిపల్ పోరులోనూ సైకిల్ పంక్ఛర్ అయిపోయింది. పంచాయతీల్లో 85 శాతానికిపైగా మునిసిపాలిటీల్లో 90 శాతానికిపైగా స్థానాలు గెలుచుకున్న అధికార పార్టీ.. తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఆ విధంగా జగన్ తనకు తిరుగులేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. జనం తమ పక్షాన్నే ఉన్నారని చాటుకుంటున్నారు.

దీంతో.. వైసీపీని ఎలా ఎదుర్కోవాలో అర్థంగాక సతమతం అవుతున్న చంద్రబాబుకు.. ఇంటి లొల్లి ఎక్కువైపోయింది. ఓవైపేమో ఎన్ని జాకీలు పెట్టి లేపినా.. లోకేష్ ను భావినేతగా గుర్తించట్లేదు పార్టీలోని చాలా మంది. మరోవైపేమో చంద్రబాబు సీనియర్ సిటిజన్ అయిపోయాడు అంటూ రెస్ట్ తీసుకోవాలనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులతో అవస్థలు పడుతున్న బాబుకు.. కొందరు సైకిల్ దిగిపోవడానికి సిద్ధమవుతుండడం.. మూలిగేనక్కపై తాంటిపండు పడ్డ చందంగా తయారవుతోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ చెంతన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నీరుగారిపోవడంతోనే మరికొంతమంది వైసీపీతో టచ్ లో వెళ్లారన్న వార్తలు గుప్పు మన్నాయి.

తాజాగా.. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పనబాక లక్ష్మి కూడా అధికార పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతోందని అంటున్నారు. గ‌తంలో ఆమె బీజేపీలో చేర‌తార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ప‌న‌బాక అస‌లు టీడీపీలో ఉంటారా? ఒక వేళ పార్టీ మారితే ఎందులోకి వెళ్తార‌నేది ఆస‌క్తిగా మారింది.