iDreamPost
android-app
ios-app

జ‌గ‌న్ ల‌క్ష్యంగా “జ‌ట్టు” క‌ట్ట‌నున్నాయా..?

జ‌గ‌న్ ల‌క్ష్యంగా “జ‌ట్టు” క‌ట్ట‌నున్నాయా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జాతీయ స్థాయిలోనే ఉత్త‌మ సీఎంగా పేరు పొందుతున్నారు. సంక్షేమ పథకాల అమలులో దూసుకెళ్తూ అంద‌రి దృష్టీ ఆక‌ర్షిస్తున్నారు. మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను ఏడాదిన్న‌ర లోపే అమ‌లు చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేశారు. ఇటీవల ఏకంగా 30లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు అందించ‌డంతో పాటు పక్కా ఇళ్ల నిర్మాణానికి వ‌డివ‌డిగా అడుగులు వేస్తూ ప్ర‌తిప‌క్షాలకు పిచ్చెక్కిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ను ఢీ కొట్టాలంటే ఏం చేయాలో ఆయా పార్టీల‌కు పాలుపోవ‌డం లేదు. సిద్ధాంతాల‌ను సైతం ప‌క్క‌న‌బెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా జ‌గ‌న్ గ్రాఫ్ త‌గ్గించ‌డం వాటి త‌రం కావ‌డం లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా ఎన్ని ప‌న్నాగాలు చేస్తున్నా ఫ‌లితం ఉండ‌డం లేదు. ఈ క్ర‌మంలో్నే క‌లిసిక‌ట్టుగా వ్యూహ ర‌చ‌న చేయ‌నున్నాయా..? అంటే స‌మీక‌ర‌ణాలు అవున‌న్న‌ట్లుగానే క‌నిపిస్తున్నాయి.

ఇప్ప‌టి నుంచే త‌గిన బ‌లం పెంచుకోలేక‌పోతే 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో క‌నీసం చెప్పుకోత‌గ్గ సీట్లను అయినా సాధించే ప‌రిస్థితి ఉండ‌ద‌ని ప్ర‌తిప‌క్షాలు భావిస్తున్నాయి. ఒక‌వేళ ఈలోపే జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంలో తుడుచుకుపెట్టుకు పోతామ‌నే ఆందోళ‌న వారిని ప‌ట్టి పీడిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే 2009 లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై మూకుమ్మ‌డిగా పోటీప‌డ్డట్లుగానే.. ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ ను ఢీ కొట్టేందుకు మ‌హా కూట‌మిగా ఏర్ప‌డ‌నున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో పోటీ చేసే అభ్య‌ర్థి విష‌యంలో ఈ త‌ర‌హా సంకేతాలు క‌నిపిస్తున్నాయి. బీజేపీ, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టులు, టీడీపీ ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క సీపీఎం నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ఇంకా ఎటువంటి సంకేతాలు క‌నిపించ‌డం లేదు.

2004లో వైఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి రెండు ప‌ర్యాయాలుగా కొన‌సాగుతున్న టీడీపీ జైత్ర‌యాత్ర‌కు బ్రేక్ వేసి బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీతో విజ‌య‌ఢంకా మోగించారు. అప్ప‌ట్లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మొత్తం 294 స్థానాల‌కు గాను.. సింగిల్ హ్యాండ్ తో కాంగ్రెస్ 185 స్థానాలు,మిత్ర పక్షాలు టీఆర్ఎస్ – 26, సీపీఐ – 6, సీపీఎం -9,మొత్తం 226 స్థానాలు గెలిచేలా చ‌క్కం తిప్పారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ – 47, ఎంఐఎం – 4, బీజేపీ -2, బీఎస్పీ – 1 స్థానానికి ప‌రిమితం అయ్యాయి.

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంత‌కం చేసి సంచ‌ల‌నం సృష్టించారు. ఆ త‌ర్వాత ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ఆరోగ్య శ్రీ‌, ఫీ రియింబ‌ర్స్ మెంట్ ప‌థ‌కాలు ఎంతలా గుర్తింపు పొందాయో అంద‌రికీ తెలిసిందే. అయిదేళ్లు కూడా సంక్షేమ ఒర‌వ‌డి సృష్టించి ప్ర‌జ‌ల‌లో అమిత ఆద‌ర‌ణ పొందారు. ఆయ‌న ఆద‌ర‌ణ‌ను చూసి వైఎస్ ఆర్ ను ఎదుర్కోవ‌డం త‌మ త‌రం కాద‌ని భావించి విప‌క్షాల‌న్నీ మ‌హా కూట‌మిగా ఏర్ప‌డి 2009 ఎన్నిక‌ల్లో పోటీకి దిగాయి. అయిన‌ప్ప‌టికీ వైఎస్ ఆర్ విజ‌యాన్ని అడ్డుకోలేక‌పోయాయి. మొత్తం 294 స్థానాల‌కు గాను కాంగ్రెస్కు 156 సీట్ల‌లో గెలుపొందింది. టీడీపీ – 92, పీఆర్పీ – 18, టీఆర్ఎస్ – 10కు ప‌రిమితం అయ్యాయి. ఓట్ల శాతం స్వ‌ల్పంగా త‌గ్గినా అధిక సీట్ల‌తో వైఎస్ఆర్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఇదిలాఉండ‌గా.. నాడు తండ్రి పాల‌న‌లో ఇది రాజ‌న్న రాజ్యం అంటూ ప్ర‌జ‌లు స‌గ‌ర్వంగా చెప్పుకునేవారో.. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ పాల‌న‌లో కూడా ప్ర‌జ‌లు అదే సంతృప్తితో ఉన్నారు.

దీంతో భ‌విష్య‌త్ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ల‌క్ష్యంగా విప‌క్ష పార్టీల‌న్నీ తెరచాటున భారీ వ్యూహం ప‌న్నుతున్న‌ట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధమవుతోంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో కూడా బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెడుతున్నాయ‌న్న మ‌రో వార్త కూడా దీనికి బ‌లం చేకూరుస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్.. బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారనేది వాస్తవం. పార్టీ పరంగా ఎలా ఉన్నా.. ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జ‌గ‌న్ పై భారీ అభిమానం ఉంది. అదే సమయంలో ఎన్నో ప‌థ‌కాలు మహిళలను మ‌రింత ఆక‌ట్టుకుంటున్నాయి. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని అద్భుత ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడితే జ‌గ‌న్ హీరో కావ‌డం ఖాయం. ఈ ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ను ఎదుర్కొనేందుకు ముందస్తుగానే ఉమ్మ‌డి ఎజెండాతో ముందుకెళ్లాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వారి వ్యూహం ఏంటో.. ఎప్పుడు బ‌య‌ట‌ప‌డుతుందో ఎదురుచూడాలి.