iDreamPost
android-app
ios-app

విశాఖ కార్పొరేష‌న్లో కొత్త త‌ర‌హా పాల‌నకు నాంది?

విశాఖ కార్పొరేష‌న్లో కొత్త త‌ర‌హా పాల‌నకు నాంది?

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సంక్షేమంలోనే కాదు.. ప‌రిపాల‌నాలోనూ ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చారు. సంచ‌ల‌న నిర్ణ‌యాల‌ను తీసుకున్నారు. ముఖ్యమంత్రి కాగానే ప్రాంతాలు సామాజిక వర్గాలు దృష్టిలో పెట్టుకుని అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. ఆయా సామాజిక వ‌ర్గాల జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌ అత్య‌ధిక స్థాయిలో కార్పొరేష‌న్ల‌ను, వాటికి చైర్మ‌న్ల‌ను నియ‌మించి ఔరా అనిపించారు. ఇలా పాల‌నాప‌రంగా కూడా ఎన్నో స‌రికొత్త సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టారు. ఇప్పుడు విశాఖ కార్పొరేష‌న్ విష‌యంలోనూ కొత్త పంథా అనుస‌రిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ పార్టీ కూడా పూర్తి స్థాయి మెజారిటీ సాధించిన దాఖ‌లాలు లేవు. 2007లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు బోటాబోటీ స్థానాల‌ను మాత్ర‌మే ద‌క్కించుకోగ‌లిగింది. తొలిసారిగా వైఎస్ఆర్ సీపీ పూర్తి మెజార్టీతో మేయ‌ర్ పీఠం ద‌క్కించుకుంది. 58 స్థానాల‌ను గెలుచుకుంది.

విశాఖ‌పై ఎంతో ప‌ట్టు ఉంద‌ని చెప్పుకునే టీడీపీ.. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం చేసినా 30 వార్డుల‌కే ప‌రిమిత‌మైంది. సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కో వార్డు, జ‌న‌సేన 3, స్వ‌తంత్రులు 4 వార్డుల్లో విజ‌యం సాధించారు. దీని ప్ర‌కారం అక్క‌డ మేయ‌ర్ పీఠం అధిరోహించేందుకు వైసీపీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఉంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ విశాఖను పరిపాలనా రాజధానిగా చేశారు. ఆ దిశ‌గా అభివృద్ధి చేస్తున్నారు. పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేలా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు పాల‌నాప‌రంగా కొత్త విధానానికి శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

పాల‌నా రాజధానికి ప్ర‌థ‌మ పౌరుడు మేయరే. ఈ నేప‌థ్యంలో విశాఖలో పాలన ఎలా ఉండాలి. ఎవరికి ఏమేం ఇవ్వాలి అన్న దాని మీద వైసీపీ హైకమాండ్ పెద్ద కసరత్తునే సాగిస్తోందని సమాచారం. ఇపుడు కూడా ఏపీకి గుండె కాయ వంటి విశాఖ కార్పోరేషన్ విషయంలోనూ జగన్ ఇలాంటి సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంటారు అని అంటున్నారు. అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే విశాఖకు ఒక మేయర్ ఉంటారు. కానీ డిప్యూటీ మేయర్లు మాత్రం ఆరుగురు ఉంటారని ప్రచారం అయితే సాగుతోంది.

విశాఖ కార్పొరేషన్ లో ఆరు జోన్లు ఉన్నాయి. ప్రతీ జోన్ కి ఒక డిప్యూటీ మేయర్ ని నియమించాలని జగన్ ఆలోచన చేస్తున్నారు అంటున్నారు.అదే విధంగా సామాజికవర్గం కోణం నుంచే కాకుండా పాలనాపరంగా కూడా ఇది కొత్త విధానం అవుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే విశాఖ కార్పొరేషన్ దేశంలోనే మరో మారు మార్మోగడం ఖాయమని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ నెల 18న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో వైసీపీ అధిష్ఠానం భారీ క‌స‌ర‌త్తు చేస్తోంది.