iDreamPost
iDreamPost
అందరికీ గుర్తుండే ఉంటుంది. 2015లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార బాధ్యతలను నారా లోకశ్ స్వీకరించారు. కానీ తీరా ఫలితాలు అందరికీ తెలిసిందే. ఆతర్వాత ఆయనే మంగళగిరిలో ప్రత్యక్షంగా పోటీ చేసి బోల్తా పడిన చరిత్ర కూడా చెరిగిపోదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అటు తెలంగాణాలో కనుమరుగయ్యే దుస్థితి నుంచి ఇటు ఏపీలో దైన్యస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ముంచుకొచ్చిన స్థానిక సమరం ఆపార్టీని తీవ్రంగా సతమతం చేస్తోంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా టీడీపీ పరిస్థితి ఉందని చివరకు ఆంధ్రజ్యోతి యజమాని రాతలను కూడా గమనిస్తే బోధపడుతుంది. ఇలాంటి సంక్లిష్ట స్థితిలో టీడీపీకి చావోరేవోగా లోకల్ వార్ మారడం విశేషంగా చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయితే ఇక క్షేత్రస్థాయిలో కూడా టీడీపీ క్యాడర్ సంపూర్ణంగా నైరాశ్యంలో మునగడం అనివార్యమని అంతా భావిస్తున్నారు.
ఈ దశలో పార్టీని కాపాడుకునే లక్ష్యంతో టీడీపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. చివరకు స్థానిక ఎన్నికలను నిలుపు చేయాలనే ప్రయత్నాలు కూడా చేసింది. కానీ సానుకూలత కనిపించడం లేదు. దాంతో అనివార్యంగా బరిలో దిగుతున్న నేపథ్యంలో ఆఖరికి ఏమవుతుందోననే బెంగ అందరిలో బయలుదేరింది. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ఏం చేస్తారన్నది చర్చనీయాంశం అవుతోంది. పార్టీ అధినేత నేరుగా ఈ ఎన్నికల కోసం ప్రచారం చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పైగా వాటి కోసం ఆయన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. మరి నారా లోకేశ్ ఏం చేస్తారన్నది ఆసక్తికరం. ఆయన ఎన్నికల ప్రచార బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అన్నది టీడీపీ శ్రేణుల్లో కూడా ప్రశ్నగా మారింది.
ముఖ్యంగా కీలకమైన కార్పోరేషన్లుగా ఉన్న జీవీఎంసీ, విజయవాడ, గుంటూరు స్థానాల్లో అయినా నారా లోకేశ్ తన పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయాలని కొందరు కోరుతున్నారు. కానీ లోకేశ్ పర్యటనతో ఒరిగేదేమీ ఉండదని, పైగా ఆయన వ్యవహారశైలి మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న దశలో టీడీపీ అభ్యర్థుల పుట్టి ముంచుతుందనే ఆందోళన కూడా కొందరిలో ఉంది. అదే సమయంలో ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే పార్టీ పునాదులకే బీటలు ఖాయమని అంచనాలు ఉన్న దశలో చివరకు ఏమవుతుందోననే కలవరం టీడీపీ అధిష్టానం ఉంది. బరిలో దిగి చేతులు కాల్చుకోవడమా లేక స్థానిక ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండి చేజేతులా పార్టీ ని బలహీనపరుచుకోవడమా అన్నది టీడీపీ నేతలకు అంతుబట్టని విషయంగా మారింది. ఏం చేస్తే ఏమవుతుందన్నది అర్థంకాని దశలో పచ్చపార్టీ నేతలు సతమతం అవుతున్నారు. చివరకు చంద్రబాబు రాకపోయినా చినబాబు సీన్ లోకి వస్తే ఏమవుతుందో తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు.