Idream media
Idream media
ఏపీలో అధికారం కోల్పోయిన కొద్ది రోజుల నుంచే తెలుగుదేశం అన్న పేరు రాజకీయంగా చప్పబడుతూ వచ్చింది. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాట్లాడిన తీరు ఆ తర్వాత నెల రోజులకే చెప్పినవన్నీ ఆచరణలో పెడుతుండడంతో ఇక మొదలైంది అధికార పార్టీ జోరు. ఆ జోరు దేశ రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారింది. కొత్త కొత్త పథకాల పేరుతో జగన్ దూకుడు పెంచిన కొద్దీ రాష్ట్రంలో మరో పార్టీ గురించే ఆలోచన ప్రజల్లో తగ్గుతూ వచ్చింది. వరుస ఎన్నికల్లో విపక్ష పార్టీల ఓటమే అందుకు నిదర్శనం. మిగతా వాటి సంగతి ఎలాగున్నా, 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల నాయకుడు అధినేతగా పార్టీ, 14 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంది. ఎంతలా అంటే.. ఆ పార్టీ నారా వారా చేతుల్లోనే ఉంటే ఇక మూతపడడం ఖాయమని, కొత్త నాయకత్వం కావాలని, ఆయనే సరిగా ఉంటే.. పార్టీకి ఈ దుస్థితి ఎందుకు.. వంటి వ్యాఖ్యలు బయటి వారి నుంచే కాదు.. సొంత పార్టీ నేతల నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ తో టీడీపీకి కొత్త నాయకత్వం రావాలన్న ప్రచారం మరోసారి వెలుగులోకి వచ్చింది. వరుసగా ఎదురవుతున్న ఘోర పరాజయాల నేపథ్యంలో టీడీపీ నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఉచ్చు బిగుసుకోవడంతో ఏంచేయాల్లో తెలియక టీడీపీ నేతలు సతమతమవుతున్నారు. పార్టీ బలహీనపడిన నేపథ్యంలో కొంతకాలంగా టీడీపీలో నాయకత్వ మార్పుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన వెల్లడించారు. ఇటీవల ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కూడా పార్టీ గురించి, అధినేత తనయుడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వర్గాల్లోనే కాదు.. ఇప్పుడు సినీ వర్గానికి చెందిన వ్యక్తులు కూడా టీడీపీ కొత్త నాయకత్వం గురించి ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు.
తరచూ సోషల్ మీడియాలో ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిల్లుస్తుంటారు రామ్ గోపాల్ వర్మ. రాజకీయ నాయకులైన, సినీ ప్రముఖలపై సందర్భం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వదులుతారు. కాగా ఈసారి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై ట్విటర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ అనే వైరస్ పట్టిందన్నారు. ఈ వైరస్‌కు విరుగుడిగా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా జూనీయర్ ఎన్టీఆర్ వ్యాక్సిన్‌ను వెంటనే పార్టీకి వేయించాలని టీడీపీ నాయకులకు హితవు పలికారు. లేకపోతే మీ పని అంతే! అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. టీడీపీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలన్న ప్రచారం కొద్ది కాలంగా బాగా జరుగుతోంది.
సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబుకు కూడా ఎన్టీఆర్ సెగ తప్పడం లేదు. ఎన్టీఆర్ పేరుతో ఏకంగా చంద్రబాబును అడ్డుకునే స్థాయి అక్కడ ఏర్పడింది. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీలో కీలక బాధ్యతలను తారక్ కు అప్పగించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేసిన అభిమానులు.. చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబు మాట్లాడటం ఆపేసి, కాసేపు మౌనం వహించడం తప్పా ఏమీ చేయలేకపోయారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకత్వంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.