iDreamPost
android-app
ios-app

నిందలు, నిట్టూర్పులు.. ముద్రగడకు నేటి రాజకీయాలు సెట్‌ అవుతాయా..?

నిందలు, నిట్టూర్పులు.. ముద్రగడకు నేటి రాజకీయాలు సెట్‌ అవుతాయా..?

దాదాపు దశాబ్ధం తర్వాత 2016లో కాపు రిజర్వేషన్లు అంశంపై ప్రజల్లోకి వచ్చిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం.. మూడేళ్లపాటు ఉద్యమం సాగించి, పోలీసు కేసులు, అవమానాలు, కష్టాలు పడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశంపై స్పష్టమైన వైఖరితో ఎన్నికలకు వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడంతో.. ఆ అంశంపై ఇక తాను చేసేది ఏమీలేదని ముద్రగడ కొంత మౌనం వహించారు. జగన్‌ ముందే చెప్పడంతో రిజర్వేషన్‌ అంశంపై ఎలాంటి అడుగు వేయలేకపోయారు. దీన్ని అలుసుగా తీసుకున్న టీడీపీలోని కాపు సామాజికవర్గ నేతలు.. ముద్రగడను లక్ష్యంగా చేసుకుని న్యూస్‌ ఛానెళ్లు, సోషల్‌ మీడియాలో దూషించడం, పరుష పదజాలం ఉపయోగించడంతో.. మనస్తాపానికి గురై ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

వివిధ అంశాలపై అప్పుడప్పుడు లేఖల ద్వారా స్పందిస్తున్న ముద్రగడ.. ఇటీవల మూడో ప్రత్యామ్నాయం గురించి ఓ లేఖ రాశారు. రాజ్యాధికారం కోసం కాపులు, దళితులు, బీసీలు కలసి నడవాలని, ఇందుకోసం ఓ బ్లూప్రింట్‌ తయారు చేద్దామంటూ మరోసారి రాజకీయ అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ముద్రగడ పార్టీ ప్రకటించడమే లాంఛనం అని, రాబోయే ఎన్నికల్లో మరో కొత్త పార్టీ ముద్రగడ నేతృత్వంలో రాబోతోందనే చర్చలు సాగాయి. ఆయన అనుచరులు, అభిమానులు కూడా ముద్రగడ లేఖ తర్వాత పార్టీ అంశంపై స్పష్టతతో ఉన్నారు.

1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మొత్తంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి మంత్రిగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ప్రజాజీవితం గడిపిన ముద్రగడ పద్మనాభం.. సాంప్రదాయ రాజకీయాలు సాగించారు. ఇలాంటి రాజకీయాలు సాగించిన ఆయన.. ప్రస్తుత రాజకీయాల్లో రాణించగలరా..? అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. తాజాగా కాపు ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంపై సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ రాసిన లేఖలో ఆయన పేర్కొన్న అంశాలను చూస్తే.. ముద్రగడ ప్రస్తుత రాజకీయాలకు సెట్‌ అవుతారా..? అనే సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

Also Read : పార్టీ గోదావరి జిల్లాల వరకే.. ముద్రగడ మాస్టర్‌ ప్లాన్‌

‘‘మా జాతి నన్ను ఉద్యమం నుంచి తప్పించినా.. భగవంతుడి దయ వల్ల మీ ద్వారా ఆ కేసుల నుంచి మోక్షం కలిగింది. నేరుగా కలిసి ధన్యవాదాలు చెప్పాలనుకున్నా.. మిమ్మల్ని కలిస్తే.. డబ్బు కోసం, పదవుల కోసం కలిశారని ఈ సమాజం ఆడిపోసుకుంటుంది. నాకు జరిగిన అవమానాలు, బాధలు, కష్టాలు, బూతుపురాణాలను దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్‌లో ఉద్యమాలు చేయడానికి ఎవరూ రోడ్డు మీదకు రారు. రాకూడదు. రకరకాల సమస్యల వంకతో చాలా మంది మిమ్మల్ని కలిసేందుకు వస్తారు. నేను మాత్రం రాకూడదు. ఏ జన్మలో చేసిన పాపమో..’’ అంటూ ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో పేర్కొన్నారు.

ముద్రగడ చేసిన ఈ వ్యాఖ్యలే.. ఆయన తాజా రాజకీయాలకు సెట్‌ అవుతారా..? అనే సందేహాలను ప్రజల్లో.. ముఖ్యంగా ఆయన అనుచరుల్లో బలంగా నెలకొని ఉన్నాయి. తన జాతి (కాపు) తనను ఉద్యమం నుంచి తప్పించిందని ముద్రగడ అన్నారు. కాపు రిజర్వేషన్‌ కోసం ఉద్యమం చేసినంత మాత్రాన.. కాపులందరూ ముద్రగడను అభిమానించేవారు ఉండరు. ఉద్యమం చేయడం వల్ల నష్టపోయిన టీడీపీ నేతలు.. ముద్రగడను వ్యతిరేకిస్తారు. విమర్శిస్తారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత జరిగింది అదే. టీడీపీ అనుకూల న్యూస్‌ ఛానెళ్లలో టీడీపీ నేతలు, సోషల్‌ మీడియాలో ముద్రగడను దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన ముద్రగడ.. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన కాపు జాతి తనను ఉద్యమం నుంచి తప్పించిందనడమే విడ్డూరంగా ఉంది. కాపుల్లోనే రాజకీయ కారణాలతో ఎవరో ఏదో అన్నారని.. మొత్తం కాపులనే ముద్రగడ నిందిస్తుండడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

ఏదైనా డిమాండ్‌తో ఉద్యమం చేసినప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు, బాధలు, పోలీసులు కేసులు తప్పవు. ఇవన్నీ తెలియక ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని ప్రారంభించారని అనుకోవడానికి లేదు. అంతకుముందు వివిధ అంశాలపై ఉద్యమాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేసిన చరిత్ర ముద్రగడది. ఉద్యమం చేస్తే.. జరిగే పరిణామాలు తెలిసి కూడా కాపుల కోసం పెద్దన్న పాత్ర పోషించి మూడేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపిన ముద్రగడ.. ఇప్పుడు తాను పడిన కష్టాలను ఎవరూ పడకూడదు.. ఎవరూ ఏ ఉద్యమాలు చేయకూడదంటూ.. తాను చేసిన ఉద్యమాన్ని తానే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పైగా కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు ఉద్యమం చేసి తప్పు చేశాననే భావనలో ముద్రగడ మాట్లాడుతుండడం గమనార్హం.

Also Read : తగ్గేదేలే.. నేలకు కొట్టిన బంతిలా పైకిలేస్తా – ముద్రగడ

వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రులను, వివిధ రాజకీయ పార్టీల నేతలను వారితో విభేధించే నేతలు చాలామంది కలుస్తుంటారు. ఆ సమయంలో కలిసిన సదరు నేతలు విమర్శలపాలు అవుతుంటారు. చంద్రబాబు నాయుడు విధానాలను, టీడీపీ ప్రభుత్వంలో అవినీతి నిత్యం ఎండగట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా.. ఒక దశలో చంద్రబాబును కలిశారు. రాజమండ్రి నుంచి అమరావతి వెళ్లి.. రాష్ట్ర విభజనకు చట్టబద్ధతలేదని, ఈ విషయంపై పార్లమెంట్‌లో మాట్లాడాలంటూ 2018లో చంద్రబాబుకు సూచించారు. ఆ తర్వాత ఉండవల్లి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అవి కాలగర్భంలో కలిసిపోతాయి. ఇలాంటి పరిస్థితి సర్వసాధారణంగా ఉంటుంది. అయితే తాను చంద్రబాబును, జగన్‌ను కలిస్తే.. డబ్బు కోసం, పదవుల కోసం అని ఈ సమాజం ఆడిపోసుకుంటుంది.. కాబట్టి కలవలేకపోతున్నా.. నేను ఏ జన్మలో పాపం చేశానోలాంటి మాటలు ముద్రగడ మాట్లాడడం ఆయన మనస్తత్వాన్ని తెలుపుతోంది.

సాంప్రదాయ రాజకీయాలకు ఇవి రోజులు కావు. విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతోపాటు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వహననాలు ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయాయి. వ్యక్తిగత ఛరిష్మా పెంచుకోవడం కన్నా.. ప్రత్యర్థులపై బురదజల్లడం ద్వారా రాజకీయాల్లో పైచేయి సాధించాలనుకునే రాజకీయనేతలే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో.. మాట అంటే పడని, మాట అన్నారని ఏళ్ల తరబడి బాధపడి, ఎవరో విమర్శించారని నడుస్తున్న బాట నుంచి తప్పుకోవడం, అప్పటివరకు ఎవరి అభ్యున్నతి కోసం పని చేశారో.. వారినే నిందించడం.. వంటి వ్యవహార శైలి, వ్యక్తిత్వం ఉన్న ముద్రగడ పద్మనాభం ప్రస్తుత రాజకీయాలకు సెట్‌ అవుతారా..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.

పార్టీ ఏర్పాటు ఆలోచన చేసినప్పుటి నుంచే.. జనసేన ఓట్లు చీల్చేందుకే ఇలా పార్టీ పెడుతున్నారంటూ ముద్రగడపై జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. నిజంగా పార్టీ పెడితే.. విమర్శలు, ఆరోపణలు, దూషణలు రాజకీయ ప్రత్యర్థుల నుంచి సునామిలా తప్పక వస్తాయి. మరి సాంప్రదాయ రాజకీయాల కాలంలోనే ఉన్న ముద్రగడ వాటిని విశాల దృక్పథంతో తీసుకుని రాజకీయ పార్టీని నడిపించగలరా..? ఆ పార్టీలో తుదికంటూ కొనసాగగలరా..? రాజ్యాధికారం సాధించగలరా..? అంటే ఈ ప్రశ్నలకు ముద్రగడ తప్పా మరెవరూ సమాధానం చెప్పలేరు.

Also Read :  కేసులు ఎత్తేసినందుకు ధన్యవాదాలు.. సీఎంకు ముద్రగడ భావోద్వేగ లేఖ