Idream media
Idream media
పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ ఉనికి గతంలో అంతంత మాత్రమే. మొదటి సారి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయిన హయాంలో కూడా ఇక్కడ బీజేపీకి పెద్దగా పట్టు లేదు. అయితే, గత లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. ఇక బెంగాల్ లో తమకు తిరుగులేకుండా చేసుకుందామని అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే జోరుగా రాజకీయాలు ప్రారంభించింది. తన మార్క్ రాజకీయాలతో బెంగాల్ అంతటా బీజేపీని విస్తరించింది. కీలక నేతలు అందరూ ఆ రాష్ట్రంలో కలియ తిరుగుతూ ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయాన్ని వేడెక్కించారు. ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు.
కేంద్రంలో మోదీ హవా.., స్థానికంగా బీజేపీ నేతల హడావిడిని చూసి వచ్చేది బీజేపీయే అనుకుని చాలా మంది భావించారు. పది, ఇరవై కాదు.. ఏకంగా 50 మందికి పైగా టీఎంసీ నాయకులు ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. వారిలో 33 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ పరిణామాలు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఒకింత కుంగ దీశాయి. అత్యంత కీలకమైన, నమ్మకమైన సువేందు అధికారి కూడా బీజేపీలోకి వెళ్తారని ఊహించలేదామె.
ఈ పరిణామాల క్రమంలోనే మొన్నీమధ్య జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. మమతా బెనర్జీ తన శక్తినంతా కూడగట్టుకుని, బీజేపీ ప్లాన్ లన్నింటినీ ఛేదిస్తూ ఒంటరిగానే ఎదుర్కోన్నారు. ఎన్నికల వేడి ఎలా ఉందంటే.. అవి ముగిసి చాలా కాలం అయినా ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పటికీ చక్కబడలేదంటే ఇరు పార్టీలూ ఎంత సీరియస్ గా తీసుకున్నాయోనన్న విషయం అర్థం అవుతుంది.
ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన దూకుడును ఎన్నికల తర్వాత టీఎంసీ చేస్తూ బీజేపీ నేతలను వేటాడేస్తోంది. ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే కీలక పాత్ర పోషించవచ్చునని ఆ పార్టీలోకి వెళ్లిన టీఎంసీ నేతలంతా సందిగ్ధంలో పడ్డారు. మమత పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అదునుగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలను లాగే పనిలో బీజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 33 మంది టీఎంసీలో చేరబోతున్నారని.. బీజేపీకి గట్టి దెబ్బపడబోతోందని టాక్ నడుస్తోంది. ఇక వీరే కాదు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ కుమారుడు సుబ్రన్షు కూడా టీఎంసీలో చేరాలని డిసైడ్ అయ్యాడని టాక్. గత బెంగాల్ ఎన్నికల్లో 294 సీట్ల బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ ఏకంగా 213 సీట్లు గెలిచింది. బీజేపీ 77 సీట్లను కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు 50 మందికి పైగా టీఎంసీ నాయకులు బీజేపీలో చేరారు. ఇందులో 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి బీజేపీ మాత్రమే గెలుస్తుందని వారికి పూర్తి ఆశ ఉండేది. బీజేపీ ఘోర ఓటమితో ఇప్పుడు ఏదైనా చేసి తిరిగి టీఎంసీలోకి వారు తిరిగి రావాలనుకుంటున్నారు. బెంగాల్ లో ప్రతిచోట అధికారంలో ఉన్న పార్టీ ప్రమేయం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీని లేకుండా చేసే గట్టి ప్రయత్నాల్లో మమత ఉన్నట్లు తెలుస్తోంది.