Idream media
Idream media
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతాబెనర్జీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఎంత ప్రయత్నించినా ఆమె ఆ పార్టీని ఢీ కొట్టి మట్టికరిపించారు. దీంతో ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశం మొత్తం చూపును రాజకీయంగా తనవైపు మళ్లించుకున్నారు. టీఎంసీకి ఘన విజయం సాధించేలా కృషి చేసి మూడోసారి ముఖ్యమంత్రి అయిన మమత.. ఆమె పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో మాత్రం సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ సీఎంగా మమత ప్రమాణస్వీకారం చేయడంతో ఆరు నెలల్లోగా ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలవాల్సి వచ్చింది.
భవానీపురం నుంచి ఆమె పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇక్కడ నుంచి వరుసగా రెండు సార్లు మమత విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టిన ఆమె ఇక్కడి నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా అలవోకగా గెలిచే అవకాశముందని అత్యధిక మంది భావిస్తున్నారు. తనకు కంచుకోట అయిన భవానీపురంలో ఆమెకు ఎదురు నిలిచి ఏ పార్టీ నిలబడలేదని చెప్తున్నారు. కానీ, వచ్చిన అవకాశాన్ని బీజేపీ కూడా అంత ఈజీగా వదులుకోదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మమత బీజేపీని టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని దేశ వ్యాప్తంగా ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. ఇందుకు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా మోదీపై రాజకీయ కత్తి దూస్తున్నారు. ఈ నేపథ్యంలో నందిగ్రామ్ లో సువేందు అధికారి వంటి బలమైన నేతతో మమతకు చెక్ పెట్టిన బీజేపీ.. ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలో కూడా పోటీ తీవ్రంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
Also Read : కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు…?
అయితే.. ఈసారి మమత గెలుపుపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మెజార్టీ పరిశీలకులు, టీఎంసీ నేతలు భావిస్తున్నారు. అయినప్పటికీ బీజేపీ మాత్రం చివరి వరకు పోరాడేందుకు సిద్ధమవుతోంది. నామినేషన్ వేసిన నాటి నుంచే ఫిర్యాదుల పరంపరకు సిద్ధమైంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన నామినేషన్ పత్రాల్లో తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పొందుపరచలేదని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. బెంగాల్‌లోని భవానీపూర్ నియోజకవర్గానికి ఈ నెల 30న జరిగే ఉప ఎన్నిక కోసం మమత గత వారం నామినేషన్ దాఖలు చేశారు. క్రిమినల్ కేసుల వివరాలు నామినేషన్ పత్రాల్లో తెలియజేయకపోవడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని బిజెపి అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సజల్‌ఘోష్ అన్నారు. అసోంలోని పలు పోలీస్ స్టేషన్లలో మమతపై కేసులున్నాయని ఆయన ఆరోపించారు.
వాస్తవాలను దాచిపెట్టినందుకు మమత నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరిస్తుందని సజల్‌ఘోష్ పేర్కొంటుండడంపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా మమతపై బిజెపి ఇలాంటి ఫిర్యాదే చేయగా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు అదే జరుగుతుందని టీఎంసీ నేతలు చెబుతున్నారు. కాషాయపార్టీవి ఆధారంలేని ఆరోపణలని బెంగాల్ రవాణాశాఖమంత్రి ఫిర్హాద్ హకీమ్ ఇప్పటికే కౌంటరిచ్చారు. ఉప ఎన్నికలో మమత పోటీలో ఉండడం, బీజేపీ వినూత్న ప్రచారాలు చేస్తుండడంతో బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు కూడా హాట్ హాట్ గా సాగుతున్నాయి.
Also Read : జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ,డీజిల్ – రాష్ట్రాలపై నెపం నెడితే సరిపోతుందా?