iDreamPost
android-app
ios-app

తండ్రి జైల్లో.. కొడుకు ఢిల్లీలో.. వారసుడిగా లోకేష్‌ ఫెయిలా?

  • Published Oct 19, 2023 | 12:40 PMUpdated Oct 19, 2023 | 12:40 PM
  • Published Oct 19, 2023 | 12:40 PMUpdated Oct 19, 2023 | 12:40 PM
తండ్రి జైల్లో.. కొడుకు ఢిల్లీలో.. వారసుడిగా లోకేష్‌ ఫెయిలా?

సాధారణంగా రాజకీయాల్లో ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నా సరే.. నేతలు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక అరెస్ట్‌లు వంటివి చోటు చేసుకుంటే చాలు.. జనాల్లో తమ మీద సానుభూతి పెంచుకోవడం కోసం.. ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో.. అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. ఎలాంటి తప్పు చేయకపోయినా తమ మీద కక్ష్య కట్టి.. తప్పుడు కేసులు పెట్టారని గగ్గోలు పెడతారు. అయితే విచిత్రంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌ కేసులో మాత్రం.. ఇలాంటి పరిణామాలు కనిపించడం లేదు. బాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా దూకుడుగా జనాల్లోకి వెళ్దామంటే.. ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నారు టీడీపీ నేతలు.

బాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేవారు.. ముందుండి నడిపించే వారు కరువయ్యారేనది వాస్తవం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాధారణంగా వారసులంటే.. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే తమను తాము నిరూపించుకోవాలి. పార్టీని ముందుండి నడిపించాలి. కానీ చంద్రబాబు వారసుడు లోకేష్‌ మాత్రం ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఢిల్లీకే పరిమితమైన లోకేష్‌..

బాబు అరెస్ట్‌కు ముందే నారా లోకేష్‌ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించాడు. అయితే చంద్రబాబు అరెస్ట్‌తో ప్రస్తుతం దానికి బ్రేక్‌ పడింది. చంద్రబాబు అరెస్ట్‌ గురించి జాతీయ స్థాయిలో ఏదో చేద్దామనుకుని ఢిల్లీ వెళ్లిన లోకేష్‌కు అక్కడ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈలోపే అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడు కేసులో.. నారా లోకేష్‌ ఏ14 గా తేలారు. దాంతో ఆయన ఇక ఢిల్లీకే పరిమితం అయ్యారు.

ఈక్రమంలో అరెస్ట్‌ భయంతోనే లోకేష్‌ ఢిల్లీ నుంచి రావడం లేదని.. ఇక యువగళం అటకెక్కినట్లే అనే ప్రచారం సాగింది. దాంతో కంగారు పడ్డ టీడీపీ నేతలు.. లోకేష్ వ‌చ్చేస్తున్నాడ‌ని, యువ‌గ‌ళం కొన‌సాగింపు అంటూ లీకులిచ్చారు. ఇది జరిగి కూడా 15 రోజులు గడుస్తున్నా.. మళ్లీ ఆ ఊసే లేదు. దాంతో లోకేష్ పాద‌యాత్ర ఆగిపోయినట్లే అనే ప్రచారం సాగుతోంది.

చంద్రబాబు స్వార్థం.. టీడీపీకి శాపం

ఈ క్రమంలో మరో అంశం కూడా తెర మీదకు వస్తుంది. చంద్రబాబు తన వారసుడిగా లోకేష్‌నే తీసుకురావాలని పట్టుబట్టారు.. కానీ చినబాబుకి అంత సమర్థత లేదని తాజా పరిణామాలు చూస్తే అర్థం అవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తండ్రి అరెస్ట్‌ అయ్యి జైలుకి వెళ్తే.. పార్టీని ముందుండి నడిపించాలి.. కార్యకర్తలకు ధైర్యం చెప్పాలి.. మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలి. కానీ ఇక్కడ లోకేష్‌ పరిస్థితి చూస్తే మాత్రం.. అందుకు భిన్నంగా ఉంది.

రాష్ట్రంలో ఉండి పార్టీని కాపాడుకోవాల్సిన తరుణంలో ఆయన వెళ్లి ఢిల్లీలోనే రోజుల తరబడి ఉంటున్నారు. దాంతో లోకేష్‌ సామార్థ్యం మీద జనాలకే కాక టీడీపీ శ్రేణులకు కూడా అనుమానం కలుగుతుందట. పెదబాబు జైల్లో ఉంటే.. చినబాబు జనాల్లో ఉండాలి కానీ.. ఢిల్లీలో ఉండటం ఏంటని చర్చించుకుంటున్నారట. ఇలా అయితే భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ తమ్ముళ్లు.

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. లోకేష్‌ నిరసన కార్యక్రమాల్లో తూతుమంత్రంగానే పాల్గొన్నాడు తప్పితే.. ఎక్కడా దూకుడు ప్రదర్శించలేదు అంటున్నారు రాజకీయ పండితులు. ఈసమయంలోనే పాదయాత్రను కొనసాగించాలి కానీ లోకేష్‌ మాత్రం ఆ ఊసే మరిచి.. ఢిల్లీకే పరిమిత అయ్యారు. పైగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో లోకేష్‌ కూడా అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉంది.. అదే జరిగితే.. ఏపీలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.. చంద్రబాబు స్వార్థమే ఇందుకు కారణం అంటున్నారు విశ్లేషకులు. అర్హతలు లేకపోయినా.. తన కొడుకే వారసుడు కావాలని.. మరొకరిని ఎదగనివ్వలేదు. ఇటు చూస్తేనేమే.. వారసుడిగా లోకేష్‌ పూర్తిగా ఫెయిల్‌ అయ్యాడు అంటున్నారు విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి